03 May 2016

ఒక 'ఆత్మ'కథ

ఓ కథ రాద్దామని కూర్చున్నా -
ఎవరి కథ రాయాలి....?
ఎవరి కథో ఎందుకు -
నా కథే రాసుకుంటే పోలా?
గుడ్ ఇడియా.....
నా చిన్నప్పట్నుంచీ జరిగిన విషయాలన్నీ
ఒక్కసారిగా బుర్రలో గిర్రున తిరిగాయ్...
మంచి కథే అవుతుంది -
పెన్నూ పేపరూ తీసుకుందామని చెయ్యి చాపా...
ఆశ్చర్యం -
అరే... చేతికి చిక్కడంలేదు
ఎంతో ప్రయత్నించా...
అయినా వేళ్లకు పట్టుదొరకలేదు

ఎందుకో...???

ఎందుకంటే....
మరి ఆత్మలు రాయలేవుగా!!!

25 April 2016

ఎదురుచూపు


ఈసారైనా
ఆ కోయిల తిరిగి వస్తుందని...
తన మధుర గానాన్ని వినిపిస్తుందని...
ఎంతగానో ఎదురుచూశా
ప్చ్...లేదు, రానేలేదు -
ఎప్పుడూ తను కూర్చునే
ఆ పచ్చని చెట్టు 
వేర్లతొపాటుగా పెకలించబడిందని 
ఆ కోయిలకు తెలిసిపోయిందనుకుంటా...
కానీ -
తను రాకపోతే
ఈ తనువే ఆవిరై...
విశ్వమంతా ఆవరించి 
తనకోసమే కలవరిస్తుందని
బహుశా తనకు తెలియదేమో???

12 April 2016

భక్తి

గుడి మెట్లు
ఎన్ని ఎక్కామన్నది కాదు...
ఎద తలుపులు
ఎన్ని తెరిచామన్నది ముఖ్యం!

20 March 2016

పక్షి గూడు

పక్షికున్న ధైర్యం
మనిషికెక్కడిది...?

ఎక్కడెక్కడ నుండో 
ఏరుకొచ్చిన పుల్లలతో...
చెట్టు చిటారు కొమ్మన, 
అగాథంలోకి  వేళ్ళాడుతున్నట్టుగా 
కట్టిన పక్షి గూడు -  
పక్షి కూనలు పొరపాటున పడిపోతే 
ఏమౌతుందా అని ఆలోచిస్తేనే
ఒళ్ళు జలదరించే
ఆ పక్షి గూటిని చూస్తే
నాకిదే అనిపిస్తుంది - 
పక్షికున్న ధైర్యం  
మనిషికి లేదేమోనని.

11 January 2016

కాల మహిమ

వన్నెలు చిమ్మే సీతాకోక చిలుక
మసకబారి నేలమీద పడిఉంది
నిర్జీవంగా...


రంగులొలికే ఇంద్రధనుస్సు
ఆకాశంలో అలుముకు పోయింది
ఆనవాళ్ళు లేకుండా...

గిర్రున తిరిగే రంగుల రాట్నం
నిశ్శబ్దంగా నేలకొరిగింది
శిథిలమై..ఛిద్రమై...

రోజూ కిటకిటలాడిన గుడి
వెలవెల పోయింది
భక్తుల అలికిడిలేక...

నిత్యం కళకళలాడిన ఇల్లు
పాడుబడిపోయింది
మనిషి జాడలేక...

జీవితమూ అంతే-
వెలుగు జిలుగుల్లో
తళతళ మెరుస్తుంది..
చేయిజారితే నిస్తేజంగా మారుతుంది-

వెలిసిన వర్ణాల్లో వెతికితే
దొరికేది అంధకారమే...
వొలికిన కన్నీళ్లను దోసిటపడితే
మిగిలేది అంతులేని ఆవేదనే!!! 

27 November 2013

ఉటోపియా

ఇది ప్రపంచంలోనే  
అతి పెద్ద ప్రజాస్వామ్యం - 
ఇక్కడ ప్రజలకోసం,
ప్రజలచేత ఎన్నుకోబడే
ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయ్ - 
ఇక్కడ ప్రజలే స్వాములు..
పాలకులు ప్రజలకు దాసులు..
అనుక్షణం ప్రజా ప్రయోజనాలకోసం
అందరూ పాటుపడుతూ ఉంటారు..
ఇక్కడ కరువు కాటకాలొస్తే 
తక్షణమే ఆదుకుంటారు 
ప్రతియేటా లక్షల ఉద్యోగాలు,
నిరుద్యోగులకు భృతులు,
వయో వృద్ధులకు పింఛన్లు, 
ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు...
ఇక్కడ రైతే రాజు
ఆత్మహత్యలంటే ఏంటో ఎరగడు...
ఇక్కడ స్త్రీలను పూజిస్తారు,
మగవాళ్లతో సమానంగా చూస్తారు -
ఇక్కడ రాజకీయాలు కులమతాలకతీతం
ఇక్కడ జన్మించడం పూర్వ జన్మ సుకృతం
ఇక్కడ చావడం ప్రతి ఒక్కడి జీవితాశయం! 

స్వేచ్ఛా గీతం

పురి విప్పిన నెమలినై 
శివమెత్తిన కడలినై   
గగనాన్ని తాకాలనుకునే నన్ను   
ఆంక్షల వలయంలో బంధిస్తానంటే ఎలా?

ఈ అడవిలో....
స్వేచ్చగా విహరించాలనుకోవడం తప్పా?
ఈ నేల నాది,
ఈ గాలి నాది... 
ఈ చెట్లు, ఈ పక్షులు-
నా నేస్తాలు.. 
ఇక్కడ తిరుగాడే వన్యమృగాలు-
నా చెలికాళ్ళు..

నేను పుట్టగానే నన్ను లాలించిన పరిసరాలు...
నా ప్రతి శ్వాసలో, ప్రతి ఆశలో 
నా ప్రతి అడుగులో నా వెంటే ఉంటూ
నన్ను నడిపించిన పంచభూతాలు...
వాటినుండి ఈరోజు నన్ను వేరుచేస్తానంటే
నేను ఆక్షేపించడం నేరమా?

చావైనా బ్రతుకైనా  అడవిలోనే-  
ఎప్పటికైనా నా అంతిమ శ్వాస..
నా అడవి సాక్షిగా,  
ఈ పంచభూతాల్లో కలసిపోవాల్సిందే..

నా మాటకు తిరుగులేదు!
నా బాటకు అడ్డులేదు!!
నా పాటకు చావులేదు !!!