10 December 2011

ఈ జన్మకిది చాలు

నన్ను ప్రేమించావనుకున్నా..
కానీ ఇంతలా అనుకోలేదు
ఏంటసలిది...?
ప్రేమ కోసం ఏమైనా చేస్తానంటే
ఏదో అంటున్నావనుకున్నా
ప్రేమకు హద్దులనేవే లేవనీ
ఇలా నిరూపిస్తావనుకోలేదు
నన్నింతలా ప్రేమించేవాళ్లున్నారని
తెలిసింతరువాత
ఇక నాకేమీ అక్కరలేదు
నేను ఉన్న పళంగా
చచ్చిపోయినా పరవాలేదు
ఈ జన్మకిది చాలు..
ఈ జన్మకిది చాలు...!

30 October 2011

గెలుపు

పొటీలో ఒకరిని ఓడిస్తేనే
కాదు గెలుపు -
ఓటమిని సహృదయంతో
స్వీకరించినవాడిది కూడా గెలుపే!

ప్రేమ

ఒకరిని కలిసినప్పుడు
సంతోషంగా ఉంటే
అది ఇష్టం -
ఒకరు లేనప్పుడు
చచ్చిపోవాలనిపిస్తే
అది ప్రేమ!

ఓటమి

గెలుపును
తలకెక్కించుకోవడమే
అసలైన ఓటమి!

త్యాగం

నీ బాగు నువ్వు చూసుకుంటే
అది స్వార్థం ..
నీ కుటుంబాన్ని బాగుచేసుకుంటే
అది ధర్మం..
ఆ రెంటితోపాటు దేశంకోసం
కృషి చేస్తే అది దేశభక్తి..
అవి రెండూ కాదని దేశానికే
అంకితమైతే అది త్యాగం!

అమ్మ

నువ్వు ప్రయోజకుడివయ్యావా లేదా
అని చూస్తాడు నాన్న..
తనపరువు తియ్యకుండా ఉంటే చాలు
అనుకుంటాడు అన్న..
పెళ్లైన తరువాత కూడా
తనమీద ప్రేమ అలాగే ఉండాలని
కోరుకుంటుంది చెల్లి..
రోజూ కడుపునిండా తింటున్నాడా లేదా
అని కలవరపడేది అమ్మ ఒక్కతే!

28 October 2011

విద్య

కోటి విద్యలు
కూటి కొరకే
అది నిన్నటి మాట-
నేటి విద్యలు
పోటీ వరకే
ఇది ఈనాటి బాట!

అందం

చంద్రబింబంలా వెలిగే నీ మోము
చేపపిల్లల్లా మెరిసే నీ కళ్లు
ఎన్నటికీ చెరగని నీ చిరునవ్వు
బూరెల్లా పొంగిన నీ బుగ్గలు
శంఖంలాంటి నీ మెడ
కందిరీగలాంటి నీ నడుము
నల్లని త్రాచులా నాట్యమాడే నీ వాల్జెడ -
ఊహూ...ఇవేమీ కాదు -
ప్రేమతో నిండుగా తడిసిన నీ కళ్లతో
ఆర్తిగా నువు నన్ను చూసే చూపులేదూ...
అందులోనే ఉంది నీ అందమంతా!

నవ్వు

వద్దనుకున్నా
వచ్చేది నవ్వు
ఒకప్పుడు -
కావాలనుకున్నా
నవ్వలేకపోతున్నాను
ఇప్పుడు!

26 October 2011

తృప్తి

మన ఆత్మీయులకోసం
జీవించడంలో ఉన్న ఆనందం
మనకోసమే బ్రతకడంలో లేదు-
జీవితంలో కొన్ని క్షణాలైనా
ఇతరులకు ఉపయోగపడితే
దాన్లో ఉన్న తృప్తే వేరు!

25 October 2011

భ్రమ

భ్రమ -
ఎంత గొప్ప పదం
పుట్టుకతోనే
ఆ బ్రహ్మ దేవుడు
ప్రతి మనిషికీ ఇచ్చిన వరం -
ఈ భ్రమ అనేదే లేకపోతే
మనిషి ఏమైపోయేవాడో...
అనుక్షణం మనిషి
వెన్నంటి ఉండే భ్రమ -
లేనిది ఉన్నట్టు
ఉన్నది లేనట్టు -
ఎంత ఆనందాన్ని కలిగిస్తుందొక్కక్కసారి
అంతే విషాదంలోక్కూడా
తోసెయ్యగలదు అప్పుడప్పుడు..
ఏదేమైనా భ్రమ అనేది
ఆ దేవుడిచ్చిన పెద్ద సౌకర్యం
మనిషికి ఏమున్నా లేకున్నా
జీవితమంతా భ్రమలో బ్రతికెయ్యొచ్చు -
ఈ రోజు కాకున్నా రేపైనా
మంచిరోజులు వస్తాయని ఒక అభాగ్యుడి భ్రమ..
వచ్చే సంవత్సరమైనా
వర్షాలు సకాలంలో పడతాయని
ఓ రైతు భ్రమ..
ఎప్పటికైనా దేవుడు దిగివచ్చి
దుర్మార్గులను శిక్షించి
సన్మార్గులను రక్షిస్తాడని
ఓ అమాయకుడి భ్రమ..
మన పిచ్చిగానీ
ఆ దేవుడే ఒక పెద్ద భ్రమేమో
లేదు లేదు అలా అంటే
దేవుడికి కోపమొస్తుంది
మనల్ని శిక్షిస్తాడు -
ఇదేమరి అసలైన భ్రమంటే!

గుడి(సె)

రోడ్డు మధ్యలో ఉన్న
గుడిని తొలగిస్తే
పెడతాడేమో దేవుడు
శాపం -
రోడ్దు పక్కనున్న
గుడిసెను పీకేస్తే
ఎవరికీ అంటదు
పాపం!!

21 October 2011

మానవత్వమా నీవెక్కడ?


నీతులూ, విలువల గురించి
నాకు చెప్పకు
నీలో మానవత్వం ఉందో లేదో చెప్పు
మనిషన్న వాడు..మానవత్వం ఉన్నవాడు
ఎక్కడున్నాడో చూపించు
మిగతావాళ్లతో నాకనవసరం
ఆకలితో కడుపు మండే వాడికి
గీతను బోధిస్తే వింటాడా?
అవమానంతో ఊగిపోయే వాడికి
నీతిసూత్రాలు వళ్లిస్తే ఊరుకుంటాడా?
నీ చాదస్తంగానీ...
భంగపడ్డవాడి విశ్వరూపం ముందు
ఆ భగవంతుని విశ్వరూపం చిన్నబోదూ...
నిన్నూ నన్నూ విడదీయడానికి
వేదాలు,స్మృతులూ అవసరమేమో...
మనిషిని మనిషిగా గుర్తించడానికి
మనసుంటే చాలదా..!
కోట్లతో పనిలేదు..కోరిక ఉంటే చాలు
మానవత్వంతో ఎదుటి మనిషిని పలకరించడానికి!

19 October 2011

ఎవరికెవరు...

ఇక్కడ దారంకంటే సులువుగా
బంధాలు తెగిపోతుంటాయి...
తల్లీబిడ్డలూ, అన్నదమ్ములూ, భార్యాభర్తలూ
ఎవరికివారే యమునా తీరే...
ఇక్కడ పచ్చనోట్లే మాట్లాడతాయి
పచ్చినిజాలు సిగ్గుపడుతూ తలొంచుకొని
పక్కన నిల్చుంటాయి...
ఇక్కడ మనుషులకన్నా, మమతలకన్నా
మార్కెట్‌ సంబంధాలే ముఖ్యం...
ఇక్కడ అందరూ విజేతలే
ఎప్పుడూ ఓడేది మాత్రం మానవత్వమే..
ఇక్కడ ఎవరూ ఎవరికి ఏమీ కారు
ఎంత వెతికినా...

బంధాలు

చుక్కలన్నీ
కలిపితేనే ముగ్గు
పూవులన్నీ
గుచ్చితేనే మాల
అక్షరాలను
కూరిస్తేనే వాక్యం
మనుషులంతా
కలిస్తేనే సమాజం
అనురాగాలను
పంచితేనే అనుబంధం
అప్యాయతలు
పెంచితేనే పెనుబంధం!

వాన వెలిసింది

వాన
జోరున కురిసి
వెలిస్తే...
కళ్లు
భోరున ఏడ్చి
నిలిస్తే...
పేరుకున్న కుళ్లు
కడిగేసినట్టుగా -
చేరుకున్న బాధ
తుడిచేసినట్టుగా -
ఎంత కాంతి
ఆ పరిసరాల్లో!
ఎంత శాంతి
ఆ కన్నులలో!!

18 October 2011

ఆ గుండెకే తెలుసు...

నవ్వు -
సంతోషానికే సంకేతం కాదు-
దుఃఖం -

బాధకే చిహ్నం కాదు-
గుండెకే తెలుసు
ఆ గుండెలో ఏముందో-
గుండె విప్పితే గానీ
అర్ధంకాదు మనకు
అందులో గూడు కట్టిన
బాధ ఎంతుందో !

17 October 2011

దృక్పథం

జీవితాన్ని -
ఒకడు..
కాచి వడగడతాడు
ఇంకొకడు..
తూచి వెలకడతాడు!

అమూల్యం

కాయం లోని
ప్రతి కణమూ
విలువైనదే -
కాలం లోని
ప్రతి క్షణమూ
అమూల్యమైనదే!

మనసు లేని మనిషి

రాళ్లు విసిరినా ఫలాల్నే
అందిస్తుంది చెట్టు...


వళ్లంతా తూట్లు పొడిచినా మధురమైన
గానాన్నే వినిపిస్తుంది మురళి...


నిప్పులో కాల్చి సమ్మెటతో కొట్టినా
మన అవసరానికే ఉపయోగపడుతుంది ఇనుము...


గునపాలతో తవ్వినా మన దాహమే
తీరుస్తుంది నేల...


కానీ ఎందుకో -

ప్రేమించినా కూడా తిరిగి ప్రేమను
పంచలేకపోతున్నాడు మనిషి...

16 October 2011

మనసు గతి ఇంతే...

పగలంతా కష్టపడి
ఎలాగో నిన్ను మర్చిపోతాను-
ఖర్మ...
చీకటిపడిందో లేదో
మళ్లీ నువ్వు గుర్తొస్తావు-
ఇక రాత్రంతా జాగారమే!

15 October 2011

వేశ్య

 



మనసు చంపుకొని
తనువు పంచుకొని
తన ఆకలి మరచి
మరొకరి ఆకలి తీర్చి
మోసానికి బలియై
సంఘానికి వెలియై
బ్రతుకు ముళ్ళ చెట్టై
వళ్లు రోగాల పుట్టై -





14 October 2011

హే రాం!

గాంధీ టోపీ
పెట్టుకొని
గాంధీకే టోపీ
పెడుతున్నారు నేడు
మన నేతలు!

ఊరు పారిపోయింది

చెఱువు ఎండిపోయింది
చెట్టు వాడిపోయింది
పిట్ట ఎగిరిపోయింది
ఊరు పారిపోయింది!

విశ్వాత్మ

నేను భగ భగ మండుతున్న సూర్యుణ్ణి మింగి
అగ్ని గోళమై వెలుగుతున్నాను..
కణ కణలాడే నిప్పు కణికలే  తిని
వేడి సెగనై రగులుతున్నాను..
హోరున వీచే గాలిని పీల్చి
ఝుంఝూనిలమై చెలరేగుతున్నాను..
సప్త సముద్రాల నీటిని తాగి
పెను ఉప్పెననై కబళిస్తున్నాను -
ఇదే నా ఆఖరి ప్రస్థానం
కాంతి రథాన్ని లాక్కుంటూ వస్తున్నాను
తోవలో అన్నీ ముళ్ళూ రాళ్ళే..
శరీరమంతా గాయాలే
నా ఆత్మకు అయిన  గాయం ముందు అవెంతలే..?
సుడి గాలితో చుట్టేస్తాను
ఆకాశానికి ఎత్తేస్తాను..
ఎర్రని లావానై కప్పేస్తాను
పాతాళానికి తొక్కేస్తాను..
దావానలంలా వ్యాపిస్తాను
హిమాలయాలనే కరిగిస్తాను
దుర్మార్గాన్ని భూస్థాపితం చేసి..
సన్మార్గంలో నడిచే వాళ్లను చేయిపట్టుకు నడిపిస్తాను!

13 October 2011

నీతోనే ఉండాలని...

నీ పెదవులపై
చిరునవ్వునై నిలవాలనుంది
నీ కంటిపాపలో
వెలుగునై నిండాలనుంది
నీ హృదయంలో
అనురాగాన్నై పాడాలనుంది
నీ నుదిటిపై
సిందూరమై మెరవాలనుంది
నీ అరచేతిలో
గోరింటాకునై పండాలనుంది
నీ శ్వాసలో
ఊపిరినై చేరుకోవాలనుంది
నీ కలలలో...
నీ ఊహలలో...
నీ ధ్యాసలలో...
నీ ప్రతి క్షణంలో
నీ అణువణువులో
నీ అడుగడుగులో
నిక్షిప్తమై
నిబిడీకృతమై
నిత్యం నీతోనే కలిసుండాలనిఉంది!

పునర్జీవనం


విరామమెరుగని ఈ కాలచక్రంలో
ఒకానొక ఘడియలో
నేను జీవం పోసుకున్నాను

ఈ భూమ్మీద పడి శ్వాస తీసుకున్నాను
బుడి బుడి నవ్వులతో
మిస మిస నడకలతో
ఆనందాల హరివిల్లుపై విహరిస్తుండగా
ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నా పయనం
చక్రాల చట్రంలో
గిర గిరా తిరుగుతూ
ఉన్నచోటే వేళ్లూనుకుంటూ
నాలో నేనే నిష్క్రమిస్తూ
కాలానికి గాలం వేస్తూ
రోజులు గడపాలేమో అనుకున్నాను-
ఏ దేవుని వరమో
ఏ జన్మలోని రుణమో
అస్తమించిన జీవితంలో..
అరుణ కిరణం అభయమిచ్చింది
వేయి ఏనుగుల బలం నాలో నాట్యమాడింది
ఆకలి ఎరుగని ఆనందం
బాధ తెలియని ప్రయాణం
తిరిగి మొగ్గతొడిగాయి
ఎల్లలు లేని అనుభవం
మలినం కాని విజ్ఞానం
ఏ వింతలోకాలలోనో విహారం -
ఈ జన్మకిది చాలు
మరో జన్మంటూ ఉంటే
మళ్లీ తనతోనే నేస్తం!

నిమజ్జనం

హరప్పా మొహంజొదారోలను
నా శిరస్సుపై ఎత్తుకొని
నాగరికత వీధుల గుండా
నడుస్తున్నాన్నేను -
కరిగిపోయిన కోట బురుజులు...
వరిగిపోయిన ఆలయ శిఖరాలు...
చెరిగిపోయిన శిలా శాసనాలు...
శిథిలమైన మహా నగరాలు...
ఇలా ఎన్నో జ్ఞాపకాల నీడలు దాటుకుంటూ
పయనిస్తున్నానిప్పుడు -
అలనాటి రాజ్యాలేవి?
ఆనాటి సంపదలెటుపోయాయి?
ఆ సంప్రదాయాలెక్కడ అదృశ్యమయ్యాయి?
ఆ గౌరవమర్యాదలెక్కడ మంటగలిశాయి?
ఎక్కడ నా అతి పురాతన సంస్కృతి?
ఏదీ నా సచ్ఛీలత?
ఆడపిల్లను తల్లిగర్భంలోనే విచ్ఛిన్నం చేసే నీతి -
అతివలను అగ్నికి ఆహుతిచ్చే అపకీర్తి -
అతిథులను ఆదరించడం చేతగాని దుర్గతి -
వృద్ధులను ఆశ్రమాలకు పంపే కుసంస్కృతి -
ఇవేనా నా చారిత్రక అవశేషాలు?
ఇవేనా నా సంస్కృతి నేర్పిన పాఠాలు?
ఏ రాళ్ళకింద పూడ్చిపెట్టను
ఈ హరప్పా నాగరికతను?
ఏ గంగలో నిమజ్జనం చేయను
ఈ మొహంజొదారో ప్రాచీనతను??

10 October 2011

ఆధారం

నేటికి
రేపటిపై
ఆశ-
రేపటికి
నేటిపై
భరోసా!

08 October 2011

మౌనం మాటలైన వేళ

అతను..ఆమె..
ఒకరి ప్రేమలో ఒకరు..
ఒకరి హృదయంలో ఒకరు..గాఢంగా..
ఆ సాయంసంధ్యలో
చిక్కటి వర్ణాలను
చీకటి నెమ్మదిగా చిదుముతున్న వేళ..
ఎదురెదురుగా వాళ్లిద్దరూ
ఆ సముద్రం ఒడ్డున
వినిపించని అలల హోరు..
చూపుల సంగమం..
కను కనుమలలో ప్రణయ విహారం
మాటలుడిగిన మనసులు
మౌనరాజ్యాన్నేలుతున్నాయి
ఆ ప్రేమ భావాలను వ్యక్తీకరించడానికి
ఏ మాటలూ సరిపోవు
నిశ్శబ్ద రాగాలాపనే ఆ సమయానికి తగినదేమో
యుగాలు సంగ్రహపరచలేని
ప్రణయ భావావేశం వాళ్లది
అంతా కొన్ని క్షణాలలోనే చెప్పుకోవాలనే తపన వాళ్లకి
చివరికెలాగో...
"నీతో చాలా మాట్లాడాలని వచ్చాను" అంది ఆమె
"నాకూ నీతో ఎంతో మాట్లాడాలని ఉంది" అన్నాడతను
"అయితే చెప్పు"..ఇద్దరూ ఒకేసారి అన్నారు
ఏదో చెప్పాలని ఉన్నా...
ఇద్దరి గొంతూ పెగిలి ఒక్క మాట బయటకు రాలేదు
ఒకళ్ల అవస్థను చూసి ఒకళ్లు నవ్వుకున్నారు..
హాయిగా...తనివితీరా..సముద్రం సాక్షిగా..
అంతే మళ్లీ మౌనంలో మునిగిపోయారు
ఆ మౌనంలోంచి వాళ్లు తేలేదెప్పటికో..?
ఏమో అది వాళ్లకూ తెలీదు...
ఆ సముద్రానికీ తెలీదు...
ఆ మౌనానికి అంతకన్నా తెలీదు!

07 October 2011

విశ్వ వేదం


అనంతమైన విశ్వం-
కోటానుకోట్ల
సౌరకుటుంబాలు-

'నేను' అందులో ఎక్కడ?
ఎక్కడా లేనేమో..
కానీ...
నాలో ఓ విశ్వం
దాక్కుని ఉంది
దాన్లో..
ఎన్నో...
గ్రహాలూ..నక్షత్రాలు..
పాలపుంతలు..తోక చుక్కలు..
మండే సూర్యుళ్లు..
లోతైన సముద్రాలు..
కొండలు..లోయలు -
వేగంగా విస్తరిస్తుంది
ఆవలి విశ్వం
ఉప్పెనై పొంగుతుంది
నాలోని సర్వస్వం-
ఆ విశ్వం ఈ విశ్వాన్ని
కబళిస్తుందో...
లేక ఈ విశ్వమే
ఆ విశ్వాన్ని కరిగిస్తుందో..
ఎవరికెరుక..?

ఈ ప్రకృతిలో కృతినై...

ఎన్నో రంగుల కలబోత
ఈ ప్రకృతి మాత -
పసుపు..ఆకుపచ్చ..
ఎరుపు..నీలం..
తెలుపు..నలుపు..
ఇంకా ఎన్నో...
ఎన్నెన్నో వర్ణాల మేలు కలయిక..
ఈ సుందర సుమనోహర
చైతన్య దీపిక -
ఆ పసుపు రంగును ఆస్వాదించి
ఆకుపచ్చతో వళ్లంతా
నలుగుపెట్టుకోవాలనుంది
ఆ ఎరుపు రంగులో తన్మయించి
నీలవర్ణంలో స్నానమాడాలనుంది
ఆ తెలుపులో తాథాత్మ్యం చెంది
నలుపులో నా అజ్ఞానాన్ని
మిళితం చేయాలనుంది..
ఈ ప్రకృతి ప్రతి అణువులో రేణువునై 
దానిలో లీనమవ్వాలనుంది!

04 October 2011

అందం

ఆమె సౌందర్యం
వర్ణనాతీతం...
అని చెప్పలేం కానీ
మంచి అందగత్తె అనొచ్చేమో..
పొడవైన నల్లని కురులు
ఆకర్షణీయమైన మోము
చక్రాల్లాంటి కళ్లు
చూడగానే ఆకట్టుకునే ఆకృతి -
దుమ్ము పట్టిన వజ్రంలా ఉంది ఆమె
మట్టి అంటిన కమలంలా ఉంది -
రోడ్డు పక్కన అడుక్కునే బిచ్చగత్తె!

02 October 2011

టు వే ట్రాఫిక్‌

ఆశించడంలో తప్పులేదు
త్యజించడంకూడా నేర్చుకోవాలి
తీసుకుంటే ఫరవాలేదు
ఇవ్వడంకూడా తెలిసుండాలి -
నాకు కావాలి అని
అడిగిన నోటితోనే
ఇదుగో తీసుకో అన్న
మాట కూడా రావాలి!

01 October 2011

ఫాల్స్‌ ప్రెస్టిజ్‌

వాడెప్పుడూ
వాడిదికాని ఓ వ్యక్తిత్వాన్ని
తన వళ్లంతా కప్పుకు తిరుగుతుంటాడు
వాడికి తనకంటే
తనదికాని ఆ వ్యక్తిత్వమంటేనే మక్కువ ఎక్కువ
వాడెక్కడికెళ్లినా
ఆ వ్యక్తిత్వం వాడివెంటే...
వాడు తననైనా మర్చిపోతాడేమోగాని
తనపై ఉన్న వ్యక్తిత్వాన్ని మాత్రం
ఎప్పుడూ వదిలి పట్టడు
వాడికి తనేమైపోయినా ఫరవాలేదు
ఆ వ్యక్తిత్వానికి ఎటువంటి కష్టమూ
రానీయడు
అసలో..ఫాల్సో...
వాడికి తన అంతరాత్మకన్నా
తనపై సవారీ చేస్తున్న
ఆ వ్యక్తిత్వమే ముఖ్యం!

30 September 2011

కంచెకు చేరిన కథ

అన్నదాత రైతన్నకు
ఎన్నడూ రాని దైన్య స్థితి
దిక్కుతోచని పరిస్థితి -
గతి తప్పిన గాలులు..
శృతి తప్పిన వానలు..
మొలకెత్తని విత్తనాలు..
తలనెక్కిన అప్పులు..
మింటినంటిన ఎరువుల ధరలు..
ఆగని రైతన్న కన్నీటి ధారలు..
కనిపించని మద్దతులు..
వయసుడిగిన సేద్య పద్ధతులు -
రోజూ కరెంటు కోతలే ఐతే
పంటకోతలు ఇంకెక్కడ?
కలో గంజో తాగుతూ
పంటను కంటికి రెప్పలా కాపాడుతూ
కాస్తో కూస్తో పండిస్తే
దాన్ని కాస్తా తన్నుకు పోయే రాబందు దళారులు -
పొలానికి వేశారు తాళాలు
ఇంటికి తాళం వేయాల్సిన అవసరం లేదు-
ఇలా రైతన్నలు నీరసిస్తే...
ఇక పండించలేమని నిరసిస్తే...
ఏమిటీ మన భవిష్యత్తు?
ఏమై పోతుందీ జగత్తు??

29 September 2011

ఏకాకి

ఏ కాకీ కాదు ఏకాకి
ఈ లోకంలో
ఏ కాకికి ఏమైనా...
కావు కావుమంటూ
వాలేను కాకులు ఎన్నో..
తనవాళ్లంటూ ఎందరొ ఉన్నా
మనిషే నిజమైన ఏకాకి-
అంతా సరిగా ఉంటే
చుట్టూ మూగే లోకులు
కిక్కురుమనక జారుకుంటారు

ఆపత్కాలములో తలోమూలకి!

జీవితాన్ని ప్రేమించు

జీవితమంటేఏమిటో
జీవిస్తేనే కద తెలిసేదీ
తెలిసీ తెలియక జీవితాన్ని
మొగ్గలోనే తుంచేస్తే
జీవితమంటే ఏమిటో
ఎలా నీకు తెలిసేదీ
జీవితాన్నే ప్రేమించు
జీవిస్తూనే పరికించు
జీవనరాగం పలికించు!

చదువు

చదువంటే సరదా
కొందరికి
చదువుకో అంటే చిరాకు
ఇంకొందరికి
చదువే సమస్తం
మరికొందరికి
చదవాలనిఉన్నా
చదువుకోలేని దౌర్భాగ్యం
మరో కొందరికి
ఆ చదువుల తల్లి
నుదుట రాసేది ఎందరికి?

ప్రకృతి ధర్మం

చిన్న చేపను
పెద్ద చేప
పెద్ద చేపను
సొరచేప -
అన్ని చేపల్నీ
మనిషి!

27 September 2011

కల-జీవితం

ఎంత అందమైన కల?
తీయని స్వప్న లోకాలలో
తేలిపోతూ
మధురమైన భావాలలో
మునిగిపోతూ
ఆనందపు శిఖరాలను
అందుకుంటూ
ఏవో తెలియని ఊహలలో
విహరిస్తూ -
ఎంత సుందరమైన కల...
ఆరేయి తెల్లవారకపోతే
ఎంత బాగుండేది
ఆ నిద్ర వీడకపోతే
ఎంత హాయిగా ఉండేది
అంతా నా భ్రమ -
కాకపోతే..
కలలు శాశ్వతమా?
అలాగని కళ్లముందు
కనిపించేది మాత్రం
కలకాలం ఉంటుందా?
ఏదీ శాశ్వతం కాదు
నిద్రలో కలలెంతో
ఈ జీవితమూ అంతే
కన్నుమూసి తెరచినంతసేపే
కలైనా..జీవితమైనా!

అంతులేని ప్రేమ

ఎందుకు ప్రేమిస్తున్నావని
అడగొద్దు ప్రియా...
నిన్నిందుకే ప్రేమిస్తున్నానని
ఎంతచెప్పినా...
అది తక్కువే అవుతుంది
నా ప్రేమ చిన్నబోతుంది!

ప్రేమిస్తూనే ఉంటా

నీకు ప్రేమించడం రాదు
ప్రేమంటే ఏంటో తెలీదు
నన్నొదిలెయ్‌ అంటే ఎలా..?
నిజమే...
నాకు ప్రేమించడం రాదు
ప్రేమంటే తెలీదు
కానీ నాకెందుకో...
నీతోనే ఉండాలనీ
నీతోనే బ్రతకాలనీ
నీతోనే చావాలనీ
ఆశగా ఉంది -
చచ్చేలోపు ఖచ్చితంగా
ప్రేమంటే ఏంటో తెలుసుకుంటా
చచ్చే దాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా!

ఏకాకి...

నిజానికి
కాకి కాదు-
మనిషే
ఈ లోకంలో
ఏకాకి!

26 September 2011

దృశ్య మాలిక


అక్కడ ఆప్యాయతలు కొన్ని
గాఢంగా కౌగలించుకుంటున్నాయి..
నవ్వులు కరచాలనం చేసుకుంటున్నాయి..

అపరిచిత హృదయాలు
అమాంతంగా ఢీకొట్టుకుంటున్నాయి..
చెల్లాచెదురైన స్నేహానురాగాలు
వడివడిగా దగ్గరవుతున్నాయి..
దుఃఖం ఒంటరిగా
ఓ మూల నిలబడి విచారిస్తోంది..
కొన్ని చూపులు ఎవరికోసమో ఎదురుచూస్తూ
ఇంటిగుమ్మాన్ని పదే పదే తడుముతున్నాయి..
ఎదురుచూస్తూ అలసిపోయిన కళ్లు
దబ్బున కూలిపోతున్నాయి...
ఓ మనసు కలవరపడుతుంది..
ఓ హస్తం ఓదారుస్తుంది..
ఇలా కరిగిపోతున్న దృశ్యాలెన్నో..
ఒకదానితరవాత ఒకటిగా
కళ్లముందు పరుగెడుతున్నాయి..
సినిమా రీళ్లలా..
ఆవిరౌతున్న యథార్థ సంఘటనల్లా.

ప్రేమా ఎక్కడ నీ చిరునామా...

ప్రేమను
ప్రేమించాలనుకున్నా
కానీ...
ప్రేమ చిరునామా
తెలియక
ఆగిపోయా!

అవ్యక్త భావాలు

లోలోన ఎక్కడో
తలెత్తడానికి
అవస్థ పడుతున్న
అవ్యక్త కదలికలు..
అప్పుడే నడక నేర్చుకుంటున్న
పసి భావనల్లా
తడబడుతున్న కోరికతో
నిలబడ్డానికి ప్రయత్నిస్తూ
నిలబడలేక పడిపోతూ..
ఇప్పుడే కాదులే అనుకుంటూ..
తిరిగి నిస్పృహలోకి
జారుకుంటూ..
లోలోపల మథనపడుతూ
అక్కడే ఆగిపోతున్న
మనో వాంఛలు
ఘనీభవించిన ప్రేమ రస ఝరులు!

ప్రేమ కోసం


ప్రేమ గురించి
మనమెందుకు ఇంతగా
ఆలోచిస్తాం
పదే పదే దాన్నే తలచుకుంటాం
మనల్ని అందరూ ప్రేమించాలని
ఆరాటపడతాం-
ప్రేమంటే ఏమిటో
ఇంకా అంతు చిక్కకా?
లేక మనక్కావలసినంత
ప్రేమ దొరక్కా, దొరికింది సరిపోకా?
ఏమో..నాకైతే అనిపిస్తుంది
ఎదుటివాళ్లకు ఇవ్వడానికి
తగినంత ప్రేమ మన దగ్గర లేకనే
ఈ తాపత్రయమంతా అని!

మనవాళ్లు

ఎవరు మనవాళ్లు ?
మనకు జన్మనిచ్చిన
తల్లిదండ్రులా..
మన తోబుట్టువులా..
మన రక్తం పంచుకు పుట్టిన
మన పిల్లలా..
మనకు విద్యాబుద్ధులు నేర్పిన
గురువులా..
మన స్నేహితులా..
మన సహోద్యోగులా..
మనకు సన్నిహితులా -
ఎవరు...?
ఈ అసంఖ్యాక ప్రజానీకంలో
ఎదుటివాడి  బాధను చూసి
జాలి దయతో
ఎవరి కళ్లైతే చెమ్మగిల్లుతాయో
వాళ్లంతా మనవాళ్లే!

19 September 2011

అనాథైన హరితపుత్రుడు


అడివి పురుడోసుకుని
నన్ను కన్నది
ఊడల ఉయ్యాల్లో కూర్చోబెట్టి
నన్ను ఊపింది
కొమ్మల ఒడిలో నిద్రబుచ్చి
నన్ను పెంచింది
కాయలతో దుంపలతో
నా ఆకలి తీర్చింది-
ఈ అడివిలోని పక్షులు
నాకు మాట నేర్పాయి
ఇక్కడి గాలి నాకు
పాట నేర్పింది
నెమళ్లు నాకు ఆట నేర్పాయి
నేనెప్పుడూ పాట భుజానేసుకుని
ఇక్కడే తిరుగుతూ ఉంటా-
ఈ ఆకుల్లో హరితాన్నై
ఈ పువ్వుల్లో పరిమళాన్నై
ఈ గాలిలో సంగీతాన్నై
సెలయేళ్లతో మాట్లాడుకుంటూ
వన ప్రాణులతో ఆడుకుంటూ
హాయిగా నవ్వుతూ బతుకుతున్నా..
హఠాత్తుగా ఏదో అలజడి -
మరయంత్రాలు చొరబడి...
చెట్లు నేలకూలుతూ..
పక్షులు ఎగిరిపోతూ..
జింకలు పారిపోతూ..
నెమళ్లు బెదిరిపోతూ.
సెలయేళ్లు ఆవిరైపోతూ -
నా తల్లిని ఎవరో నరికేశారు
నా గొంతునొక్కి
నా పాటను ఎవరో చంపేశారు
నా తల్లి నుంచి నన్ను వేరు చేశారు
నన్ను దిక్కులేని అనాథగా మిగిల్చారు.

18 September 2011

మతం

నీకో మతం..
నాకో మతం..
మన దేవుళ్లకు లేని మతం
ఎందుకో మనకు మాత్రం!

జీవితాశయం

ప్రశ్నకు ప్రశ్న
బదులు  కాదు
ప్రశ్నకు సమాధానం
అంతమూ కాదు
కొన్ని ప్రశ్నల్లో జవాబులు
ఒదిగున్నట్టే
కొన్ని సమాధానాల్లో
ప్రశ్నలూ దాగుంటాయ్‌
ప్రశ్నలకు సమాధానాలు
వెతుక్కుంటూ
సమాధానాల్లో ప్రశ్నలు
ఏరుకుంటూ
అసంతృప్తి ద్వారాలను
దాటుకుంటూ
నిజానిజాల కొలిమిలోకి
నిరంతరం నిష్క్రమించడమే
ఈ మూణ్ణాళ్ల జీవితాశయం!

17 September 2011

నేనెలా ఉండాలి?

నువ్వ్వొట్టి అమాయకుడివిరా
ఎలా బ్రతుకుతావో ఏమో
అనేవాడు మా నాన్న..
నువ్వు చాలా నెమ్మది
ఇలా అయితే ఎలా
అనేవాడు మా అన్నయ్య..
మీరెప్పుడూ ఇంతే
నేనేంచెప్పినా వినిపించుకోరు
అంటుంది మాయావిడ..
నువ్వెప్పుడూ ఏదోవకటి
చెప్తూనే ఉంటావ్‌ డాడీ
అంటుంటాడు మా అబ్బాయి -
ఇవన్నీ వింటే నాకనిపిస్తుంది
నేను ఎలా ఉండాలో అలా
ఉండట్లేదేమోనని-
మరి నేనెలా ఉండాలో ఏమో??

శపథం

నేనొక శిల్పిని
కఠోర శిలను సైతం
కళ్లు మిరుమిట్లు గొలిపే
శిల్పంలా మార్చాలని
ఆరాటపడుతూ ఉంటాను
కానీ ....
కనిపించిన ప్రతి రాయినీ
అద్భుతమైన బొమ్మగా
చేయాలనుకోవడం
అత్యాశే అవుతుందేమో?
అందుకేనేమో ...
నేను చెక్కిన ప్రతి శిల్పంలో
ఏదో ఒక లోపం ఉంటూనే ఉంది
అయినా నా ప్రయత్నం ఆగదు
ఏదోనాటికి నేను
అందరికీ నచ్చే అందరూ మెచ్చే
శిల్పాన్ని చెక్కే తీరుతా!

కొంచెం కన్నీళ్లు కావాలి

పంట నేలరాలింది
పొలం బీటలువారింది
గుండె ఎండిపోయింది
కొంచెం...
కన్నీళ్లు కావాలి -
ఏడవడానికి...
గుండె పగిలేలా !

15 September 2011

మంచుకప్పిన అగ్నికణం

చెప్పలేని బాధలు
చెప్పుకోలేని గాథలు
చెప్పాలా వద్దా అన్న
మీమాంసలు -
చెప్పలేక లోలోపలే
కుతకుతలాడే అగ్నిపర్వతాలు -
ఈ పొగల సెగల ప్రయాణంలో...
నిత్యం ఆవిరౌతూ
ఆత్మీయులకోసం ఘనీభవించి
చల్లని నీరౌతూ
లోపల మగ్గుతున్న మొగ్గౌతూ
బయటకు నవ్వే పువ్వౌతూ
అర్ణవాలు దాటుతూ
నరనరాల క్రుంగుతూ
సాగిపోతోంది జీవితం
మంచుకింద కప్పిన
అగ్ని కణంలా !!

13 September 2011

బదిలీలు

బదిలీల జీవితం...
ఎక్కడో ఒక్క చోట
తిష్ట వేసుక్కూర్చోవాలంటే
వీలుకాని జీవనం...
ఏదో ఒక ఊరికి బదిలీ అవుతుంది
కొత్త పరిసరాలు...
కొత్త వ్యక్తులు...
కొత్త ఇల్లు...
ఇల్లంతా సర్దుకొని ఆ వాతావరణానికి
అలవాటుపడ్డానికి
కొంత కాలం పడుతుంది
అక్కడ మొక్కలు పెంచుకొని
పరిచయాలు పంచుకొని
స్థిరత్వం పొందేలోపే
మళ్లీ బదిలీ -
అన్నీ తుంచుకొని మళ్లీ ప్రయాణం
వేరే ఎక్కడికో -
మాకైతే ఇది అలవాటై పోయింది
పిల్లల పరిస్థితే దయనీయం
తమ స్నేహితులను, స్కూల్ని
వదలి వచ్చిన తరవాత
వాళ్లు అనుభవించే బాధ
వర్ణనాతీతం -
బదిలీ మీద ఈ ఊరొచ్చిన కొత్తల్లో
మావాడు తన పాత స్నేహితులతో
స్కూల్లో తీసుకున్న ఫోటోను
చేత్తో తడుముతూ కన్నీళ్లు రాలుస్తుంటే
నా మనసెందుకో చలించింది!
ఈ బదిలీల జీవితాలు
ఇంతేనేమో అనిపించింది!!

12 September 2011

ఊరు ఏడుస్తుంది!

ఏమైంది నా ఊరికి?
పచ్చగా నవ్వే పొలాలు
వెచ్చని పలకరింపులు
గలగల మాట్లాడే సెలయేళ్లు
చెంగు చెంగున ఆడుకొనే లేగ దూడలు
ఎద్దుల మెడలో లయగా ఊగే గంటల మోతలు
కిచ కిచ లాడే పిచ్చుక గూళ్లు
తొలకరి మొలకలు
రివ్వు రివ్వుమనే వడిశెల సవ్వడులు
కోతలు, నూర్పిళ్లు
ధాన్యంతో క్రిక్కిరిసిన గాదెలు
బారులు తీరిన రంగవల్లులు
డూడూ బసవన్నలు...
ఇవేమీ కనపడవేం?
ఏమైంది నా ఊరికి?
వీధులన్నీ ఖాళీగా ఉన్నాయేం?
ఊరి జనమంతా జీవం లేని మొహాలతో
దిగాలుగా కూర్చున్నారేం?
నా ఊరెందుకిలా ఎండి పోయింది?

నా ఊరెందుకిలా ఏడుస్తుంది??

11 September 2011

అది ప్రేమే..

కనులు కనులూ కలిసినపుడు
కలవరమేదో కలిగినపుడు
రెండు చూపులు కలబడినపుడు
గుండె చప్పుడు తడబడినపుడు
అది ప్రేమ కాక ఏమవుతుంది
నీ మనసునడుగు వివరిస్తుంది!

సుస్థిరత

కనపడని అడుగులు చేస్తున్న శబ్దం
ఏదో నాకు వినిపిస్తుంది
కిందపడి భళ్లున పగిలి
ముక్కలైన మౌన శిథిలాలు
చెల్లా చెదురుగా విడివడి
లెక్కలేనన్ని రూపాలను
సంతరించుకుంటున్నాయి
మనసు అగాథంలో ఎక్కడో
అణు విస్ఫోటం జరిగి
నా అణువణువుకూ పాకి
అర్ణవం సృష్టిస్తుంది
ఏదో తెలియని శక్తి
నా నరనరాలగుండా ప్రవహించి
నన్ను ఉత్తేజపరుస్తుంది
ఎన్నో రంగులు పులుముకున్న దృశ్యమొకటి
నా కంటి నాడులపై నాట్యం చేస్తుంది
కకలావికలమైన ఆలోచనల ఉప్పెన
చివరకు సద్దుమణిగి నా  ముందొక
అందమైన చిత్రాన్ని ఆవిష్కరించింది
లోతెరుగని లోయల్లోకి
జారిపోతున్న నా చేతికి
ఓ చెట్టుకొమ్మ దొరికింది
నాకు ఆధారంగా నిలుస్తూ
నా ఊహలకు సుస్థిరత చేకూరుస్తూ!!

10 September 2011

ఓరి దేవుడో..

నాకు
ఆవేశం ఎక్కువ
కవిత్వం తక్కువ
ఆవేశం వచ్చినప్పుడల్లా
కవిత్వం రాద్దామని కూర్చుంటే
ఆ ఆవేశం కాస్తా
ఉన్న ఆ కూసింత కవిత్వాన్ని
కరకర నమిలి మింగేస్తుంది
ఇక నేను కవిత్వం
రాయడమెలా..?

09 September 2011

నేను మారాలంటే ఇంకేదో జరగాలి

ఎంతకాలమిలా ?
ఈ వ్యవస్థ మారాలి
వ్యవస్థ మారాలంటే
ముందు మనం మారాలి
మనం అంటే..
మనలో ఉన్న ప్రతిఒక్కరూ
నేను కూడా..
నేను నిజంగా మారగలనా?
నా ఆలోచనా సరళీ...
తరతరాలనుంచి
వారసత్వంగా వస్తున్న
ప్రవర్తనా ధోరణీ..
ఎలా మార్చుకోవాలి?
ఆత్మావలోకనంతోనా?
లేక...
వాగ్వివాదాలతోనా?
కాదంటే...
మహాత్ములు చెప్పిన మాటలు
నెమరువేసుకుంటూనా -
ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానే..
ఎన్నో ఏళ్ళుగా
ప్రయత్నిస్తూనే ఉన్నానే...
నాలో  ఏమాత్రం మార్పు రాలేదేం?
అంటే...
మార్పు రావాలంటే ..
ఇంకేదో జరగాలి
నేను మారాలంటే ఇంకేదో జరగాలి!!!

08 September 2011

మినీ కవితలు

1
ఆలోచన
--------
కెరటం
చేరేది
తీరంలో -
ఆలోచన
సమకూరేది
అక్షరంలో!


2
భయం
------
అలంటే
భయం లేని
చేపకు
వలంటే
భయం!

ఏది నిజం?

ఈ ఇజం  ఆ ఇజం అంటూ
ఎందుకు భేషజాలు?
తెలుసుకుంటే చాలదా
నిజానిజాలు!

అంతర్జాలంలో సాలీడు

మేము
అంతర్జాలంలో
చిక్కుకున్న
సాలీడులం -
ఎన్నిసార్లు కిందపడ్డా
తిరిగి లేవడానికే
ప్రయత్నిస్తాం!

07 September 2011

వాడు చంపుతూనే ఉంటాడు

వాడు మనలో కొందర్ని చంపుతాడు
మనం ధైర్యంగా ఉంటాం
అంతా కలసికట్టుగా ఉంటాం
సంయమనం పాటిస్తాం
చనిపోయిన వాళ్ల ఆత్మకు
శాంతి కలగాలని
దేవుణ్ణి ప్రార్థిస్తాం
కొన్ని రోజులు అప్రమత్తంగా ఉంటాం
భద్రతా వ్యవస్థను పటిష్టం చేస్తాం
తరవాత మనపనుల్లో మనం
నిమగ్నమై పోతాం
అంతా ప్రశాంతంగా ఉంటుంది
అదును చూసి వాడు మళ్లీ
దాడి చేస్తాడు
దయాదాక్షిణ్యాల్లేకుండా
ఊచకోత కోస్తాడు
మనం మళ్లీ హాహాకారాలు చేస్తాం
ఇక ఊపేక్షించకూడదనుకుంటాం
ప్చ్‌..మనం శాంతి కాముకులం
మళ్లీ ధైర్యం ప్రకటిస్తాం
అందరం ఆ విపత్కర స్థితిలో
ఒక్కటిగా నిలబడతాం
ఎక్కడలేని సంయమనం చూపిస్తాం
ఇలా ఒకసారి కాదు
అనేక సార్లు వాడు గురిపెడతాడు
చంపుతూనే ఉంటాడు
వాడి మృత్యుదాహం తీర్చుకుంటూనే ఉంటాడు
మనం చూస్తూనే ఉంటాం
చస్తూనే ఉంటాం
వాడూ చూస్తూనే ఉంటాడు
మనల్ని చంపుతూనే ఉంటాడు!

కొడుకా..స్నేహితుడా?

మావాడు నాతో
ఫ్రెండులా ఉంటున్నాడని
మురిసిపోయా -
ఇప్పుడు..
తండ్రిలా చూడ్డంలేదని
ఏడుస్తున్నా..!!

06 September 2011

మినీ కవితలు

‎1
ఎన్నికలు
---------
ఇదేళ్లకోసారి
ప్రజలు
జరుపుకొనే
పండగ!

2
ఆకలి
-----
పేదోడికి
మిత్రుడు
ఉన్నోడికి
శతృవు!

3
వ్యవసాయం
-----------
రైతుల
పాలిట
కషాయం!

4
పురుగులమందు
---------------
పంటలు
పండితే...
పురుగులకు-
ఎండితే
రైతులకు!

5
ఉదయం
--------
రాత్రి
మేలుకొనే
సమయం!

6
గుడి
-----
మనిషికి
కష్టాలొచ్చినప్పుడు
తలదాచుకొనే చోటు!


7
గనులు
-------
తవ్వేకొద్దీ
అవినీతిని
బయటపెట్టే
ఖనులు!

05 September 2011

నేను మారిపోయానా?

ఒక రోజు
పొద్దున్నే నిద్రలేచి
అద్దం ఎదురుగా నిలబడ్డా -
ఆశ్చర్యం!!!
అద్దంలో కనపడేది
నేను కాదు -
ఇంకెవరో...
మొహం కొంచెం క్రూరంగా
నల్లగా, కళ్లు ఎర్రగా...
ఎవరది???
నేనెపుడూ అలా లేనే..
అలా ఏనాడూ కనిపించాలనుకో లేదే -
అద్దాన్ని తుడిచాను..
కళ్లు నులుముకొని చూశాను
ఊహూ...
అదే ప్రతిబింబం
నాకు అర్థం కాలేదు -
నాకేమయింది?
నేను మారిపోయానా?
నిజంగా అలా పరివర్తన చెందానా??
ఏమో నాకు తెలీదు!
ఏమో నాకు తెలీదు!!

04 September 2011

ఎగిరే గాలిపటాలు

ఎగిరే గాలి పటాలు
కొందరి జీవితాలు
అవి ఎగరాలా లేదా
అనే నిర్ణయం
వాళ్ల చేతుల్లో ఉండదు
గాలిపటం ఎగరడానికి
ఆధారమైన దారం
మరెవరిదగ్గరో ఉంటుంది
దారాన్ని లాగేవాడి
అనుభవం, ఆలోచన మీదే
ఆ జీవితాలు వేళ్ళాడుతుంటాయి
ఎప్పుడు పైకెగరాలో
ఎందుకు కిందకు జారాలో
వాళ్లకు తెలీదు
చేతులో ఉన్న దారం వదిలేస్తే
ఆ గాలిపటాలు
ఎటు కొట్టుకుపోతాయో
ఎక్కడ చిక్కుకుపోతాయో
అంతకన్నా అర్థం కాదు-
ఆ జీవితాలంతే...
ఎవరి చేతుల్లో పడాలనేది
కాలమే నిర్ణయిస్తుంది!

03 September 2011

నీ ధ్యాసే...

మునిమాపులలో
ఎదలోతులలో
గాఢ నిద్రలో
పూర్తి స్పృహలో
ఎక్కడ చూసినా
ఎందు వెదకినా
నీ రూపే
నీ ధ్యాసే -
ఎందుకురా నన్నిలా
వెంటాడతావ్?
నీ అప్పు
వచ్చే వారం
తీరుస్తానన్నాగా!

నాటకం


ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ పలవరము
వచ్చేటప్పుడు

తెచ్చిందేమిటి
పోయేటప్పుడు
వచ్చేదేమిటి
ఉండేదే మూన్నాళ్ళు
అంతలోనే ఎందుకు ఇన్ని ముడులు
దేవుడు కల్పించాడో
కావాలని కలిపించాడో
ఎందరినో నీకు తోడుగా
ఎందరికో నువు నీడగా
బంధువులు బాంధవ్యాలు
బాధ్యతలు బంధనాలు
ఎపుడు తీరిపోవునో
చివరకేది మిగులునో
అంతా మాయేనేమో
ఇదంతా మిథ్యేనేమో
ఎవరికి ఎరుక
ఎరిగేందుకు ఎవరికుంది తీరిక
నాలుగు రోజులూ నవ్వుతూ
నలుగురితో తిరుగుతూ
నాటకానికి తెరపడితే
నిష్క్రమించడమేగా మన పని!!

ఇది నీ పరిచయ భాగ్యమే!

ఎదలో
మెదిలిన మాట
పెదవిదాటనంటుంది
మదిలో
మొదలైన కదలిక
కనుల నిలవనంటుంది
ఉలుకూ పలుకూ లేక
హృదయం మూగబోయి
నిలబడుతుంది -
నువు పరిచయమైన
వేళా విశేషమో ఏమో...
నిను చూసిన ప్రతిసారీ
నా పరిస్థితి ఇక ఇంతేనేమో!

01 September 2011

ప్రేమించాలనుకుంటున్నావా?

ప్రేమంటే ఏంటో
తెలియాలంటే
ముందుగా
నిన్ను నువ్వు
ప్రేమించుకొని చూడు -
నిన్ను నువ్వు
ప్రేమించుకోగలిగితే
బహుశా నువ్వు ప్రపంచంలో
ఎవరినైనా ప్రేమించగలవు!

ఈ జన్మకిది చాలు!


ఏమిటో..
ఎంతో ఆసక్తితో
చదువుతా -

ఒక్క ముక్కా అర్థం కాదు
ఏదో ఉన్నట్టే ఉంటుంది
ఏముందో తెలీదు
నా బుర్రకు అందనిదేదో
ఉండే ఉండాలి అనుకుంటా
మళ్లీ మళ్లీ చదువుతా
ఊహూ....
బోధపడితే ఒట్టు
నేను కూడా అలా రాస్తే పోలా???
అమ్మో వొద్దులే
నాకే అర్థం కాకుండా రాసి
వేరే వాళ్ల మెదడెందుకు తినడం!!
నాకు తెలిసిన భాషలో
అందరికీ అర్థమయ్యే రీతిలో
రాయగలిగితే ఈజన్మకది చాలు
!

మనుషులంతా ఒక్కటే

నీ చేతుల్లో ఉందా నీ పుట్టుక
మతం  పేరుతో ఎందుకు చస్తున్నామిలా కొట్టుక
రాముడూ దేవుడే కదా రహీములా
మరి నీకూ నాకూ భేదాలెందుకిలా
చచ్చింతరవాత తెలీదు పొయ్యేదెక్కడికో
దేవుడు సొంతం కాదు ఏ ఒక్కడికో
నువ్వు నేను వేరనుటకు కారణాలెన్నో
మతం ముసుగులో లోకం చేసే తప్పులు ఎన్నెన్నో
ఇకనైనా మేలుకుందాం..మమతలను పెంచుకుందాం
అందరి రక్తం ఎరుపైనప్పుడు
మనసుకు ఏ రంగులూ లేనప్పుడు
ఎందుకు మనకీ కుల మతాల చిచ్చు ?
అందరమొకటై ఆపుదాం ఇప్పుడైనా ఈ కార్చిచ్చు!

31 August 2011

నేను చావను






నువ్వంటే
పడి చస్తానన్నా -
నీకోసం
చస్తానని కాదు!

నీతిని గౌరవించు



నీతిని..
మంచితనాన్ని..
గౌరవించడం మనం
నేర్చుకుంటే -
అవినీతి
దానికదే
అంతమౌతుంది!

30 August 2011

నేను ఎదుగుతున్న మనిషిని

నేను తీరం చేరని అలని
గమ్యం తెలియని బాటసారిని
ఉదయించని సూర్యుణ్ణి
ఫలించని స్వప్నాన్ని
తరించని భక్తున్ని
చిగురించని వృక్షాన్ని
సంగమించని నదిని -
అవును..నేనింకా
ఎదుగుతున్న మనిషిని
ఎప్పటికైనా..
పరిపక్వత చెందగలననే
నమ్మకంతో బ్రతుకుతున్నవాణ్ణి
రోజూ ఎంతోకొంత
నేర్చుకోవాలన్న
తపనతో ఉన్నవాణ్ణి
నా లక్ష్యాన్ని
సాధించగలనన్న
ఆత్మస్థైర్యం కలవాణ్ణి!

26 August 2011

నీ నీడను నేనై..







నేనెప్పుడూ
నీవెంటే ఉంటా -
కావాలంటే
నీ నీడను చూడు -
అది అచ్చం
నాలా ఉంటుంది!

25 August 2011

లోకం పోకడ




ప్రజాస్వామ్యం
పలచనైతే
నియంతృత్వం
కావాలంటాం -
నియంతృత్వం
ఘాటెక్కితే
ప్రజాస్వామ్యం
రావాలంటాం!

24 August 2011

నా నానోలు


సహనం
విజయం
అసహనం
వినాశం
ప్రేమ
అమృతం
పగ
విషం
సమస్య
చిన్నది
జీవితం
పెద్దది
ఆలోచన
విత్తనం
ఆచరణ
వృక్షం
అభిమానం
ఆభరణం
అవమానం
మరణం
 
 

23 August 2011

నేను మోసపోయినందుకు ఆనందించాను

నేను మోసపోయాను
కాదు మోసపోయాననుకున్నాను
ఒకరోజు ఆఫీసునుండి
ఇంటికి వస్తుంటే
దార్లో ఓ వ్యక్తి తారస పడ్డాడు
చూడ్డానికి బాగానే ఉన్నాడు
దీనంగా మొహంపెట్టి
నాతో ఏదో చెప్పబోతే
ఏమిటని అడిగాను
వేరే ఊరినుండి వచ్చానని
డబ్బూ బట్టలూ
ఎవరో కొట్టేశారని
భోజనం చేసి మూడ్రోజులైందని
ఏదైనా సహాయం చెయ్యమని అడిగాడు
ఇలాంటి కథలువిని
మోసపోయిన వాళ్ల
అనుభవాలు గుర్తొచ్చి
ఇదీ అలాంటి బాపతే అనిపించింది
కానీ అతని వాలకం చూసి
జాలేసి ఓ ఐదొందలు చేతిలోపెట్టా
ఆ విషయం అంతటితో వదిలేశా
సరిగ్గా నాలుగురోజుల తరువాత
అదే అవ్యక్తి అదే చోట వేరే ఎవరికో
తన పాత కథే చెప్తుంటే
చూసినప్పుడు అర్థమైంది
నేను మోసపోయానని
నేను పొరపాటు చేశానా?
ఒక్కసారి ఆలోచించాను...
లేదనిపించింది -
నేను మోసపోయినా...
నాలో దయాగుణం ఇంకా
మిగిలే ఉన్నందుకు ఆనందించాను
తృప్తిగా ఒక్కసారి గాలి పీల్చుకున్నాను!!

22 August 2011

కవితా జననం


ఒక్కొక్కసారి
నేనేదో పనిలో ఉంటా
టక్కున స్పురిస్తుంది -
ఇంకోసారి
ఊహా ప్రయాణంలొ ఉన్నప్పుడు
మదిని తాకుతుంది -
మరోసారి
కవన పారాయణంలో
నిమజ్ఞమైనప్పుడు
తటాలున మెదులుతుంది -
అప్పుడప్పుడైతే...
ఓ తల్లి ఆక్రందనల అనంతరం
ప్రసవ వేదన నుండి
జన్మించిన శిశువులా
అతికష్టంగా
బయటపడుతుంది...
అనేక సందర్భాల్లో ఇలా
నా అంతరాళాల్లో
అంతర్ధానంగా ఉన్న
అంతరంగం అంతర్మథనం చెంది
కవితావస్తువుగా
రూపాంతరం పొంది
వెలివడుతుంది
నాలో ఎనలేని
అనందాన్ని నింపుతూ!!

కవన సేద్యం






కలం నా హలం
తెల్లకాగితాన్ని చదును చేసి
సిరాచుక్కల అక్షరాలు చల్లి
మాటల మొక్కలు మొలిపిస్తా
పాటల తోటలు సృష్టిస్తా
కవితల పూవులు  పూయిస్తా!

21 August 2011

ఓ నాన్న ఆవేదన

నాది చాదస్తమే -
నీకు చెప్పిందే చెప్పి
పదే పదే చెప్పి
విసిగిస్తున్నాను కదూ..
కానీ నేనెందుకలా చెబుతున్నానో
ఒక్కసారి ఆలోచించు..
నేను పడ్డ బాధలు
నువ్వు పడకూడదని,
నేను తిన్న ఎదురు దెబ్బలు
నువ్వు తినకూడదని,
నాకంటే గొప్పగా
నువ్వు బ్రతకాలని
జీవితంలో ఏదైనా
గొప్ప విషయాన్ని సాధించాలని
నేను ఆశపడ్డం తప్పా -
నాకంతా తెలుసు..
నాకేమీ చెప్పక్కర్లేదూ అంటావు..
కాదనను....
కానీ నా ఆత్రుత నాది
నాకు తెలిసిన విషయాలన్నీ
నీకు చెప్పెయ్యాలనే తొందర
అంతే..
నువ్వు మంచేదో చెడేదో తెలుసుకుని
సరైన మార్గంలో నడుస్తుంటే
నాకంటే ఆనందించేదెవరు!
నువ్వు సంతోషంగా జీవిస్తుంటే
నాకంటే గర్వించేదెవరు!!

ప్రాణస్నేహితుడు

వాడెప్పుడూ
నాకు గుర్తుకొస్తూనే ఉంటాడు
వాడు నాకు చాలా అప్తుడు
వాడంటే నాకు ప్రాణం -
జీవిత యాత్రలో
వాడో వైపు నేనో వైపు -
ఎంత దూరంలో ఉన్నా
గుండెల్లో ఉన్నట్టే అనిపిస్తాడు
నాతో ఎప్పుడూ
మాట్లాడుతున్నట్టే ఉంటాడు
వాడు నాజీవితంలొ
ఒక భాగమైపోయాడు
వాడు నాతోనే ఉన్నాడన్న
అలోచన నాకు ఎక్కడలేని
ఆనందం కలిగిస్తుంది..
నా జీవన పోరాటంలో
నేను ఒంటరిని కాదనిపిస్తుంది..
ప్రాణ స్నేహమంటే
ఇలాగే ఉంటుందేమో -
నాకూ ఒక ప్రాణస్నేహితుడున్నాడు
నేనెంత అదృష్టవంతుణ్ణి!!

సంఘర్షణ

జ్వలిస్తున్న సంఘర్షణ
గుండెలపై రగులుతున్న కుంపటిలా -
ఎన్ని ఆలోచనలు కుమ్మరించినా
ఆరని మంట
ఆగని సెగ -
దారిమళ్లించేందుకు చేసిన
విఫల యత్నం..
పదే పదే చెవుల్లో గింగురుమంటున్న
ఆక్రందనల ఘోష..
పంచేంద్రియాలను నిద్రింపచేసినా
పంచభూతాల సాక్షిగా
ఎగసిపడుతున్న అలల గర్జన..
తూర్పున ఉదయించిన అరుణ కిరణం
పడమట కనుమరుగవుతుందే కాని
నా హృదయాక్షంలో జన్మించిన
బడబాగ్ని నిలబడదు
నన్ను నిలువునా దహించేంత వరకు -
అయినా నాకు భయం లేదు...
నాలో మండే నిప్పుల కొలిమిలోకి
నా ఊపిరి తిత్తుల నిండా
గాలి పీల్చుకొని ఊదుతూనే ఉంటా!!

ఇదేనా జీవితం?

ప్రవహించే
ఓ సుందరస్వప్నంలాంటి
జీవన స్రవంతి -

ఆ ప్రవాహంలో
ఎన్నో ఊహించని మలుపులు -
కారు మేఘాలూ..
కలవరపరచే కాల సర్పాలూ..
కాలాన్ని శ్వాసించలేని క్షణాలు
కాలం నిమంత్రించే చేదునిజాలు-
నిద్రిస్తున్న ప్రతి నిమిషం
మెలుకువలోనే గడిపేస్తూ
రాత్రంతా వెలుతురు రాగం పాడుకుంటూ
ఉదయాన్నే నిస్పృహలను పక్కకు నెట్టుకుంటూ
సూర్యుడ్ని మళ్లీ మండించుకుంటూ
పరుగెడుతున్న ఆలోచనలను మళ్లించుకుంటూ
జీవితాన్ని సవరించు కుంటూ
సాగదీసుకుంటూ..సానబెట్టుకుంటూ
నిశీథిలోకి నిశ్శబ్ద ప్రయాణం!!

16 August 2011

జీవన రాగం

ఇప్పుడెందుకంత ఉదాసీనత?
ఏదో పోగొట్టుకున్నట్టు -
ప్రపంచంలో ఉన్న బాధంతా
నీలో గూడుకట్టుకున్నట్టు..
చిన్నప్పుడు ఎంత హాయిగా
ఉండే వాడివి -
ఎప్పుడూ నవ్వుతూ,
అందర్నీ నవ్విస్తూ,
ఆడుతూ పాడుతూ -
ఏం? అప్పట్లో నీకేమీ బాధల్లేవా..?
ఎందుకు లేవు..!
అయినా పట్టించుకొనేవాడివి కాదు
మరిప్పుడేమైంది?
చాలా పెద్దవాడివాయ్యావని,
వయసు మీద పడిందని,
బరువు బాధ్యతలు పెరిగాయని..
అసలు నవ్వడమే మర్చిపోయావా?
ఏం? నువ్వలా దిగాలుగా కూర్చుంటే
సమస్యలు సమసి పోతాయా?
వ్యథలు కరిగి పోతాయా?
చుట్టపు చూపుగా వచ్చే సమస్యలతో
సతమతమవడం ఎందుకు?
సంతోషాన్ని నీ బలం చేసుకో
ఉత్సాహాన్ని నీ ఆయుధంగా మలచుకో
వెతల వలయాన్ని ఛేదించు
జీవన రాగాన్ని ఆలపించు!

15 August 2011

ఏదీ భవితవ్యం?



కుతంత్రాలకు
నిలయమైన స్వతంత్రం
దురాగతాలకు
మలినమైన ప్రజాతంత్రం
అరాచకాలకు
బలియైన గణతంత్రం!

13 August 2011

నేనే నువ్వయ్యాక...





నా మనసంతా
నువ్వే నిండాక
వేచి ఉండనా
నీకోసం కడదాక!
నా ప్రాణం
నువ్వై మిగిలాక,
నా శ్వాసే
నీదై నిలిచాక
నేనంటూ ఏముందిక??

08 August 2011

నమ్మకం



అనుమానం
అవమానాలకు పుట్టినిల్లు
నమ్మకంతో ముందుకు సాగితే
జీవితమే ఒక
అందమైన హరివిల్లు!

జీవన యానం

నాలో రేగే ఊహల జ్వాలలలో
నేనే దహించుకు పోతుంటే,
నాలో పొంగే తలపుల ఉప్పెనలో
నేనే హరించుకు  పోతుంటే,
నా ఆలోచనల ప్రవాహంలో
నేనే కొట్టుకుపోతుంటే...
నను తీరం చేర్చే -
నా అనుభవాల ఆశాకిరణం,
నా అంతర్గత ఆలయశిఖరం,
నను వెన్నంటే జ్ఞానసముద్రం-
అవే లేకుంటే....నాది
తిరిగిరాని లోకాలకు పయనం!

07 August 2011

మోహం-స్నేహం





నిలకడ
లేనిది మోహం
కలుషం
కానిది స్నేహం!

స్నేహమంటే..




స్నేహానికి
లేదు కొలమానం
అంతు లేని
అభిమానమే
దాని బహుమానం!

06 August 2011

సంతోషం

పండగొస్తే నాన్న
నాకు కొత్తచొక్కా కుట్టించేవాడు
ఆ రోజులు నాకింకా గుర్తే
కొత్త చొక్కా చూసుకొని
నేను తెగ మురిసిపోయేవాణ్ణి
కొత్తచొక్కా దొరికిందన్న
ఆనందంతో నేను సంబరపడుతుంటే..
ఆశ్చర్యం -
మా ఇంటెదురుగా రోడ్డుమీద సెటిలైన
భిక్షగాడి కొడుక్కూడా
ఎవరో తనకిచ్చిన పాత చొక్కా వేసుకుని
అది మెడనించి పాదాలవరకూ
వేలాడుతుంటే చూసుకుంటూ
తెగ సంతోష పడే వాడు!

శ్రీవారికి శుభ లేఖ

నువ్వు నన్ను
ప్రేమిస్తున్నావని
నాకు తెలీదనుకున్నావు కదూ!
నువ్వు నాకోసం పడే ఆరాటం..
నేను ఒక్కరోజు కనిపించకపోతే
నీ మొహంలో కనిపించే నిరాశా..
నీ ప్రేమను నాకెలా చెప్పాలో,
చెబితే ఏమంటానో,
చెప్పకపోతే ఏమౌతుందోనని
నువ్వు సతమతమవడం -
అన్నీ నాకు తెలుసు
అమాయక ప్రేమ చక్రవర్తీ..
నువ్వు నన్నెంతగా ప్రేమించావో
నేన్నిన్నంతకురెండింతలుగా
ప్రేమించాను తెలుసా
నువ్వే చెప్తావేమోనని
ఎంత ఎదురు చూశాను -
ఊహూ..అంత ధైర్యం కూడానా..
నేనే ఎదోలా మావాళ్లకు చెప్పి
మీ అమ్మా నాన్నలతో
మన పెళ్లి విషయం మాట్లాడ్డానికి
పంపించ బట్టి సరిపోయింది..
లేదంటే..'మనసొకరితో మనువొకరితో'అంటూ
మన ఆత్మ కథలు మనమే
రాసుకోవలసి వచ్చేది!!!

01 August 2011

సంకేతాలు






అదిరే అధరాలు
బెదిరిన ప్రేయసి
ప్రేమకు గుర్తు -
చెదిరిన అందాలు
చెలరేగిన రెండు
హృదయాలకు ఓదార్పు!

నీకిది తగునా!




పెళ్లికి ముందు
నీకోసం
జుట్టు పీక్కొనేలా చేసి
ఇప్పుడు నాది బట్టతలంటూ
దెప్పిపొడవడం
ఏమన్నా బావుందా చెప్పు!

పునర్జన్మ


నిను చూసిన ఆ క్షణమే
నా అస్థిత్వం కోల్పోయా
నన్ను నేను వెతుక్కుంటూ
నీలో ప్రత్యక్షమయ్యా
నానుండి నిన్ను వేరుచేయాలని
నీనుండి నేను వీడిపోవాలని
వృధా ప్రయత్నం చేశా
నువ్వూ నేనూ వేరు కాదనీ
రెండు రూపాల్లో వున్న
ఒకే ప్రాణమని తెలిసిన క్షణం
నన్ను నేను తిరిగి పొందా!

30 July 2011

అల్ప సంతోషి




అష్టైశ్వర్యాలూ వద్దు
నీ పెదవిపై తొణికిసలాడే
చిన్ని మెరుపే ముద్దు!
పంచభక్ష్య పరమాణ్ణాలూ కాదు
నీ అధరం చిందే
చిరు మధువే చాలు!!

నీ కోసం




చిరునవ్వుతో
పలకరిస్తే
చితినుండి లేచి వస్తా!
మరుజన్మనైనా
మనసిస్తానంటే
ఈ క్షణమే మరణిస్తా!!

22 July 2011

నా మనసే నీదై...

నా మనసు నీకు తెలుసు
అది నా మనసుకు తెలుసు
మనసు సంగతి మనసుకుగాక
ఇంకెవరికి తెలుసు
నా మనసే నీ వశమై
నీ మనసుకు అది బందీ అయి
మనిషి కాని మనిషిని నేనై
నా మనసులోని మనిషివి నీవై
నీవూ నేనూ సగసగమై
తోడూ నీడల సంగమమై
కలలు కందాము తుదిదాకా
కలసి ఉందాము కడదాకా!

21 July 2011

యుద్ధ ఛాయలు



భూమికి పెరుగుతున్న
జన భారం.....
జనులకు తరుగుతున్న
జీవనాధారం!
నీటికోసం కూటికోసం యుద్ధం...
కాబోతుందా యథార్థం?

20 July 2011

కలగంటి..కలగంటి..

కలగనడం అంటే
నాకు ఎందుకో చాలా ఇష్టం
వచ్చే ప్రతి కలా
చెదిరిపోక తప్పదు..
కొన్ని కలలు
చాలా భయంకరంగా కూడా ఉంటాయ్‌..
అయినా నాకు కలలంటే ఇష్టమే
ఎందుకంటే -
ఇప్పటివరకూ
నేను సాధించినవన్నీ
ముందుగా కలగన్నవే
నాకు జీవితంలో దొరికినవన్నీ
ముందుగా కలలో చూసినవే
అందుకే నేను
ఎప్పుడెప్పుడు కలలొస్తాయా అని
ఎదురుచూస్తూ ఉంటాను!

18 July 2011

క్షణికావేశం




మన జీవితంలోని
కోటానుకోట్ల క్షణాల్లో

ఆవేశంలో
నిర్ణయం తీసుకున్న
ఒకే ఒక్క క్షణం చాలు -
నిండు జీవితం
నిర్దాక్షిణ్యంగా
నలిగిపోవడానికి!

అన్యాయం





అడవులు తరుగుతున్నా...
ఆటవికతనం మాత్రం

లోతుగా వేర్లూనుతూ
రోజు రోజుకూ
బలంగా పెరుగుతూనే వుంది!

17 July 2011

జ్ఞాపకాల నీడలో...

ఆ చెట్టు అక్కడే
నిలబడి ఉంది
దశాబ్దాలుగా...
నిశ్శబ్దంగా...
ఎన్ని తరాలను చూసింది
ఎంతమందికి తన నీడలో చోటిచ్చింది
స్నేహితులు...
ప్రేమ జంటలు...
అలసట తీర్చుకొనే వాళ్లు...
ఆనందంగా కబుర్లు చెప్పుకొనే వాళ్లు...

అలా ఎందరో -
తమ మజిలీ ముగించుకొని వెళ్లిపోయి
ఎప్పటికో తిరిగివచ్చి
గతస్మృతులను నెమరువేసుకొనే వాళ్లను చూసి
ఆ చెట్టుపొందే ఆనందం...
ఏ బంధానికీ తీసిపోని బాంధవ్యం..
చెట్టుకూ మనిషికీ ఉన్న అనుబంధం -
కంటికి చెమ్మలా..
గొంతుకు పూడికలా..
హృదయానికి ఆర్ద్రతలా..
ఎప్పటికీ అక్కడే నిలబడి ఉంటుంది
ఆ చెట్టు మన జ్ఞాపకాలకు గుర్తుగా!