31 March 2011

ఓర్పు



గాలి వాటుకే
దారి మళ్ళేవి
పిల్ల కాలువలు!
అతలాకుతలం చేసే
ఆటు పోట్లను సైతం
లెఖ్ఖచేయక నిలబడేవి
మహాసముద్రాలు!!

పరమ వీర చక్ర

వాడు శ్వాసిస్తే విలయం
ఘోషిస్తే ప్రళయం
వాడు కన్నెర్రజేస్తే
చీకటి లోకం భస్మీపటలం
వాడు ఉగ్రవాదం మదమణచి
తీవ్రవాదాన్ని తుద ముట్టిస్తాడు
సరిహద్దుల్లో చొచ్చుకువచ్చే
శత్రువులను చీల్చి చెండాడతాడు
క్షణక్షణం కత్తులతో
కరచాలనం చేస్తూ
అనుక్షణం మృత్యువుతో
మంతనాలాడతాడు
దేశం కోసం ప్రాణాలైనా
తృణప్రాయంగా వదిలేస్తాడు


తూరుపుదిక్కున వేగుచుక్కలా
మళ్ళీ మళ్ళీ జన్మిస్తాడు
జనవాహినిలో తురుపుముక్కలా
జనం గుండెలో జీవిస్తాడు

30 March 2011

ఫియర్‌ ఆఫ్‌ సక్సెస్‌






అపజయాలు
నాకు అలవాటే...
నేలక్కొట్టిన బంతిలా
తిరిగి లేస్తా!
విజయాలంటేనే భయం
ఎక్కడ చేజారిపోతాయోనని!!

కనికట్టు






భారత్‌ పాకిస్తాన్‌
ఆడుతుంటే క్రికెట్టు
ఊరు ఊరంతా ...
టీవీల చుట్టు!
ఇంట్లో దొంగలు పడ్డా
కదిల్తే ఒట్టు!!

29 March 2011

మంచు తెర


పురుషుని
గాఢ పరిష్వంగంలో
రాతిరంతా సేద తీరి
తెలవారు సమయాన
సిగ్గుతో తలవంచుకొని
తెలిమంచు మేలి ముసుగు
తనువంతా కప్పుకుంది
ప్రకృతి కాంత...

దేహమే దేవాలయం







దేవుడు ఎక్కడో కాదు,
నీలోనే ఉన్నాడు!
నీలోపలున్న రాక్షసుడ్ని
తరిమేసి చూడు -
తక్షణమే ప్రత్యక్షమౌతాడు!!

28 March 2011

భలే దొంగలు





నువ్వు దొంగంటే...
కాదు...నువ్వే దొంగ -
ఎటూ తేల్చుకోలేకపోతున్నారు వాళ్ళు!
నిజానికి...
వాళ్ళిద్దరూ కరక్టే!!

27 March 2011

దృఢ నిశ్చయం






ఆదేవుడిమీదొట్టు!
ఉద్యమం కోసం
ప్రాణాలైనా ఇస్తా-
పదవి మాత్రం
ఎట్టి పరిస్థితుల్లో
వదిలి పెట్ట!!

తారు మారు




నిన్న-
మనిషి గుప్పెట్లో
అణుశక్తి!
నేడు -
అణుశక్తి కోరల్లో
మనిషి!!

25 March 2011

హంతకులెవరు?



ఉడుకు రక్తం
మరుగుతున్న
యువ శక్తిని
ఆత్మాహుతికి ప్రేరేపిస్తే
అది ఆత్మ హత్య
ఎలా అవుతుంది?
ఖచ్చితంగా హత్యే!

పొగడరా...పొగడరా...

మార్గాలెన్నైనా
గమ్యమొక్కటే
మతాలెన్నైనా
దైవమొక్కటే -
యాసలెన్నైనా
భాష ఒక్కటే
భాషలెన్నైనా
భావమొక్కటే -
దేశ భాషలందు
తెలుగు లెస్స
ప్రపంచ దేశాలందు
భరతమాత దిట్ట -
"పొగడరా నీ తల్లి
భూమి భారతిని
నిలపరా నీజాతి
నిండు గౌరవం"  

ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో...

పొద్దున్నే లేచి
ఇల్లంతా తుడిచి...
తన పళ్లు తోమకుండానే
ఇంట్లోని అంట్లన్నీ తోమాలి-
యజమాని తిన్నాక
మిగిల్తే ఏమైనా తినాలి-
బాల్యం తీరకముందే
ఇంటి బరువు మోయాలి-
మన కళ్ల ముందే
జరుగుతున్న నేరమిది!
భావి భారత   స్త్రీకి
మనమిస్తున్న గౌరవమిది!!

24 March 2011

చరితార్థం



బొమ్మా బొరుసూ ఉంటేనే
నాణేనికి విలువ!
కలిమిలేములు కలిస్తేనే
జీవితానికి అర్థం!
కష్టం సుఖం
తెలియక పోతే
బ్రతుకే వ్యర్థం
!
అదే జీవిత పరమార్థం!!

23 March 2011

బలిదానం




ప్రజాస్వామ్యంలో
ప్రజలే ప్రభువులు?
ప్రభుత్వం చేసే
పొరపాట్లకు
ప్రతిరొజూ శిలువనెత్తుకునే
యేసు ప్రభువులు!!

22 March 2011

తీరని దాహం

చెట్లు తెగ నరకడం-
జలాశయాలు
కలుషితం చెయ్యడం-
నీటిని ఎడా పెడా
వాడెయ్యడం-
ఇలా ఎన్నో...
మనిషి చేస్తున్న తప్పులు!
దాని ఫలితమే-
గుక్కెడు నీటి కోసం
ప్రజలు పడుతున్న
శతకోటి తిప్పలు!!

21 March 2011

ఒకరికొకరు





జీవితం
నేర్పిన బ్రతుకు పాట!
పాట
చూపిన బ్రతుకు బాట!!

20 March 2011

తగిన శిక్ష



కయ్యానికి
కాలు దువ్వితే
పెరిగేవి కక్షలు...
ఆ పైన -
లాయరు ఫీజులు
కట్టుకుంటూ పోతే
కరిగేవి లక్షలు..!

19 March 2011

ద్వంద్వ వైఖరి





ఒక వైపు  అంటారు
ఇప్పటి రాజకీయాలు
మాకు గిట్టవని...
మహాభాగ్యం -
ఇంకోవైపు...
చరిత్ర సంస్కృతిక్కూడా
రాజకీయాలు, ప్రాంతీయ భేదాలు
అంటగడతారు..
ఇదెక్కడి  దౌర్భాగ్యం..?


18 March 2011

స్థాన భ్రంశం

అడవులు తరుగుతున్నాయ్‌!
ఊళ్ళు పెరుగుతున్నాయ్‌!
అందుకే -
అభయారణ్యంలో
ఉండాల్సిన పులులు...
జనారణ్యంలో తిరుగుతున్నాయ్‌!!

17 March 2011

ఎదురీత


పాలకులు విధించే
కరెంటు కోత..
ప్రళయాలు సృష్టించే
ప్రకృతి మాత..
ఏతా వాతా
రైతన్నకు మిగిలేది..
ఒకటే అప్పుల మోత!!

16 March 2011

అంకురం




బండరాళ్ళను చీల్చుకొని
పచ్చగా మొలిచిన
గడ్డి పరకలు..!
విజ్ఞతను అణగదొక్కాలని చూసే
మూర్ఖ లోకానికి
గట్టి చురకలు..!!
 

ఆలోచనా ప్రవాహం


ఆగని ప్రవాహంలా
మెదడులోంచి జారుతున్న
తరగని ఆలోచనలు...
రైలుపెట్టెలో కూర్చుని
ముందుకు సాగిపోతుంటే
వేగంగా వెనక్కు పరుగెత్తే
చెట్లూ గుట్టల్లా...!

తెలుగు వెలుగు


తెలుగు భాష తీయదనం,
తెలుగు జాతి పౌరుషం,
తెలుగు సంస్కృతి గొప్పదనం,

వర్ధిల్లు దినదినం..
సూర్యచంద్రులు
ఉన్నంత కాలం..!
                

స్వయంకృతం



పెంచుకుంటూపోతే
పెరిగేది బంధం!
తుంచుకుంటూపోతే
మిగిలేది భేదం!!
పంచుకుంటూపోతే
పెరిగేది మోదం!
ఎంచుకుంటూపోతే
మిగిలేది ఖేదం!!

10 March 2011

గ్రహణం



అదుపుతప్పిన ఆగ్రహానికి
నేలకొరిగిన విగ్రహాలు!
మచ్చలేని తెలుగు జాతిని
పట్టి పీడిస్తున్నాయి కొన్ని
దుష్ట  గ్రహాలు!!!
 

జ్ఞానోదయం



కలిసుంటే లేదు సుఖం
విడిపోతే అంతా బలం
ఎంత గొప్ప సిద్ధాంతం -
ఇక తిరగ రాద్దాం...
తరతరాల వృత్తాంతం!

08 March 2011

ఆడపిల్ల




 కనీసం...
 తొమ్మిది నెలలైనా
 ఈ భారాన్ని
 నీ కడుపులో పెట్టుకొని
 మోసినందుకు

 నీకు కృతజ్ఞతలమ్మా!
                                                                                           

06 March 2011

సుదీర్ఘ యాత్ర



మజిలీలెన్నైనా-
ఏ అనుభవమెదురైనా-
ఆగదీబాటసారి...
అలుపెరుగని ప్రయాణం!  

            

చైతన్యం

అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతినాపలేరు-
తుపాకీ గురిపెట్టి
ప్రజాశక్తినణచలేరు-  

నిన్నొక ఈజిప్ట్‌ నేడొక లిబియా-
రేపొక సౌదీఅరేబియా-
అంతం కాదిది ఆరంభం...
నియంతలకిక చెల్లింది కాలం!

05 March 2011

తృప్తి






సొంత గూట్లో...
పచ్చడి మెతుకులైనా
పంచామృతాలే!

03 March 2011

పిచ్చిప్రేమ


ప్రేమ గాయం చేస్తుంది-
ప్రేమ నేరం చేయిస్తుంది-
ప్రేమ గుడ్డిది-
ప్రేమ పిచ్చిది-
ఇన్ని వంకర్లున్నా...
అదంటే ఎందుకో ..?
అందరికీ...
అంత పిచ్చి!!!

బాంధవ్యం



అడ్డుగోడలెన్ని కట్టినా,
విషజ్వాలలెన్నిరేపినా,
ప్రేమానురాగాల ముడులు...
విడదీయడం...
ఎవరి తరం!!!

02 March 2011

లోగుట్టు



ఇండస్ట్రీలో...
థర్టీ ఇయర్స్‌ -
ఫుల్‌ మీల్స్‌...?
ఓన్లీ త్రీ డేస్‌!!!



01 March 2011

రాజ యోగం






సర్వం...
త్యజించాలంటే -
ముందుగా...

అన్నీవెనకేసుకోవాలేమో??