27 June 2011

రాతి పుష్పం

ఏమీ అర్థం కాని పసితనం
అమ్మా అయ్యా ఎటు తీసుకెళ్తే అటే
ఏం జరుగుతుందో తెలీదు
కొంతకాలం కన్‌స్ట్రక్షన్‌ సైటు దగ్గర
రణగొణ ధ్వనుల మధ్య
కొయ్యకు కట్టిన ఉయ్యాల్లో...
ఇంకొంతకాలం క్వారీ వద్ద
ఏ ట్రక్కు నీడలోనో నిద్రపోతూ...
మరికొంతకాలం రోడ్డు నిర్మాణం పక్కన
ఏ తారు మిక్సర్‌ వెనకాలో......

పొట్ట కూటికోసం
పట్టణానికి వలసొచ్చిన
పేద కార్మికులకు పుట్టడం
ఆ పిల్లవాడు చేసిన నేరమా?
ఏ లారీ చక్రం కింద నలిగో,
ఏ మరుగుతున్న తారుకింద కరిగో
అసువులు బాయక బ్రతికి బయట పడినా..
చదువులేకా...బడి మొహమే ఎరక్కా..
ఎండకూ...వానకూ...గాలికీ..
పెరిగి..పెద్దవాడై..
అయ్యా అమ్మా చేసే పనే
తనూ చేసుకుంటూ
రాతి పుష్పంలా
జీవించడం కన్నా
ఇంకేంచెయ్యగలడు -
అతని  పుట్టుకే
అతనికొక శాపమైనప్పుడు!

23 June 2011

చెరగని ప్రేమ

అవును -
అప్పట్లో నువ్వు
అల్లంత దూరంలో కనిపిస్తేనే
గుండె లయ తప్పేది
కాళ్లు గతి మార్చేవి
పెదవులు అదిరేవి
కళ్లు బెదిరేవి
నువ్వు దగ్గరవుతున్న కొద్దీ
నాకు వశం తప్పినట్లనిపించేది
అది నువ్వంటే భయంతో కాదు
నీ మీదున్న ప్రేమతో
నువ్వు నాకు దక్కుతావో లేదో
అన్న బెరుకుతో -
అలా ఎన్ని సందర్భాలో..
ఎన్ని రోజులో..
నీ రూపాన్ని మదిలో ముద్రించుకొని
ఆ రూపాన్నే తలచుకొంటూ
నిద్రపోని రాత్రులు మరెన్నో
తెగని నీ తలపులతో
గడిపిన క్షణాలు
నాలో ఇప్పటికీ పదిలమే..
పోనీలే మంచే జరిగింది -
నువ్వు నాకు చేరువ కాలేకపోయినా
ఎప్పటికీ చెరగని
నీ జ్ఞాపకాలు నాకొదిలేశావు
నువ్వు దూరంగా వెళ్లినా
నీకు దగ్గర కావాలనుకున్న కోరికను
నా ఊహల్లో
సజీవ చిత్రంలా నిలిపేశావు!

మాకొద్దీ అభివృద్ధి


ఈ నేలా
ఈ గాలీ
ఈనీరూ...

ఈ పచ్చని చెట్లూ
ఈ పక్షులూ
ఈ పర్వతాలూ...
మేమీ భూమ్మీద పుట్టి
కళ్లు తెరచినప్పట్నుంచీ
మాతో నేస్తం కడుతున్న స్నేహితులు
మాకు ఊపిరి పోస్తున్న ప్రాణదాతలు...
ఈ జన్మకు మాకివి చాలు
మాబ్రతుకులు మేం బ్రతుకుతున్నాం
మేం సంతోషంగానే ఉన్నాం
ఇంతకంటే మాకేమీ వద్దు
ఆనకట్టలు కడతామంటూ
పెద్ద పెద్ద పరిశ్రమలు పెడతామంటూ
మా బ్రతుకులు ఉద్ధరిస్తామంటూ
మీరు చెప్పే కల్లబొల్లి మాటలు
అర్థం చేసుకోగల బుద్ది
ఆదేవుడు మాకిచ్చాడు
ఓ పారిశ్రామికవేత్తల్లారా వెనుతిరగండి
మా జీవితాలతో పెనవేసుకున్న
మా భూములు మాకొదలండి
మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనీయండి
లేదంటే....
మేం ప్రాణాలివ్వడానికైనా సిద్ధమే!
అవసరమైతే ప్రాణాలు తియ్యడానికైనా సిద్ధమే!!

22 June 2011

కవిత్వం రావాలి



కవిత్వం రావాలి!
    అవును -
    కవిత్వం రావాలి!
    చీకటిని చీల్చుకుంటూ
    లోకానికి వెలుగునిచ్చే
    ఎర్రని సూరీడులాంటి
    కవిత్వం రావాలి..
    రైతుకూలీ రక్తంతో తడిసి
    భూమాత గర్భాన్నుంచి
    మొలుచుకొచ్చిన పచ్చని పైరులాంటి
    కవిత్వం రావాలి..
    పేదోడి ఆకలిమంటలనుంచి
    భగభగ మండుతూ
    విజృంభించిన ఆక్రోశంలాంటి
    కవిత్వం రావాలి..
    తరాల అంతరాలను
    మట్టిన కలుపుతూ
    మనిషిని మేలుకొలిపే
    మానవత్వంలాంటి
    కవిత్వం రావాలి..
    ఊడలై పాతుకున్న
    మూఢ నమ్మకాలను
    మట్టుబెట్టే విజ్ఞత లాంటి
    కవిత్వం రావాలి..
    యుగయుగాల నుంచి
    నరనరాల జీర్ణించుకున్న
    నిరంకుశత్వాన్ని పాతరేసే
    విప్లవం లాంటి కవిత్వం రావాలి..
    వేలంవెర్రిలా
    యువతనుపట్టి పీడిస్తున్న
    పాశ్చాత్యధోరణులను రూపుమాపే
    వివేకం లాంటి కవిత్వం రావాలి...
    అవునవును -
    కవిత్వం రావాలి...
    మానవాళికి మేలుకలిగేలా
    మంచి కవిత్వం రావాలి!

19 June 2011

సైనికుడా సాగిపో..


ఎందుకు దుఃఖిస్తున్నావ్‌?
ఏమయిందని?
ఏం పోయిందని?

నీ అస్థిత్వం గాయపడలేదే..
నీ ఆత్మకు అంటు తగల్లేదే..
నావాళ్లంటూ
ఎవరూ మిగల్లేదని విషాదమా..
ఎవరు నీవారు?
ఎవరు పైవారు?
ఎవరు నీతో ఉండాలని కోరుకున్నావ్‌?
ఎవరు లేరని బాధపడుతున్నావ్‌?
నీలో నీవు లేవా?
నీకు తోడు నీవు కాదా?
నీ నీడతోనైనా నీకేంపని?
నీదారి నీకు స్పష్టంగా ఉన్నప్పుడు -
నీ దారిలో నువు పోతున్నప్పుడు..
నీవెనుక ఎవరైనా
ఉంటే ఏం?
లేకపోతే ఏం?
గగనసీమల్లో సంచరించే వాళ్లకు
గతి తప్పుతామేమోనన్న భయమెందుకు?
అఖండజ్యోతి సుదూరంగా
కనిపిస్తున్నంత కాలం
చిరు చీకట్లకు అదరాల్సిన పనిలేదు!
బెదరాల్సిన ఆగత్యం అంతకన్నాలేదు!!

నోట్‌ ది పాయింట్‌


     అర్థరాత్రి
     ఉన్నట్టుండి
     మెలకువ వస్తుంది

     ఇక నిద్రపట్టదు
     ఏవేవో ఆలోచనలు -
     ఒకదాని తరువాత ఒకటి
     పుట్టలోంచి వస్తున్న చీమల్లా
     ఆరోజు చెయ్యలేక పోయిన పనులు..
     పొద్దున్నే లేచి చెయ్యాల్సినవి..
     ఇలా ఎన్నో...
     అంతా గజిబిజి
     జుట్టు పీక్కోవాలనిపిస్తుంది
     అనిపించడం ఏమిటి
     అలా ఎంత జుట్టు ఊడిపోయిందో..
     అయ్యో..ఏం చెయ్యను....?
     భగవంతుడా నువ్వే దిక్కు -
     పడుకునేముందే చెయ్యాల్సిన పన్లన్నీ
     ఓ చిన్న నోట్‌ బుక్‌ లో
     రాసుకు పడుకుంటే ఈ బాధుండదుగా!

కాలంతో నేను...


     కాలం విరగబూసింది
     నా కోరికలా
     కాలం కుండపోతగా కురిసింది

     నా ఆలోచనా పర్వంలా
     కాలం నవ్వింది
     నా హృదయంలా
     కాలం పరిగెత్తింది
     నా వయసులా
     కాలం ఫలించింది
     నా ఆశలా
     కాలం మసకేసింది
     నా నిరాశలా

 ఎప్పటికీ...
 నాతోనే కాలం -
 కాలంతోనే నేను!

నాన్న నాతోనే..


నా చేతులు పట్టుకొని
నడక నేర్పిన నాన్న
భుజాలమీద ఎక్కించుకొని

నన్ను ఆడించిన నాన్న
నాకు జ్వరమొస్తే
కలవరపడిన నాన్న
నేను కంటనీరు పెట్టినప్పుడు
కన్నీరు తుడిచి ఓదార్చిన నాన్న
నేను సంతోషపడినప్పుడు
నాకంటే ఎక్కువ సంతోషించిన నాన్న
నాకళ్లలో ఎప్పుడూ ఆనందం
చూడాలనుకున్న నాన్న -
ఈ రోజు నా కళ్లముందు లేకుంటే
నేనెంత ఎత్తు ఎదిగినా
ఏదో తెలియని బాధ
గుండెను తొలిచేస్తుంటే..
నాన్న ఎక్కడ్నుంచో నన్ను
చూస్తూనే ఉన్నాడన్న
ఒక చిన్న నమ్మకం
నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది
నాన్న నన్ను వీడినా
నాన్న జ్ఞాపకాలు నాతోనే
నాన్న ఆశీస్సులు నావెంటే!

17 June 2011

ప్రత్యామ్నాయం





ఔషధ ప్రయోగాలు
ఎలుకలపై నిషేధం -
మరేం ఫరవాలేదు
మనుషులున్నారుగా...
డబ్బు ఆశ చూపి
జబ్బులు అంటగడదాం!
పేదోళ్లను లాబ్స్‌లో
గినియా పిగ్స్‌గా మార్చేద్దాం!!

14 June 2011

కన్నీటి సేద్యం


అన్నదాతల కన్నీరు..
నాయకుల పాలిట పన్నీరు!
కన్నీటి సాగు ఒకరిదైతే
పన్నీటి స్నానం ఇంకొకరిది!!
   * * *
రుతు పవనాలు తెచ్చే
వరద నీరు...
తుడవగలదా
రైతన్న కంటినీరు!
   * * *
రైతన్నకై చేపట్టిన ధర్నాలు
మోగిస్తున్నాయి విజయ ఢంకాలు!
అన్నదాత పండించిన ధాన్యాలు
కొనేవాడులేక అవుతున్నాయి నీటిపాలు!!

నాకూ ఓ మొహం దొరికింది

రోజూ పొద్దున్నే లేచి
అద్దంలో చూసుకున్నా
ఆశ్చర్యం!!!
నా మొహం కనిపించలేదు
గుండాగినంత పనైంది
పరుగున బయటపడ్డా
కనపడ్డవాళ్లందర్నీ అడిగా
నా మొహానికేమైందని
అందరూ నవ్వుతూ నా వేపు చూశారేగానీ
ఎవరూ సమాధానం చెప్పలేదు
అలా అడుగుతూ పోయా
చివరకు వ్యక్తి ఆగాడు
నవ్వుతూనే ఇలా చెప్పాడు
నిజానికి మాలో ఎవరికీ మొహాల్లేవు
ఎప్పుడో మాయమైపోయాయి
నువ్వు అదృష్టవంతుడివి
ఇప్పటిదాకైనా నీకో మొహమంటూ వున్నది
మేమంతా ఎప్పట్నుంచో
మాస్కులు తొడుక్కు తిరుగుతున్నాం
అర్జంటుగా నువ్వూ ఏదో ఒక మాస్కు కొనుక్కో
అంటూ సలహా ఇచ్చాడు
అప్పుడర్థమైంది నాకు విషయం
వెంటనే అతను చెప్పిన చోటుకు వెళ్లా
నవ్వు మొహం, ఏడుపు మొహం..
ఇలా నాలుగైదు రకాల మాస్కులు కొన్నా..
ఇక నాకు భయం లేదు -
రేపట్నుంచీ నేనూ ఏదో ఒక మొహం పెట్టుకు తిరగొచ్చు!

13 June 2011

'కోటి' మహిమలు







కట్టు గుడ్డతో బయటపడి
కోట్లు కూడబెట్టిన బాబాలు!
ఆ కోట్లకు తూట్లు పడకుండా
వెయ్యక తప్పుతుందా

రకరకాల వేషాలు!!

అపరిష్కృతం






రైతుల కోసం
ఊరూరా ధర్నాలు!
బ్రతుకు ఈడ్చలేక
రైతన్న దిగాలు!!

నేను




నా ఊహొక ఉప్పెన
నా చూపొక చిత్రం
నా హృదయమొక కవనం
నా గమనమొక భూభ్రమణం
నా చలనమొక చైతన్య గీతం
నా ఆకలి ఒక పొలికేక
నా మనసొక అగ్ని సరోవరం
నా మాటొక తుపాకీ తూటా
నా అక్షరమొక సంధించిన బాణం
నా జీవితమొక తెరచిన పుస్తకం!

రెక్కల్లేని పక్షులు





గూడులేని బడులు
జాడలేని నిధులు..
అమలుకాని చట్టాలు
అక్కరకు రాని చుట్టాలు..
పుస్తకాల్లేని చదువులు
చెట్లకింద పాఠాలు..
ఇది...
మన పిల్లలకు మనం
వేస్తున్న పునాది!

12 June 2011

చరిత్ర లేని సామాన్యుడు

గతాన్ని తవ్వుకుంటూ పోతే
జ్ఞాపకాల శిథిలాలు
బయటపడుతూ పోతాయ్‌
ఆశిథిలాలకింద నలిగి
నుజ్జు నుజ్జైన చరిత్ర పుటలు
తిరిగి రాయబడతాయ్‌
ఏ సింహాసనం ఎంత గొప్పదో
ఏ రాజ్యం ఎంత పెద్దదో
ఎవరి ప్రేమ వ్యవహారం
ఎన్ని మలుపులు తిరిగిందో
ఏ గోపురం ఎవరు కట్టించారో
ఏ కోటను ఎవరు కూల్చారో
ఒకదాని వెంట ఒకటి
గిర్రున తిరుగుతాయ్‌ -


ఏ యుద్ధంలో ఎంతమంది మరణించారో
ఏ రాజు ఎవరిని ఓడించాడో
అన్నీ కళ్లముందు కనబడతాయ్‌ -
కానీ బయటపడంది ఒక్కటే...
తరతరాల రాజ్య కాంక్షలో
నరనరాల  మృగతృష్ణలో
నేలకొరిగిన సైనికుల స్వగతం..
సమిధలైన సామాన్యుల జీవితం!

11 June 2011

అదృశ్య ప్రేయసి

నాకెప్పటికీ
అర్థం కాని విషయం...
ఒక రహస్య సంబంధంలా
అనిపిస్తుంది
ఏదో ఇంద్రజాలంలా..
భావగర్భితంగా..
శ్రావ్యమైన సంగీతంలా..
నను వెంటాడుతూ
వేటాడుతూ
కనిపించకుండా నా చుట్టే తిరుగుతూ
గాల్లో పరిమళాలు వెదజల్లుతూ...
ఏంటోమరి ఈ అనుబంధం
ఏనాటిదో ఈ బంధం
తను నా దరిదాపులోకి వస్తే
నాకిట్టే తెలిసిపోతుంది
ఆ అడుగుల సవ్వడి నాకు గురుతే
ఆ మల్లెల సౌరభం నాకు ఎరుకే
తనిక్కడే ఎక్కడో వుంది
నన్నే చూస్తుంది
నా అంతరంగ తరంగాలను
తప్పించుకొని ఎక్కడికీ పోలేదు!

08 June 2011

మల్లె తీగలు

 
 
 
 
మల్లెతీగల్లా
అల్లుకునే వాళ్లను
ముళ్ళ కంచెలు
ఏం చెయ్యగలవ్‌??
కళ్లముందే అల్లుకొని..
కంచెనంతా కమ్ముకొని..
మల్లెపూల సుగంధాలను
ఎల్లవేళలా వెదజల్లుతుంటే!

నవ్వుతూ బ్రతకాలిరా..

భయం భయం
అంతా భయం మయం
బ్రతకాలంటే భయం
చావాలన్నా భయం
తప్పును తప్పు అనాలన్నా భయం
గొంతు విప్పి మాట్లాడాలన్నా భయం
ఎదురుగా కనిపించేది
చూడాలంటే భయం
చూసింది చెప్పాలంటే భయం
కళ్లు తెరిస్తే భయం
కళ్లు మూస్తే భయం
అడుగడుగునా భయం
శ్వాస శ్వాసకూ భయం
ఇలా భయపడుతూ ఎంతకాలం?
భయాన్ని జయించు
భయాన్ని భయపెట్టు
భయపెట్టేవాణ్ణి భయపెట్టు
భయాన్ని చంపు
నువ్వు బ్రతుకు!
నవ్వుతూ బ్రతుకు!!

07 June 2011

అక్షరం



అక్షరం నా ప్రాణం
అక్షరం నా ఆహారం
అక్షరం నా ఆహార్యం
అక్షరం నా అణువణువున నిండిన
తీయని మకరందం
అక్షరం నా చక్షువులకు
ఆనందం కలిగించే సుందర స్వప్నం
అక్షరం నా మస్తిష్కాన్ని
మథించే ఆలోచనా పథం
అక్షరం నన్ను ఆదుకునే
జగన్నాథ రథం
అక్షరం నాకు శక్తినిచ్చే
వజ్రాయుధం!

ప్రేమంటే....


    ప్రేమకు
    కొత్త నిర్వచనాలు -
    ప్రేమిస్తే ప్రాణమిస్తా
    ప్రేమించకుంటే
    ప్రాణం తీస్తా!
    అవునంటే గుండెలో చోటిస్తా
    కాదంటే గొంతు కోస్తా!
    అవసరమైతే
    ప్రేమికురాల్ని చంపైనా
    ప్రేమను బ్రతికించుకుంటా!
    ప్రేమ త్యాగం చేస్తుంది
    అది నిన్నటి మాట
    ప్రేమ పగను పెంచుతుంది
    ఇది నేటి బాట!
    ప్రేమంటే ఆనందించాలో...
    భయపడి చావాలో...
    అర్థం కాని రోజులొచ్చాయ్‌!!

06 June 2011

కసాయి ప్రేమ




కత్తులతో
కుత్తికలు
కోసేవాడు
కసాయి వాడౌతాడు గానీ..
ప్రేమికుడు
ఎన్నటికీ కాలేడు!

05 June 2011

చీకటి అరుణిస్తే..


దుఃఖం నవ్వితే
చూడాలనుంది,
కన్నీరు విప్లవిస్తే
జైకొట్టాలనుంది,
భయం అభయమిస్తే
స్వీకరించాలనుంది,
మూగతనం పల్లవిస్తే
వినాలనుంది,
నిస్సహాయత నిప్పులు కక్కితే
చిందులేయాలనుంది!

వైపరీత్యం

మండు వేసవిలో
పండు వెన్నెలలు,
చలికాలంలో
వేడి గాల్పులు,
వర్షాకాలంలో
ఎండిన చెరువులు,
వసంత కాలంలో
రాలే ఆకులు,
శిశిరంలో
కోయిల గానాలు -
ఏమిటీ పైత్యం
అనుకుంటున్నారా..
ఇది పైత్యం కాదు
విధి వైపరీత్యం -
మానవ తప్పిదాలకు
ప్రకృతి దారితప్పితే
జరగబోయే పరిణామం!

దారుణం





ప్రకృతి రవంత
కన్నెర్ర జేస్తే
విలవిలలాడే మానవుడు...
దాన్ని కుళ్లబొడవడానికి మాత్రం
ఇసుమంత వెనుకాడడు!

03 June 2011

మొండి మనసు






మనసు మూగదైనా
ఎన్నెన్ని మాటలు
చెబుతుంది నాకు..!
అన్నీ వింటాన్నేను -
నేనెంత చెప్పినా..

అది మాత్రం
కొంచెం కూడా
వినిపించుకోదు!!

02 June 2011

అసందర్భం


 
 
 
 
అవసరమైనప్పుడు
అర్థం చేసుకోదీ మనసు!
అర్థమయ్యేటప్పుడు
అవసరంలేదంటుందీ వయసు!!