30 July 2011

అల్ప సంతోషి




అష్టైశ్వర్యాలూ వద్దు
నీ పెదవిపై తొణికిసలాడే
చిన్ని మెరుపే ముద్దు!
పంచభక్ష్య పరమాణ్ణాలూ కాదు
నీ అధరం చిందే
చిరు మధువే చాలు!!

నీ కోసం




చిరునవ్వుతో
పలకరిస్తే
చితినుండి లేచి వస్తా!
మరుజన్మనైనా
మనసిస్తానంటే
ఈ క్షణమే మరణిస్తా!!

22 July 2011

నా మనసే నీదై...

నా మనసు నీకు తెలుసు
అది నా మనసుకు తెలుసు
మనసు సంగతి మనసుకుగాక
ఇంకెవరికి తెలుసు
నా మనసే నీ వశమై
నీ మనసుకు అది బందీ అయి
మనిషి కాని మనిషిని నేనై
నా మనసులోని మనిషివి నీవై
నీవూ నేనూ సగసగమై
తోడూ నీడల సంగమమై
కలలు కందాము తుదిదాకా
కలసి ఉందాము కడదాకా!

21 July 2011

యుద్ధ ఛాయలు



భూమికి పెరుగుతున్న
జన భారం.....
జనులకు తరుగుతున్న
జీవనాధారం!
నీటికోసం కూటికోసం యుద్ధం...
కాబోతుందా యథార్థం?

20 July 2011

కలగంటి..కలగంటి..

కలగనడం అంటే
నాకు ఎందుకో చాలా ఇష్టం
వచ్చే ప్రతి కలా
చెదిరిపోక తప్పదు..
కొన్ని కలలు
చాలా భయంకరంగా కూడా ఉంటాయ్‌..
అయినా నాకు కలలంటే ఇష్టమే
ఎందుకంటే -
ఇప్పటివరకూ
నేను సాధించినవన్నీ
ముందుగా కలగన్నవే
నాకు జీవితంలో దొరికినవన్నీ
ముందుగా కలలో చూసినవే
అందుకే నేను
ఎప్పుడెప్పుడు కలలొస్తాయా అని
ఎదురుచూస్తూ ఉంటాను!

18 July 2011

క్షణికావేశం




మన జీవితంలోని
కోటానుకోట్ల క్షణాల్లో

ఆవేశంలో
నిర్ణయం తీసుకున్న
ఒకే ఒక్క క్షణం చాలు -
నిండు జీవితం
నిర్దాక్షిణ్యంగా
నలిగిపోవడానికి!

అన్యాయం





అడవులు తరుగుతున్నా...
ఆటవికతనం మాత్రం

లోతుగా వేర్లూనుతూ
రోజు రోజుకూ
బలంగా పెరుగుతూనే వుంది!

17 July 2011

జ్ఞాపకాల నీడలో...

ఆ చెట్టు అక్కడే
నిలబడి ఉంది
దశాబ్దాలుగా...
నిశ్శబ్దంగా...
ఎన్ని తరాలను చూసింది
ఎంతమందికి తన నీడలో చోటిచ్చింది
స్నేహితులు...
ప్రేమ జంటలు...
అలసట తీర్చుకొనే వాళ్లు...
ఆనందంగా కబుర్లు చెప్పుకొనే వాళ్లు...

అలా ఎందరో -
తమ మజిలీ ముగించుకొని వెళ్లిపోయి
ఎప్పటికో తిరిగివచ్చి
గతస్మృతులను నెమరువేసుకొనే వాళ్లను చూసి
ఆ చెట్టుపొందే ఆనందం...
ఏ బంధానికీ తీసిపోని బాంధవ్యం..
చెట్టుకూ మనిషికీ ఉన్న అనుబంధం -
కంటికి చెమ్మలా..
గొంతుకు పూడికలా..
హృదయానికి ఆర్ద్రతలా..
ఎప్పటికీ అక్కడే నిలబడి ఉంటుంది
ఆ చెట్టు మన జ్ఞాపకాలకు గుర్తుగా!

01 July 2011

నిరీక్షణ

ఎందుకో -
ఆ పేరు ఎక్కడ కనపడినా..
ఎప్పుడు వినపడినా...
తనేనేమో అనిపిస్తుంది!
ఆతృతగా చూస్తాను
తను కాదని తెలిసిన
మరుక్షణం చెప్పలేని నిరాశ -
అంతలోనే....
ఎప్పటికైనా కనిపించకపోతుందా
అని ఎక్కడో చిన్న ఆశ -
ఇప్పుడెలా ఉంటుందో...!
అంతే అందంగా ఉంటుందా?
తనని చూడగానే అప్పటిలాగే
నా గుండె లయ తప్పుతుందా?
సుధలు కురిపించే ఆ పేరు...
మహారాణిలా హొయలొలికే ఆ ఠీవి...
ఒక్కసారి తనను చూస్తే
ఇక మర్చిపోవడం సాధ్యమా...!
నా ఊహా ప్రపంచంలో
నిరంతరం మెదిలే
నా చిననాటి నేస్తం
ఏదో ఒక రోజు -
హఠాత్తుగా నా ముందు ప్రత్యక్షమౌతుందని
ఎందుకో నాకు గట్టి నమ్మకం
ఆ రోజు కోసం.....
ఎన్ని రోజులైనా నిరీక్షిస్తా!