30 October 2011

గెలుపు

పొటీలో ఒకరిని ఓడిస్తేనే
కాదు గెలుపు -
ఓటమిని సహృదయంతో
స్వీకరించినవాడిది కూడా గెలుపే!

ప్రేమ

ఒకరిని కలిసినప్పుడు
సంతోషంగా ఉంటే
అది ఇష్టం -
ఒకరు లేనప్పుడు
చచ్చిపోవాలనిపిస్తే
అది ప్రేమ!

ఓటమి

గెలుపును
తలకెక్కించుకోవడమే
అసలైన ఓటమి!

త్యాగం

నీ బాగు నువ్వు చూసుకుంటే
అది స్వార్థం ..
నీ కుటుంబాన్ని బాగుచేసుకుంటే
అది ధర్మం..
ఆ రెంటితోపాటు దేశంకోసం
కృషి చేస్తే అది దేశభక్తి..
అవి రెండూ కాదని దేశానికే
అంకితమైతే అది త్యాగం!

అమ్మ

నువ్వు ప్రయోజకుడివయ్యావా లేదా
అని చూస్తాడు నాన్న..
తనపరువు తియ్యకుండా ఉంటే చాలు
అనుకుంటాడు అన్న..
పెళ్లైన తరువాత కూడా
తనమీద ప్రేమ అలాగే ఉండాలని
కోరుకుంటుంది చెల్లి..
రోజూ కడుపునిండా తింటున్నాడా లేదా
అని కలవరపడేది అమ్మ ఒక్కతే!

28 October 2011

విద్య

కోటి విద్యలు
కూటి కొరకే
అది నిన్నటి మాట-
నేటి విద్యలు
పోటీ వరకే
ఇది ఈనాటి బాట!

అందం

చంద్రబింబంలా వెలిగే నీ మోము
చేపపిల్లల్లా మెరిసే నీ కళ్లు
ఎన్నటికీ చెరగని నీ చిరునవ్వు
బూరెల్లా పొంగిన నీ బుగ్గలు
శంఖంలాంటి నీ మెడ
కందిరీగలాంటి నీ నడుము
నల్లని త్రాచులా నాట్యమాడే నీ వాల్జెడ -
ఊహూ...ఇవేమీ కాదు -
ప్రేమతో నిండుగా తడిసిన నీ కళ్లతో
ఆర్తిగా నువు నన్ను చూసే చూపులేదూ...
అందులోనే ఉంది నీ అందమంతా!

నవ్వు

వద్దనుకున్నా
వచ్చేది నవ్వు
ఒకప్పుడు -
కావాలనుకున్నా
నవ్వలేకపోతున్నాను
ఇప్పుడు!

26 October 2011

తృప్తి

మన ఆత్మీయులకోసం
జీవించడంలో ఉన్న ఆనందం
మనకోసమే బ్రతకడంలో లేదు-
జీవితంలో కొన్ని క్షణాలైనా
ఇతరులకు ఉపయోగపడితే
దాన్లో ఉన్న తృప్తే వేరు!

25 October 2011

భ్రమ

భ్రమ -
ఎంత గొప్ప పదం
పుట్టుకతోనే
ఆ బ్రహ్మ దేవుడు
ప్రతి మనిషికీ ఇచ్చిన వరం -
ఈ భ్రమ అనేదే లేకపోతే
మనిషి ఏమైపోయేవాడో...
అనుక్షణం మనిషి
వెన్నంటి ఉండే భ్రమ -
లేనిది ఉన్నట్టు
ఉన్నది లేనట్టు -
ఎంత ఆనందాన్ని కలిగిస్తుందొక్కక్కసారి
అంతే విషాదంలోక్కూడా
తోసెయ్యగలదు అప్పుడప్పుడు..
ఏదేమైనా భ్రమ అనేది
ఆ దేవుడిచ్చిన పెద్ద సౌకర్యం
మనిషికి ఏమున్నా లేకున్నా
జీవితమంతా భ్రమలో బ్రతికెయ్యొచ్చు -
ఈ రోజు కాకున్నా రేపైనా
మంచిరోజులు వస్తాయని ఒక అభాగ్యుడి భ్రమ..
వచ్చే సంవత్సరమైనా
వర్షాలు సకాలంలో పడతాయని
ఓ రైతు భ్రమ..
ఎప్పటికైనా దేవుడు దిగివచ్చి
దుర్మార్గులను శిక్షించి
సన్మార్గులను రక్షిస్తాడని
ఓ అమాయకుడి భ్రమ..
మన పిచ్చిగానీ
ఆ దేవుడే ఒక పెద్ద భ్రమేమో
లేదు లేదు అలా అంటే
దేవుడికి కోపమొస్తుంది
మనల్ని శిక్షిస్తాడు -
ఇదేమరి అసలైన భ్రమంటే!

గుడి(సె)

రోడ్డు మధ్యలో ఉన్న
గుడిని తొలగిస్తే
పెడతాడేమో దేవుడు
శాపం -
రోడ్దు పక్కనున్న
గుడిసెను పీకేస్తే
ఎవరికీ అంటదు
పాపం!!

21 October 2011

మానవత్వమా నీవెక్కడ?


నీతులూ, విలువల గురించి
నాకు చెప్పకు
నీలో మానవత్వం ఉందో లేదో చెప్పు
మనిషన్న వాడు..మానవత్వం ఉన్నవాడు
ఎక్కడున్నాడో చూపించు
మిగతావాళ్లతో నాకనవసరం
ఆకలితో కడుపు మండే వాడికి
గీతను బోధిస్తే వింటాడా?
అవమానంతో ఊగిపోయే వాడికి
నీతిసూత్రాలు వళ్లిస్తే ఊరుకుంటాడా?
నీ చాదస్తంగానీ...
భంగపడ్డవాడి విశ్వరూపం ముందు
ఆ భగవంతుని విశ్వరూపం చిన్నబోదూ...
నిన్నూ నన్నూ విడదీయడానికి
వేదాలు,స్మృతులూ అవసరమేమో...
మనిషిని మనిషిగా గుర్తించడానికి
మనసుంటే చాలదా..!
కోట్లతో పనిలేదు..కోరిక ఉంటే చాలు
మానవత్వంతో ఎదుటి మనిషిని పలకరించడానికి!

19 October 2011

ఎవరికెవరు...

ఇక్కడ దారంకంటే సులువుగా
బంధాలు తెగిపోతుంటాయి...
తల్లీబిడ్డలూ, అన్నదమ్ములూ, భార్యాభర్తలూ
ఎవరికివారే యమునా తీరే...
ఇక్కడ పచ్చనోట్లే మాట్లాడతాయి
పచ్చినిజాలు సిగ్గుపడుతూ తలొంచుకొని
పక్కన నిల్చుంటాయి...
ఇక్కడ మనుషులకన్నా, మమతలకన్నా
మార్కెట్‌ సంబంధాలే ముఖ్యం...
ఇక్కడ అందరూ విజేతలే
ఎప్పుడూ ఓడేది మాత్రం మానవత్వమే..
ఇక్కడ ఎవరూ ఎవరికి ఏమీ కారు
ఎంత వెతికినా...

బంధాలు

చుక్కలన్నీ
కలిపితేనే ముగ్గు
పూవులన్నీ
గుచ్చితేనే మాల
అక్షరాలను
కూరిస్తేనే వాక్యం
మనుషులంతా
కలిస్తేనే సమాజం
అనురాగాలను
పంచితేనే అనుబంధం
అప్యాయతలు
పెంచితేనే పెనుబంధం!

వాన వెలిసింది

వాన
జోరున కురిసి
వెలిస్తే...
కళ్లు
భోరున ఏడ్చి
నిలిస్తే...
పేరుకున్న కుళ్లు
కడిగేసినట్టుగా -
చేరుకున్న బాధ
తుడిచేసినట్టుగా -
ఎంత కాంతి
ఆ పరిసరాల్లో!
ఎంత శాంతి
ఆ కన్నులలో!!

18 October 2011

ఆ గుండెకే తెలుసు...

నవ్వు -
సంతోషానికే సంకేతం కాదు-
దుఃఖం -

బాధకే చిహ్నం కాదు-
గుండెకే తెలుసు
ఆ గుండెలో ఏముందో-
గుండె విప్పితే గానీ
అర్ధంకాదు మనకు
అందులో గూడు కట్టిన
బాధ ఎంతుందో !

17 October 2011

దృక్పథం

జీవితాన్ని -
ఒకడు..
కాచి వడగడతాడు
ఇంకొకడు..
తూచి వెలకడతాడు!

అమూల్యం

కాయం లోని
ప్రతి కణమూ
విలువైనదే -
కాలం లోని
ప్రతి క్షణమూ
అమూల్యమైనదే!

మనసు లేని మనిషి

రాళ్లు విసిరినా ఫలాల్నే
అందిస్తుంది చెట్టు...


వళ్లంతా తూట్లు పొడిచినా మధురమైన
గానాన్నే వినిపిస్తుంది మురళి...


నిప్పులో కాల్చి సమ్మెటతో కొట్టినా
మన అవసరానికే ఉపయోగపడుతుంది ఇనుము...


గునపాలతో తవ్వినా మన దాహమే
తీరుస్తుంది నేల...


కానీ ఎందుకో -

ప్రేమించినా కూడా తిరిగి ప్రేమను
పంచలేకపోతున్నాడు మనిషి...

16 October 2011

మనసు గతి ఇంతే...

పగలంతా కష్టపడి
ఎలాగో నిన్ను మర్చిపోతాను-
ఖర్మ...
చీకటిపడిందో లేదో
మళ్లీ నువ్వు గుర్తొస్తావు-
ఇక రాత్రంతా జాగారమే!

15 October 2011

వేశ్య

 



మనసు చంపుకొని
తనువు పంచుకొని
తన ఆకలి మరచి
మరొకరి ఆకలి తీర్చి
మోసానికి బలియై
సంఘానికి వెలియై
బ్రతుకు ముళ్ళ చెట్టై
వళ్లు రోగాల పుట్టై -





14 October 2011

హే రాం!

గాంధీ టోపీ
పెట్టుకొని
గాంధీకే టోపీ
పెడుతున్నారు నేడు
మన నేతలు!

ఊరు పారిపోయింది

చెఱువు ఎండిపోయింది
చెట్టు వాడిపోయింది
పిట్ట ఎగిరిపోయింది
ఊరు పారిపోయింది!

విశ్వాత్మ

నేను భగ భగ మండుతున్న సూర్యుణ్ణి మింగి
అగ్ని గోళమై వెలుగుతున్నాను..
కణ కణలాడే నిప్పు కణికలే  తిని
వేడి సెగనై రగులుతున్నాను..
హోరున వీచే గాలిని పీల్చి
ఝుంఝూనిలమై చెలరేగుతున్నాను..
సప్త సముద్రాల నీటిని తాగి
పెను ఉప్పెననై కబళిస్తున్నాను -
ఇదే నా ఆఖరి ప్రస్థానం
కాంతి రథాన్ని లాక్కుంటూ వస్తున్నాను
తోవలో అన్నీ ముళ్ళూ రాళ్ళే..
శరీరమంతా గాయాలే
నా ఆత్మకు అయిన  గాయం ముందు అవెంతలే..?
సుడి గాలితో చుట్టేస్తాను
ఆకాశానికి ఎత్తేస్తాను..
ఎర్రని లావానై కప్పేస్తాను
పాతాళానికి తొక్కేస్తాను..
దావానలంలా వ్యాపిస్తాను
హిమాలయాలనే కరిగిస్తాను
దుర్మార్గాన్ని భూస్థాపితం చేసి..
సన్మార్గంలో నడిచే వాళ్లను చేయిపట్టుకు నడిపిస్తాను!

13 October 2011

నీతోనే ఉండాలని...

నీ పెదవులపై
చిరునవ్వునై నిలవాలనుంది
నీ కంటిపాపలో
వెలుగునై నిండాలనుంది
నీ హృదయంలో
అనురాగాన్నై పాడాలనుంది
నీ నుదిటిపై
సిందూరమై మెరవాలనుంది
నీ అరచేతిలో
గోరింటాకునై పండాలనుంది
నీ శ్వాసలో
ఊపిరినై చేరుకోవాలనుంది
నీ కలలలో...
నీ ఊహలలో...
నీ ధ్యాసలలో...
నీ ప్రతి క్షణంలో
నీ అణువణువులో
నీ అడుగడుగులో
నిక్షిప్తమై
నిబిడీకృతమై
నిత్యం నీతోనే కలిసుండాలనిఉంది!

పునర్జీవనం


విరామమెరుగని ఈ కాలచక్రంలో
ఒకానొక ఘడియలో
నేను జీవం పోసుకున్నాను

ఈ భూమ్మీద పడి శ్వాస తీసుకున్నాను
బుడి బుడి నవ్వులతో
మిస మిస నడకలతో
ఆనందాల హరివిల్లుపై విహరిస్తుండగా
ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నా పయనం
చక్రాల చట్రంలో
గిర గిరా తిరుగుతూ
ఉన్నచోటే వేళ్లూనుకుంటూ
నాలో నేనే నిష్క్రమిస్తూ
కాలానికి గాలం వేస్తూ
రోజులు గడపాలేమో అనుకున్నాను-
ఏ దేవుని వరమో
ఏ జన్మలోని రుణమో
అస్తమించిన జీవితంలో..
అరుణ కిరణం అభయమిచ్చింది
వేయి ఏనుగుల బలం నాలో నాట్యమాడింది
ఆకలి ఎరుగని ఆనందం
బాధ తెలియని ప్రయాణం
తిరిగి మొగ్గతొడిగాయి
ఎల్లలు లేని అనుభవం
మలినం కాని విజ్ఞానం
ఏ వింతలోకాలలోనో విహారం -
ఈ జన్మకిది చాలు
మరో జన్మంటూ ఉంటే
మళ్లీ తనతోనే నేస్తం!

నిమజ్జనం

హరప్పా మొహంజొదారోలను
నా శిరస్సుపై ఎత్తుకొని
నాగరికత వీధుల గుండా
నడుస్తున్నాన్నేను -
కరిగిపోయిన కోట బురుజులు...
వరిగిపోయిన ఆలయ శిఖరాలు...
చెరిగిపోయిన శిలా శాసనాలు...
శిథిలమైన మహా నగరాలు...
ఇలా ఎన్నో జ్ఞాపకాల నీడలు దాటుకుంటూ
పయనిస్తున్నానిప్పుడు -
అలనాటి రాజ్యాలేవి?
ఆనాటి సంపదలెటుపోయాయి?
ఆ సంప్రదాయాలెక్కడ అదృశ్యమయ్యాయి?
ఆ గౌరవమర్యాదలెక్కడ మంటగలిశాయి?
ఎక్కడ నా అతి పురాతన సంస్కృతి?
ఏదీ నా సచ్ఛీలత?
ఆడపిల్లను తల్లిగర్భంలోనే విచ్ఛిన్నం చేసే నీతి -
అతివలను అగ్నికి ఆహుతిచ్చే అపకీర్తి -
అతిథులను ఆదరించడం చేతగాని దుర్గతి -
వృద్ధులను ఆశ్రమాలకు పంపే కుసంస్కృతి -
ఇవేనా నా చారిత్రక అవశేషాలు?
ఇవేనా నా సంస్కృతి నేర్పిన పాఠాలు?
ఏ రాళ్ళకింద పూడ్చిపెట్టను
ఈ హరప్పా నాగరికతను?
ఏ గంగలో నిమజ్జనం చేయను
ఈ మొహంజొదారో ప్రాచీనతను??

10 October 2011

ఆధారం

నేటికి
రేపటిపై
ఆశ-
రేపటికి
నేటిపై
భరోసా!

08 October 2011

మౌనం మాటలైన వేళ

అతను..ఆమె..
ఒకరి ప్రేమలో ఒకరు..
ఒకరి హృదయంలో ఒకరు..గాఢంగా..
ఆ సాయంసంధ్యలో
చిక్కటి వర్ణాలను
చీకటి నెమ్మదిగా చిదుముతున్న వేళ..
ఎదురెదురుగా వాళ్లిద్దరూ
ఆ సముద్రం ఒడ్డున
వినిపించని అలల హోరు..
చూపుల సంగమం..
కను కనుమలలో ప్రణయ విహారం
మాటలుడిగిన మనసులు
మౌనరాజ్యాన్నేలుతున్నాయి
ఆ ప్రేమ భావాలను వ్యక్తీకరించడానికి
ఏ మాటలూ సరిపోవు
నిశ్శబ్ద రాగాలాపనే ఆ సమయానికి తగినదేమో
యుగాలు సంగ్రహపరచలేని
ప్రణయ భావావేశం వాళ్లది
అంతా కొన్ని క్షణాలలోనే చెప్పుకోవాలనే తపన వాళ్లకి
చివరికెలాగో...
"నీతో చాలా మాట్లాడాలని వచ్చాను" అంది ఆమె
"నాకూ నీతో ఎంతో మాట్లాడాలని ఉంది" అన్నాడతను
"అయితే చెప్పు"..ఇద్దరూ ఒకేసారి అన్నారు
ఏదో చెప్పాలని ఉన్నా...
ఇద్దరి గొంతూ పెగిలి ఒక్క మాట బయటకు రాలేదు
ఒకళ్ల అవస్థను చూసి ఒకళ్లు నవ్వుకున్నారు..
హాయిగా...తనివితీరా..సముద్రం సాక్షిగా..
అంతే మళ్లీ మౌనంలో మునిగిపోయారు
ఆ మౌనంలోంచి వాళ్లు తేలేదెప్పటికో..?
ఏమో అది వాళ్లకూ తెలీదు...
ఆ సముద్రానికీ తెలీదు...
ఆ మౌనానికి అంతకన్నా తెలీదు!

07 October 2011

విశ్వ వేదం


అనంతమైన విశ్వం-
కోటానుకోట్ల
సౌరకుటుంబాలు-

'నేను' అందులో ఎక్కడ?
ఎక్కడా లేనేమో..
కానీ...
నాలో ఓ విశ్వం
దాక్కుని ఉంది
దాన్లో..
ఎన్నో...
గ్రహాలూ..నక్షత్రాలు..
పాలపుంతలు..తోక చుక్కలు..
మండే సూర్యుళ్లు..
లోతైన సముద్రాలు..
కొండలు..లోయలు -
వేగంగా విస్తరిస్తుంది
ఆవలి విశ్వం
ఉప్పెనై పొంగుతుంది
నాలోని సర్వస్వం-
ఆ విశ్వం ఈ విశ్వాన్ని
కబళిస్తుందో...
లేక ఈ విశ్వమే
ఆ విశ్వాన్ని కరిగిస్తుందో..
ఎవరికెరుక..?

ఈ ప్రకృతిలో కృతినై...

ఎన్నో రంగుల కలబోత
ఈ ప్రకృతి మాత -
పసుపు..ఆకుపచ్చ..
ఎరుపు..నీలం..
తెలుపు..నలుపు..
ఇంకా ఎన్నో...
ఎన్నెన్నో వర్ణాల మేలు కలయిక..
ఈ సుందర సుమనోహర
చైతన్య దీపిక -
ఆ పసుపు రంగును ఆస్వాదించి
ఆకుపచ్చతో వళ్లంతా
నలుగుపెట్టుకోవాలనుంది
ఆ ఎరుపు రంగులో తన్మయించి
నీలవర్ణంలో స్నానమాడాలనుంది
ఆ తెలుపులో తాథాత్మ్యం చెంది
నలుపులో నా అజ్ఞానాన్ని
మిళితం చేయాలనుంది..
ఈ ప్రకృతి ప్రతి అణువులో రేణువునై 
దానిలో లీనమవ్వాలనుంది!

04 October 2011

అందం

ఆమె సౌందర్యం
వర్ణనాతీతం...
అని చెప్పలేం కానీ
మంచి అందగత్తె అనొచ్చేమో..
పొడవైన నల్లని కురులు
ఆకర్షణీయమైన మోము
చక్రాల్లాంటి కళ్లు
చూడగానే ఆకట్టుకునే ఆకృతి -
దుమ్ము పట్టిన వజ్రంలా ఉంది ఆమె
మట్టి అంటిన కమలంలా ఉంది -
రోడ్డు పక్కన అడుక్కునే బిచ్చగత్తె!

02 October 2011

టు వే ట్రాఫిక్‌

ఆశించడంలో తప్పులేదు
త్యజించడంకూడా నేర్చుకోవాలి
తీసుకుంటే ఫరవాలేదు
ఇవ్వడంకూడా తెలిసుండాలి -
నాకు కావాలి అని
అడిగిన నోటితోనే
ఇదుగో తీసుకో అన్న
మాట కూడా రావాలి!

01 October 2011

ఫాల్స్‌ ప్రెస్టిజ్‌

వాడెప్పుడూ
వాడిదికాని ఓ వ్యక్తిత్వాన్ని
తన వళ్లంతా కప్పుకు తిరుగుతుంటాడు
వాడికి తనకంటే
తనదికాని ఆ వ్యక్తిత్వమంటేనే మక్కువ ఎక్కువ
వాడెక్కడికెళ్లినా
ఆ వ్యక్తిత్వం వాడివెంటే...
వాడు తననైనా మర్చిపోతాడేమోగాని
తనపై ఉన్న వ్యక్తిత్వాన్ని మాత్రం
ఎప్పుడూ వదిలి పట్టడు
వాడికి తనేమైపోయినా ఫరవాలేదు
ఆ వ్యక్తిత్వానికి ఎటువంటి కష్టమూ
రానీయడు
అసలో..ఫాల్సో...
వాడికి తన అంతరాత్మకన్నా
తనపై సవారీ చేస్తున్న
ఆ వ్యక్తిత్వమే ముఖ్యం!