31 January 2013

వేటు


       






బియ్యం సన్నమే...
గొంతు దిగడమే కష్టం -
రేటు చూస్తే!!!

కవిత్వానికి కూడు పెడదాం


కవిత్వం కూడు పెడుతుందా?
పెట్టదు -
బట్టనిస్తుందా?
ఇవ్వదు -
మరెందుకీ కవిత్వం?

ఎందుకంటే....

కవిత్వం...
కళ్లు తెరిపిస్తుంది
నిజాన్ని చూపిస్తుంది
మనసును కరిగిస్తుంది
మమతను కురిపిస్తుంది
అణగారిన ఆవేశాన్ని
వెలికి తీస్తుంది
పెను నిద్దురలో మునిగిన
మానవత్వాన్ని తట్టిలేపుతుంది
మనిషితత్వాన్ని నేర్పిస్తుంది
మనిషిగా నిలబెడుతుంది
అందుకే -
కవిత్వానికి కూడు పెడదాం
కవిత్వానికి బట్ట కడదాం
కవిత్వాన్ని బ్రతికించుకుందాం
మనుషులుగా బ్రతుకుదాం !!!

30 January 2013

అభయం

ఆశల వెలుగుల తారాజువ్వలు
వెలిగించుకుంటూ
ముందుకు సాగుతున్నదొక పడతి
అదే తను చేసిన నేరమేమో ?
చీకటి రక్కసి కోరలు విసిరింది
కామసర్పాల క్రూరానికి బలిచేసింది
ఆరుతున్న దీపం-
మరుగుతున్న రక్తం-
అడ్డుపడింది..
ఆక్రోశించింది..
కామాంధుల క్రోధానికి
కమిలింది..కుమిలింది..
కడదాకా పోరాడి ఓడింది
పాపం ఎంత భయపడిందో..?
ఎన్ని ఆక్రందనలు చేసిందో..?
ఒక జాతి జాతి ఒణికింది
ఆవేశం ఉరికింది,
ఆవేదన పెల్లుబికింది..
నిర్భయానికి అభయమిచ్చింది..
నిర్లజ్జ నిర్మూలనకు కంకణం కట్టింది..
నీచ నికృష్టులకు ఉరే సరంది-
అమలవుతుందో లేదో మరి?
చట్టాల చట్రాలలో
నిజం నిర్వీర్యమై నలిగి పోతుందో..?
నిప్పు కణికలా రగిలి
పాపాన్ని తుదముట్టిస్తుందో
..???

29 January 2013

కనువిప్పు


తరతరాల పోరు
నిరంతర హోరు
దగాపడ్డ చరిత్ర
దిగాలుపడ్డ భవిత
దినదినం జరుగుతున్న
దోపిడీల ప్రహసనంలో
దోచుకున్నదెవడు?
దోపిడీకి గురైనదెవ్వడు?
రెక్కలు ముక్కలై
చిక్కిన డొక్కలై
అతుకుల బతుకులై
ఆక్రందనలు చేసేదెవ్వడు?
ఉద్యమాల సరిహద్దుల్లో
ప్రాణాలను పణమెట్టి
నేలకొరిగేదెవ్వడు?
అసమర్థ హాహాకారాలతో
అర్థరహిత మాటలతూటాలతో
అమాయకులను ఏమార్చేదెవ్వరు?
నిరాశా నిస్పృహలలో
నిద్రాణమై ఉన్న నిజం
నిప్పులు చిమ్మేదెప్పుడు???



28 January 2013

అవశేషం!

ముసురు పట్టి చాన్నాళ్ళైంది-
ఫెళ్ళున తగిలే ఈదురు గాలులు..
నరాలు తెగ్గోసే చలి...
ఎప్పుడు ప్రళయం ముంచుకొస్తుందో..?
అప్పుడప్పుడూ తళుక్కుమనే
మెరుపుల వెలుగుల్లో
కనిపించీ కనిపించని దారులు..
ముసురు ఉసురు తగిలి
అసువులు బాసిన అభాగ్యులెందరో...
ఈ సశేషాల అవశేషాలు
అంతమయ్యేదెప్పుడో?