28 February 2013

నిరీక్షణా ఫలం




రంగురంగుల పూలతో నిండిన 
పూదోటలా ఉండాలనుకున్నా జీవితం...
మధురమైన గుభాళింపుతో
విరగబూసిన మల్లెపూవులా 
పరిమళించాలనుకున్నా ప్రతిరోజూ...
కానీ...ఏమిటో..
ఒక్కోరోజు ఎడారిలో ఉన్నట్లనిపిస్తుంది..
మరో రోజు నడిసముద్రంలో మునిగిపోతున్నట్లనిపిస్తుంది..
ఇంకో రోజు ఎండిపోయిన శిశిరవనంలో 
దిక్కుతెలియక తిరుగుతున్నట్లనిపిస్తుంది..
జీవితమంటే ఇంతేనేమో..?
వసంతం వచ్చేవరకూ ఓపికతో ఆగితే
పచ్చని వనాలు, కమ్మని కోయిల పాటలు..
సుగంధభరిత పరిసరాలు.. 
కళ్లముందు నాట్యం చేస్తాయేమో!       

26 February 2013

తిరిగిరాని లోకాలు



ఇంట్లో నేనెన్నో వాణ్ణో
నన్నుకన్నవాళ్లకే యాదుండదు 
అది ఇల్లో...బందెలదొడ్డో.. 
సమజ్జేసుకోవడం కష్టమే
తిండానికి లేక 
ఎన్ని దినాలు ఖాళీ కడుపుతో నిద్రపోయానో... 
రోజూ బడికిపొయ్యే పిల్లల్ని చూసి 
నాకూ చదువుకోవాలనిపించేది
నన్ను స్కూలుకెందుకు పంపడంలేదో 
మొదట్లో అర్ధమయ్యేది కాదు
తరవాత తెల్సింది అది నా నసీబులో లేదని..

ఎందుకు బతుకుతున్నానో తెలీదు
ఇకముందెలా బతకాలో అంతకంటే తెలీదు
మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కలున్న 
ఇళ్లన్నిట్లో ఇదే పరేషానీ 

మా పక్కింటి ఖాసింభాయ్ వద్దకు  
ఎవరో వస్తుండేవాళ్లు
బాబానడిగితే వాళ్లగురించెప్పుడూ
ఆరా తీయొద్దన్నాడు
నా దోస్తులు కొంతమంది ఉన్నట్టుండి
కనిపించకుండాపొయ్యేవారు
అప్పుడప్పుడూ పక్కిళ్లలో ఏడుపులు వినిపించేవి
ఎవరో వచ్చి వాళ్లను ఓదార్చే వాళ్ళు
దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబు విస్ఫోటం జరిగినా
పోలీస్ సోదాలు, ఎవరో ఒకర్ని  పట్టుకుపోవడాలు
మాకు అలవాటై పోయాయ్... 

ఒకరోజెందుకో బాబా చాలా గాభరాగా ఉన్నాడు
ఏమైందని అడిగా - 
బాబా కంటినిండా నీళ్లు..
దగ్గరకు తీసుకున్నాడు..
ఈ బాంబులు వెయ్యడాలూ, ప్రాణాలు తియ్యడాలూ మనకొద్దంటూ 
నన్ను పొదివిపట్టుకున్నాడు
ఆ ఖాసింభాయ్ తో ఎప్పుడూ మాట్లాడొద్దన్నాడు  
నాకేదో మెల్లగా అర్ధమైంది  
గల్లీలో నాదోస్తులెందుకు మాయమౌతున్నారో తెలిసింది
అప్పుడే నిర్ణయించుకున్నా...
జీవితంలో తప్పుదోవ పట్టొద్దని.. 
కష్టపడుతూ బతకడంలోనే ఖుషీ ఉందని..

మా ఇలాకాలోకి ఇంకా ఎవరో వస్తూనే ఉన్నారు..
మా పేటలోని యువకులు తిరిగిరాని చోటికి పోతూనే ఉన్నారు!  

అడవి ఆవేదన



ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ప్రయత్నిస్తుంది
అడవి -  
చేతులు నరికేసినా.. 
కాళ్లు తెగ్గోసినా..
తిరిగి పచ్చగా ఎదగాలనే కోరుకుంటుంది..
విస్తరించే అడవిని కత్తిరించి
కాంక్రీటుతో ప్లాస్టిక్ సర్జరీ చేసినా
చూస్తూ ఏమీ అనదు -
తన కన్నీరు ఇంకిపోయేవరకు
మౌనంగా రోదిస్తుంది తప్ప - 

అడవికి నిప్పంటించి,  దాని శ్వాసను బంధించి
గొంతునొక్కేసినా...తన పిల్లన గ్రోవి పిలుపులతో
జోల పాడాలనే తాపత్రయపడుతుంది -  
కోయిల వినిపించే  కమ్మని పాటలకు
నెమలి ఆడే  చక్కని నాట్యాలకు 
చిలుకమ్మ పిలిచే మధురమైన  పిలుపులకు
దూరం చేసినా....
అందరి సంతోషాన్నే కోరుకుంటుంది 

కానీ.... మేఘాలు గర్జించి, 
ఆకాశం శోక భరితయై
నాగరికతను ముంచెత్తుతుంటే...
సముద్రాలు ఆక్రోశించి,
ఉవ్వెత్తున ఎగసి పడుతూ   
నగరాలను తుడిచేస్తుంటే..
కాళ్లూ చేతులూ తెగిన అడవి
నిస్సహాయురాలై చూస్తూ ఏడుస్తుంది..
రాల్చడానికి ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా మిగలక
నిశ్చేష్టురాలై నిలబడుతుంది! 

25 February 2013

భారత దేశం











సాంకేతిక జ్ఞానం
ఆకాశం వైపుకు -
మానవతా దృక్పథం
పాతాళం లోతుకు!    

స్వయం ప్రక్షాళణ




జీవితం  వేళ్ళాడుతుంది..
గోడమీద హేంగరుకు తగిలించిన
మాసిన చొక్కాలా -
రోజంతా దేశ ద్రిమ్మరిలా తిరిగి
పలు దృశ్యాల సమాహారాన్ని
జాగ్రత్తగా జేబులో పేర్చుకొని
ఏ అర్ధరాత్రికో అపరాత్రికో 
మెల్లగా ఇల్లు చేరుకుంటుంది -

దాని అసలు రంగు ఎలా ఉండేదో 
అస్సలు గుర్తుకు రావడం లేదు
ఎండకు ఎండి వానకు తడిసి 
చివికి చిరగడానికి సిద్ధంగా ఉంది -

చెమట వాసన...
ఉతికి ఎన్నాళ్లైందో..?
ఉతకడానికసలు సమయం  దొరికితేగా?
ఏరోజుకారోజు రేపటికి వాయిదా వేసుకుంటూ
తనని తానే తిట్టుకుంటూ
అలా వేళ్లాడ్డానికి అలవాటు పడిపోయింది జీవితం..
ప్రతి రాత్రీ దానికి ఉరేసినా చావదు సరికదా..  
మళ్ళీ పొద్దున్నే తయారై పోతుంది
సిగ్గులేకుండా బయట పడ్డానికి..
అదే చెమట వాసనతో..కుళ్ళు కంపుతో -

ఏదో ఒక రోజు దాన్ని ఉతికెయ్యాలి..
చిరిగి పీలికలైనా పరవాలేదు -
దానికి పట్టిన కుళ్ళు వాసన పోతే చాలు..
దాని అసలు వన్నె తిరిగి కనపడితే చాలు!   

24 February 2013

తప్పటడుగులు


రాసే అక్షరాల్లో దోషముంటే 
చెరిపేసి తిరిగి రాసుకుంటాం -
మాట్లాడే మాటల్లో తప్పు దొర్లితే 
క్షమించమని అడుగుతాం -
పాడే పాటలో అపశృతి పలికితే 
సరిచేసుకుంటాం -
జీవితంలో పొరపాట్లు జరగడం సహజమే..
వాటిని  సరిదిద్దుకోవడం ప్రతిసారీ  సాధ్యం కాదు
అలాంటి పొరపాట్లు 
పునరావృతం కాకుండా చూసుకోవడమే
మనం చేయగలిగింది!    

అరాచకత్వం














"ఒకే కులం 
ఒకే మతం
అందరు ఒకటే" 
అన్న సూత్రానికి
వక్ర భాష్యం చెప్పి..
ప్రపంచమంతా  మా కులమే ఉండాలి..
మా మతమే వర్ధిల్లాలి..
మిగతా అందర్నీ తుదముట్టిస్తాం..
అనే వాళ్ళది ఏ మతం?
అమానుషత్వం, క్రూరత్వం తప్ప! 

23 February 2013

దుఃఖ సాగరం




ఎప్పుడూ బిజీగా ఉండే
దిల్ షుక్ నగరం -
ఇప్పుడు మౌనంగా రోదిస్తూ... 
వేధించే గాయాలను వెతుక్కుంటున్న
దుఃఖభరిత సాగరం !

రొటీన్




వాడిది పక్కా ప్లానింగ్
తన టార్గెట్ ని జాగ్రత్తగా ఎంచుకుంటాడు
నెలలముందే రెక్కీ చేస్తాడు
పరిస్థితులు అనుకూలంగా మలచుకుంటాడు
సరైన సమయం చూసి దెబ్బతీస్తాడు
సంక్షోభం సృష్టిస్తాడు
అనుకున్నది సాధిస్తాడు -

మనం వెంటనే సమావేశమై
సమీక్షలు జరిపి
బాధితులకు సానుభూతి తెలిపి 
ఘాతుక చర్యను ఖండించి
మౌనంగా..ధైర్యంగా..సంఘటితంగా 
వాడి దాడిని తిప్పికొడతాం - 

ఆ తర్వాత...
మళ్ళీ వాడి ప్లాన్లో వాడుంటాడు
మన పనుల్లో మనం నిమగ్నమౌతాం!   

22 February 2013

ఉగ్రవాది



వాడికదో ఆట -
తన ధూర్త జ్ఞానాన్నంతా కూడగట్టి
మృత్యు శకటాలు తయారుచేస్తాడు
ప్రశాంతంగా సాగిపోయే
జనసందోహంలోకి ఆ శకటాలను వదిలేస్తాడు
అక్కడ అవి చేసే మారణహోమం చూసి
పండుగ చేసుకుంటాడు
ఎగిరే మాంసం ముద్దలు వాడి ఆకలి తీరుస్తాయి..
కురిసే నెత్తురు వాన వాడి దాహం తీరుస్తుంది..
క్షతగాత్రుల ఆర్తనాదం వాడి చెవులకు సంగీతంలా వినిపిస్తుంది..
ఆ రాత్రి వాడికి హాయిగా నిద్ర పడుతుంది 
పొద్దున్నే లేచి మళ్ళీ వేటకు సన్నాహాలు మొదలుపెడతాడు
రక్తం మరిగిన పులిలా -
వాడికి కులం లేదు..మతం లేదు
నీతీ లేదు..జాతీ లేదు 
రాక్షస తత్వం తప్ప -
అదనుచూసి పంజా విసరడమే వాడు నేర్చుకున్న విద్య
అమాయకులను బలివ్వడమే వాడి దినచర్య 
వాడొక ఉన్మాది... 
వాడొక ఉగ్రవాది !!    

20 February 2013

ఇక్కడ శవాలు కొనబడును


నువ్వు బతికున్నంత కాలం
నువ్వెంత అర్ధించినా
నీకెవ్వడూ పైసా ఇవ్వడు -
నువ్వు చచ్చిపో...
నీ శవానికి వెంటనే
ఓ వెల కడతారు! 

19 February 2013

జీవన యానం

ఆకాశం ఒక్కసారిగా
ఫెళ్లున విరిగి మీద పడింది -
సముద్రం అమాంతం  ఉప్పొంగి 
సునామీలా ఒక్క ఉదుటున తాకింది -
నిలబడ్డచోటే నేల చీలిపోయి
పాతాళానికి తోసేసింది -
భయంకరమైన శబ్దం చేస్తూ
సుడిగాలి రివ్వున చుట్టేసింది -
రెప్పపాటులో అగ్నిపర్వతం బద్దలై
ఎర్రని లావాతో ముంచెత్తింది -
ఇదంతా నిజమా..కలా..?
కలకాదు..నిజమే...
ఈ భయంకరమైన విపత్తులో
చిక్కుకున్నది వాస్తవమే..
ఈ చెఱలోనుండి తప్పించుకోవడం సాధ్యమేనా?
ఎలా బయటపడ్డం?
నీ ఇనుప కండరాలను బిగించు..
నీ ఉక్కు నరాలను సంధించు.. 
నీ మనోధైర్యం ముందు ఏ శక్తి నిలబడగలదు?
నీ దృఢసంకల్పంతో ఏ మహత్తు తలపడగలదు? 
నీలో దాగున్న శక్తికి నీ ఆత్మవిశ్వాసం తోడైతే
ఈ లోకమే అనదా నీకు దాసోహం..!
నీ జీవితమే కాదా ఒక అద్భుత పయనం..!! 

ఆసుపత్రికి జబ్బు చేసింది







ఆసుపత్రికి జబ్బు చేసింది
వెంటనే ఓ మంచి డాక్టర్ని పిలవండి - 
బయట పరిసరాలకు గేంగ్రీన్..
లోపల పరికరాలకు కేన్సర్..
మింగడానికి మందులెటూ లేవ్
తాగడానికి నీళ్లు కూడా కరువే -
నీది పెద్ద జబ్బు..వెంటనే పెద్దాసుపత్రికి పో అంటారు
లెన్స్ బెట్టి వెతికినా అంబులెన్స్ కనబడదు
ఇక పెద్దాసుపత్రికి పోయేది పోస్ట్ మార్టానికే..
గుళ్ళో దేవుడు నయం రోజూ దర్శనమిస్తాడు  
డాక్టర్ బాబును చూడాలంటే మాత్రం 
ఎన్ని నరకాలు దాటాలో...
నీ అదృష్టం బాగుండి
డాక్టర్  సాబ్ కనిపించి
జబ్బు ముదిరిందని
ఆపరేషన్ టేబులెక్కించినా  
దానిమీద పడుకుంటే
ముందుగా పోయేది కరెంటో...నీ ప్రాణమో..
చెప్పడం చాలా కష్టం -
వేల కోట్ల బడ్జెట్టున్నా ఆసుపత్రికి నయంకాదు..
వందలకొద్దీ డాక్టర్లున్నా దవాఖానాకు దారి తెలీదు..
మనకు రోగమొస్తే ఆసుపత్రికి పోతాం
ఆసుపత్రికే జబ్బు చేస్తే ఇంకెక్కడికెళ్తాం?
వల్లకాటికి తప్ప...!!!    

18 February 2013

అడవి మేల్కొంది






పచ్చటి చీర కప్పుకున్న అడవి
వెచ్చటి రెక్కల కింద
తన బిడ్డల్ని దాచుకు పడుకుంది
హాయిగా ఆదమరిచి నిద్రిస్తున్న అడవిని
ఆకాశం నుండి దూసుకొచ్చిన
రక్కసి డేగలు చిందర వందర చేశాయి
పారే ఏటిని తాగేశాయి
తూగే గూటిని తెంచేశాయి
పచ్చని చెట్టుని కూల్చేశాయి
అడవి మేల్కొంది
ఆక్రోశించింది..ఆవేదన చెందింది..
ఆవేశంతో ఆ రక్కసి డేగల కుత్తుకల్ని విరిచింది 
అందుకే ఆ అడవిప్పుడు
నెత్తురు తాగిన అమ్మోరిలా 
ఎర్రని నిప్పులు కక్కుతుంది!    


17 February 2013

జీవిత ఖైదు







నీటమునిగిన వరి 
నేలకొరిగిన మొక్కజొన్న
రాలిన మామిడి పిందెలు
తడిసిన పసుపు 
తేలిన మిరప -
అకాల వర్షం
తీరని నష్టం -
పంటను ముంచే వడగండ్లు
రైతుల పాలిట కడగండ్లు
ఏనాటికి కోలుకుంటాడో ఈ రైతు?
ఎప్పటికి తీరుతుందో ఈ జీవిత ఖైదు??

ప్రేమ










అమ్మాయిల్ని పడేయాలని
చేసేది కాదు నిజమైన ప్రేమ!
ఆజన్మాంతం ఒకరినొకరితో
ముడివేసేదే అసలైన ప్రేమ!!

జీవితం









నిన్నొక స్వప్నం
నేడొక సమరం
రేపొక  ఆశలతీరం!

16 February 2013

పరిశోధన





నాలా నేను ఉందామనుకున్నా - 
ఎలాగోలా... 
సాధ్య పడలా...
సాధించే తీరాలనుకున్నా -
అసాధ్యుడిలా..
ఏమీ బోధపడలా...
ఎవడో ఒకడు 
అడ్డుపడుతూనేఉన్నాడు సైంధవుడిలా..
అయినా ప్రయత్నిస్తూనే ఉన్నా
ఒక పరిశోకుడిలా!

నాలో నేను





నేను నేనుగా నాలో నేను
నాలోలేని నేను
నేనుకాని నేను
నేను కావాలనుకునే నేను
నేనే నేను
నేనులేని నేను
నీకు కనిపించే నేను
నేను కాని నేను
నాలో లేను!

అగ్ని పథం








పచ్చని ఆకులు పరచిన 
సుతిమెత్తని మార్గం నాకెందుకు?
భగభగ మండే రుధిరజ్వాలల
అగ్నిపథం నన్నాహ్వానిస్తుంటే!!