18 March 2013

పాపాత్ములు


చిక్కని ద్రవ్యాన్ని సైతం వాయువుగా మార్చే అగ్నికీలలు.. 
ప్రకృతి ధరించిన పచ్చని చీర పండి ఎండుటాకులా మారే రోజులు...
ఎంతకాలమని చేతులడ్డుపెట్టి నీడనివ్వగలం..?  
నీటిచుక్క నేలను తాకకముందే అదృశ్యమౌతుంటే,
భూగర్భ జలాలు రేసుగుర్రంలా అడుగంటి పోతూఉంటే...  
దాహం దాహమంటూ ఒక్కొక్క పొదా నిర్వీర్యమౌతుంటే...
ఎన్నాళ్లు మనగలదీపూదోట...? 

చక్కని చల్లని పూలరెమ్మల మధ్య తిరిగిన రోజులెలా మరచిపోగలం? 
ఆ పూపందిళ్ళ ఛాయన నిదురించిన సమయమెలా విస్మరించగలం?
ఈ ఎండిన మొదళ్ళు మళ్లీ చిగురించే రోజులు వచ్చేనా?
ఈ రగిలే ఎదలను చప్పున చల్లార్చే జల్లులు కురిసేనా? 

ఫెళ ఫెళమని గర్జించే ఉరుములు -
తళ తళమని మెరిసే మెరుపులు -
ఒక్క నీటి చుక్కనైనా రాల్చక చతికిలబడితే..
భూమాత దప్పిక తీరేదెపుడు?
నిర్జీవమైన వృక్షజాలం మొగ్గలు తొడిగేదెపుడు?

గగనాన్నుండి దూసుకువచ్చే ఉల్కలు నేలను తాకితే 
ఉన్న ప్రాణం పోయి లేని ప్రాణం పుట్టుకొసుందని నమ్మే వెర్రి పావులం - 
ఉల్కాపాతానికై ఎదురుచూసే ఆశాజీవులం - 
పంచప్రాణాలూ కంటిపాపలో నింపుకొని
శ్వాస నిశ్వాసల వత్తులతో కన్నీటిదీపాలు వెలిగించి
విశ్వమంతా ఆవరించిన అంధకారాన్ని వంటిచేత్తో పారదోలడానికి
ప్రయత్నించే పాపాత్ములం!  

17 March 2013

అణచివేత

హృదయవిదారకంగా పేలిన తుపాకి శబ్దం - 
పక్షి గుంపొకటి ఎగిరిపోయింది...

విసురుగా తీరంతాకిన అలల తాకిడి -  
ఇసుక గూడొకటి  కరిగిపోయింది...

కర్కశంగా హూంకరించిన గద్దింపు -   
పసి హృదయమొకటి మూగబోయింది...

రాక్షస గుండెలు వేసిన గొడ్డలి వేటు -  
పచ్చని చెట్టొకటి కూలిపోయింది...

కామాంధులు సలిపిన ఘోర కలి - 
అమాయక ప్రాణొకటి బలైపోయింది...

మతోన్మాదులు  జరిపిన విధ్వంస కాండ -  
ప్రశాంతమైన ఊరొకటి చెదిరిపోయింది...

పాశవికతదే పైచేయి...
అమాయకత్వమింకా అణచివేయబడుతూనేవుంది! 

05 March 2013

అంతరం


మనిషినుండి మనిషిని దూరంచేసేదేమిటి?
కులం? మతం? ప్రాంతం? 
లేక..భాష? వేషం? అహం? అభిప్రాయ భేదం?

నాకైతే ఎప్పుడూ కనిపించేది ఒక్కటే -  

మంచికీ చెడుకూ మధ్య
నలుగుతున్న ఒక సన్నటి పొర.. 
చీకటికీ వెలుతురుకూ నడుమ 
తారాడుతున్న ఒక పలుచని తెర..
మానవత్వాన్నీ అమానుషత్వాన్నీ  
వేరుచేస్తున్న ఒక పెళుసైన చాఱ..   
మిత్రత్వాన్నీ శతృత్వాన్నీ 
విడదీస్తున్న ఒక అస్పష్ట ధార - 

కావాలనుకుంటే ఆంతా మనదే..
కాదనుకుంటే అందరూ పరాయివాళ్లే..  

అంతరం - 

ఒక చిన్న ఆలోచన..
ఒక చిన్న అవగాహన..

ఇంకా..
కొద్దిగా స్నేహం..
కొద్దిగా త్యాగం -
కొంచెం ఇష్టత.. 
మరికొంచెం స్పష్టత!  

03 March 2013

ఒక ఆలోచన


గీసే ప్రతిదీ బొమ్మ కాదు - 
రాసే ప్రతిదీ కవిత కాదు -
చెప్పే ప్రతిదీ కథ కాదు -
పాడే ప్రతిదీ పాట కాదు - 

అప్పుడప్పుడూ...ఒక నిగూఢమైన ఆలోచన...

గుండె అట్టడుగుపొరలను చీల్చుకొని
మనసు ఇనుప తెరలను ఛేదించుకొని
హృదయ కుహరంలోంచి వెలికి చొచ్చుకొని
ప్రసవించీ, ప్రభవించీ, ప్రసరించీ..
ఓ కాన్వాసుమీద ప్రతిఫలిస్తుంది..
ఓ కాగితమ్మీద అక్షర రూపం దాలుస్తుంది..
ఓ పలుకులో పులకరిస్తుంది..
ఓ గొంతులో తాండవిస్తుంది..
లలితమై, రజితమై, జ్వలితమై 
పంచభూతాల్లో మిళితమై
తాథాత్మ్యం చెందుతుంది!

01 March 2013

అవశేషాలు


అక్కడ ఇంకా ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం -
ఆగి ఆగి చెవులను తాకుతున్న రోదన
గుండెని పిండేస్తూ...
మెదడును తొలిచేస్తూ...

ఆ ఏడుపు నేపథ్యంలో..
ఎక్కడో..దూరంగా...
కొన్ని మనసులు చేస్తున్న సంతోషపు సందడి
కొన్ని హృదయాలు పెనవేసుకుంటున్న దృశ్య సవ్వడి 
నవ్వులూ..కేరింతలూ..
శ్రావ్యంగా వినిపిస్తున్న జీవనాలాపన -
     
అంతలోనే ఏవో రాక్షస మూకలు 
భీకరంగా అరుస్తూ చేస్తున్న వికటాట్టహాసాలు..
తెగుతున్న తలల హాహాకారాలు..
నేలకొరుగుతున్న శవాల  నిట్టూర్పులు..

అటువైపు నడచినప్పుడల్లా 
లీలగా వినిపించే ఆ శోక గీతాలు..
జాలిగా ప్రవహించే ఆ ఆర్తనాదాలు..
ఏ అనాగరిక చేష్టల చిహ్నాలో..?
ఏ అకృత్య చర్యల అవశేషాలో..??