27 November 2013

ఉటోపియా

ఇది ప్రపంచంలోనే  
అతి పెద్ద ప్రజాస్వామ్యం - 
ఇక్కడ ప్రజలకోసం,
ప్రజలచేత ఎన్నుకోబడే
ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయ్ - 
ఇక్కడ ప్రజలే స్వాములు..
పాలకులు ప్రజలకు దాసులు..
అనుక్షణం ప్రజా ప్రయోజనాలకోసం
అందరూ పాటుపడుతూ ఉంటారు..
ఇక్కడ కరువు కాటకాలొస్తే 
తక్షణమే ఆదుకుంటారు 
ప్రతియేటా లక్షల ఉద్యోగాలు,
నిరుద్యోగులకు భృతులు,
వయో వృద్ధులకు పింఛన్లు, 
ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు...
ఇక్కడ రైతే రాజు
ఆత్మహత్యలంటే ఏంటో ఎరగడు...
ఇక్కడ స్త్రీలను పూజిస్తారు,
మగవాళ్లతో సమానంగా చూస్తారు -
ఇక్కడ రాజకీయాలు కులమతాలకతీతం
ఇక్కడ జన్మించడం పూర్వ జన్మ సుకృతం
ఇక్కడ చావడం ప్రతి ఒక్కడి జీవితాశయం! 

స్వేచ్ఛా గీతం

పురి విప్పిన నెమలినై 
శివమెత్తిన కడలినై   
గగనాన్ని తాకాలనుకునే నన్ను   
ఆంక్షల వలయంలో బంధిస్తానంటే ఎలా?

ఈ అడవిలో....
స్వేచ్చగా విహరించాలనుకోవడం తప్పా?
ఈ నేల నాది,
ఈ గాలి నాది... 
ఈ చెట్లు, ఈ పక్షులు-
నా నేస్తాలు.. 
ఇక్కడ తిరుగాడే వన్యమృగాలు-
నా చెలికాళ్ళు..

నేను పుట్టగానే నన్ను లాలించిన పరిసరాలు...
నా ప్రతి శ్వాసలో, ప్రతి ఆశలో 
నా ప్రతి అడుగులో నా వెంటే ఉంటూ
నన్ను నడిపించిన పంచభూతాలు...
వాటినుండి ఈరోజు నన్ను వేరుచేస్తానంటే
నేను ఆక్షేపించడం నేరమా?

చావైనా బ్రతుకైనా  అడవిలోనే-  
ఎప్పటికైనా నా అంతిమ శ్వాస..
నా అడవి సాక్షిగా,  
ఈ పంచభూతాల్లో కలసిపోవాల్సిందే..

నా మాటకు తిరుగులేదు!
నా బాటకు అడ్డులేదు!!
నా పాటకు చావులేదు !!!

23 November 2013

ఊరు మారింది

ఇక్కడ నవనవలాడే పచ్చని వనమొకటుండేది..
అది ఎడారిగా ఎప్పుడు మారింది?

ఇక్కడ తళ తళ మెరిసే సరసొకటుండాలి.. 
అది మురికికూపంలా ఎలా మిగిలింది?  

ఇక్కడ ఆకాశాన్నంటే పర్వతమొకటి చూశానే..
అదెలా కనుమరుగై పోయింది?  

ఇక్కడ సువాసనలతో నిండిన గాలి వీస్తుండేది..
ఇప్పుడీ దుర్గంధమెలా వస్తుంది?  

ఇక్కడ కమ్మని కోయిల పాటలు వినబడుతుండేవి..
ఏదీ ఇప్పుడొక పిట్టకూతైనా చెవినపడదేం? 

ఇక్కడ అప్యాయతలొలికే పరామర్శలుండేవి.. 
ఇప్పుడు పలకరించే మనిషే కనిపించడేం?

ఇక్కడ కళకళలాడుతూ ఒక ఊరుండేది - 
అది జీవంలేని నగరంలా ఎప్పుడు మారింది??   

వేదనా భరితం

అక్కడ ఎర్రని మంటల్లో
ఒకడు కాలి బూడిదౌతున్నాడు.. 

ఇక్కడ ఆకలి ఆక్రందనల్లో

ఒకడు కరిగి కన్నీరౌతున్నాడు..  

అక్కడ కొందరు చిత్తుగా తాగి

మత్తులో మునిగితేలుతున్నారు.. 

ఇక్కడ కొందరు గమ్మత్తుగా చేరి 

చలోక్తులు విసురుతున్నారు..

ఓ వయసుమళ్లిన స్త్రీ 

ప్రసవ వేదన పడుతోంది..

ఓ పసికూన సూర్యోదయానికై 

ఓపిగ్గా ఎదురుచూస్తోంది.. 

కాలం బాధగా మూలుగుతోంది!

చట్టం తనపని తాను చేసుకుపోతోంది!!