జీవితంలో
అద్భుతాలు జరగడమంటే
మరేదో కాదు-
బ్రతుకు సేద్యం చేస్తూ,
మనుగడ మంత్రం పఠిస్తూ,
అనుభూతుల పంటలు పండించుకునే
గొప్ప మనసున్న మనుషుల్ని కలవడమే...
మంచితనానికి అద్దంపడుతూ,
మనిషితత్వానికి భాష్యం పలుకుతూ,
మానవత్వానికి అర్థం తెలిపే
మనోహర దృశ్యాలను వీక్షించడమే...
మరల మరలా జ్ఞప్తికి వస్తూ,
మార్గదర్శనం చేసి ముందుకు నడిపిస్తూ,
తుదిదాకా తోడుండే
అనుభవాలను మూటకట్టుకోవడమే...
నాలుగు దిక్కులా పయనిస్తూ,
నలుగురితో సావాసం చేస్తూ,
మరువలేని క్షణాలను కొన్నింటిని
మనసునిండా ఒంపుకోవడమే...
కష్టాల కడలిని దాటుకుంటూ,
కన్నీటి నదులను ఈదుకుంటూ,
కలతల అడవులను జయించుకుంటూ,
ప్రకృతి ఒడిలో ఓదార్పు పొందుతూ,
పంచభూతాల పంచన సేదతీరుతూ,
పరవశిస్తూ... పరిమళిస్తూ...
పరిపక్వత చెందుతూ...
అడుగడుగునా ఉనికిని చాటుకుంటూ,
అనంత గమ్యాలను వెతుక్కుంటూ,
అలుపెరుగని ప్రయాణంలో
ముందుకు సాగిపోవడమే...