మా ఊర్ని ఎవరో
నిరాశ, నిస్పృహల్లో
ముంచేసి వెళ్లారు --
ఎక్కడ చూసినా
ముఖానికి భయాన్ని కప్పుకు తిరిగే వాళ్లే..
ఆప్యాయతల దారులన్నీ
బ్రహ్మజెముడు ముళ్ల కంచెతో
పొలిమేర్లలోనే కప్పేశారు..
అనురాగపు కిటికీలన్నీ
అనుమానపు ఇనుప తెరలతో
మొహమాటంలేకుండా మూసేశారు..
ముడుచుకుపోయిన ఊరు
తన చుట్టూ శూన్యంతో గోడలు కట్టుకుంది..
మాటలన్నీ మౌనలిపిని రచించుకొని
మూగవై పోయాయి..
పరామర్శలు..పరదాల మాటున దాక్కొని
పరిహాసం చేస్తున్నాయి..
వీధులన్నింటినీ స్మశాన వైరాగ్యం
పహారా కాస్తుంది..
చీకటి ముసుగు తొడుక్కున్న చూపులు
సంకెళ్ళు కరిగించే సూర్యుడి కోసం
ఎదురు చూస్తున్నాయి.