28 June 2020

అంతరం

మనసు రెప్పలు మూసుకోగానే
ఊహల రెక్కలు విచ్చుకుంటాయి, 
ఆలోచనకు అందనంత ఎత్తుకు ఎగిరి
కోర్కెల  విహంగాలై  విహరిస్తుంటాయి --

స్వప్నానికీ  వాస్తవానికీ  మధ్య
సాగే ఊగిసలాటే  జీవితం --

ఆకాశం జుట్టు పట్టుకున్నామనుకుంటాం,
దిక్కుల అంచులకు విస్తరించామనుకుంటాం,
తీరా చూస్తే...
పాతాళం పాదాల దగ్గర చతికిలపడి ఉంటాం --

మనకు కావలసిందేదో మనం
ఒడిసి పట్టుకున్నామనుకుంటాం..
మనకదెప్పటికీ దూరం కాదనుకుంటాం..
కానీ... మన వేళ్ల సందుల్లోంచి
అదెప్పుడు జారిపోతుందో కనిపెట్టలేం --

స్వప్నంలో ఉదయించీ, 
అందులోనే ఆస్తమిస్తే
జీవితం ఎంత బాగుంటుంది..
పట్టపగలే రాత్రిని  సృష్టించుకునీ, 
స్వాప్నిక లోకంలో తేలిపోతుంటే
ఎంత హాయిగా ఉంటుంది..
కానీ... 'నిజా'నికి స్వప్నించే  తీరికా లేదు,
స్వప్నానికి నిజం కావాలనే  కోరికా  ఉండదు --

మత్తులో మునిగిన  కలలను తట్టిలేపి
నిజ ప్రపంచంలోకి నడిపించడం కూడా
ఒక కళే --
కల్పనకు, నిజానికి మధ్య
సంధి జరగాలన్నా, 
ఆ రెండింటికీ నడుమ
భేదం లేకుండా చేయాలన్నా,
అది మనిషికే సాధ్యం..
అది అత్యంత సాహసంతో సాగించాల్సిన ఉద్యమం... 

21 June 2020

విముక్తి

బొడ్డు తాడు కోసి
తల్లి నుండి బిడ్డను
విడదీసినంత సులువు కాదు,
మాతృభూమితో మమేకమైన 
మమతల్ని  వేరు చేయడం --

రాజ్యకాంక్ష,
మత వివక్ష,
వర్గ విభేదం,
సరిహద్దు వివాదం --
కారణం ఏదైతేనేం?
ఒక చిరు హృదయం
ఛిద్రం  కావడానికి...
ఒక ఆశల పల్లకీ 
తల్లకిందులవడానికి...
ఒక అందమైన బంధం
అంతమై పోవడానికి...
ఒక నందనవనం
వేర్లతో సహా ఒరిగిపోవడానికి...
ఒక ఊహల సౌధం
అగ్నిలో ఆహుతవ్వడానికి --

స్పర్శించే గాలీ,
స్పృశించే నేలా, 
పలకరించే పైరూ,
పరవశించే ఏరూ --
అన్నీ దూరమై,
శ్వాసే భారమై,
చెల్లా చెదురై...
శరణార్థులై...
పరాయి నేలపై
విషాద జీవితం వెళ్లదీస్తున్న
శాపగ్రస్థులకు
విముక్తి ఎపుడో? 
విడుదల ఎన్నడో??

01 June 2020

నైట్ డ్యూటీ


రాత్రి బాగా చిక్కబడ్డ  తర్వాత
నా అంతరాత్మ నాకుచెప్పకుండానే
హుటాహుటిన వేటకు బయలు దేరుతుంది,
సంకలో సంచీ వొకటి తగిలించుకొని --

ఆకాశం నుండి రాలిపడ్డ నక్షత్రాలు కొన్నీ...
వాస్తవాల నుండి వేరుపడ్డ ఆవేశాలు కొన్నీ...
జీవితంలో దగాపడ్డ ఆశయాలు కొన్నీ...
నమ్మిన చేతుల్లోనే భంగపడ్డ ఆశలు కొన్నీ..
కొండెక్కిన కోర్కెలు కొన్నీ, 
మండుతున్న కడుపులు  కొన్నీ  --
అన్నీ...సంచీ నిండా నింపుకొని
బిరబిరా తిరిగొచ్చి
నా ముందర గిరాటేస్తుంది.
వాటన్నింటినీ చేర్చి,
ఒకచోట పేర్చి,
అందమైన హారంలా కూర్చమంటుంది...
కుదరదంటే... కూడదంటూ
నా నెత్తిన కూర్చుంటుంది...
ఇక రాత్రంతా నాకు జాగారమే...
నరాలన్నీ  సవరించీ... 
మెదడును మధించీ...
ఆలోచనలను రగిలించీ..
నీలిగీ, నిట్టూర్చీ,  ఆవలిస్తుండగా...
వెలుతురు తెచ్చిన వేడిమికి
చీకటి ఆవిరౌతూ...
భళ్లున  తెల్లవారుతుంది,
నా ప్రయత్నం అర్ధాంతరంగా ముగుస్తుంది --
చీకటి మళ్ళీ చిక్కబడేవరకూ...
నా అంతరాత్మకు విశ్రాంతి!
నాకు శాంతి!!

అడుగుల గొడవ


అప్పుడప్పుడు...
గతంలో నేనొదిలేసిన
నా పాదముద్రలు
నన్ను పలకరిస్తుంటాయి...
గాఢనిద్రలో ఉన్న నా తలపులను
తట్టి లేపుతుంటాయి...
నాతో వాగ్వివాదానికి దిగుతుంటాయి --
మేము అప్పుడే చెప్పాం, 
నువ్వు వినలేదంటూ
నన్ను  నిలదీస్తుంటాయి...
అప్పుడు పరికించి చూస్తాను
అవును.. నిజమే...
కొన్ని  పాదముద్రలు సవ్యంగా,  కొన్ని అపసవ్యంగా...
కొన్ని స్పష్టంగా, కొన్ని అస్పష్టంగా....
కొన్ని తడబడి నట్టుగా...
కొన్ని అడుగులయితే వడివడిగా వేసినట్టుగా....
కొన్ని అయిష్టంగా,  కొన్ని భయంగా....
కొన్ని కోపంగా,  కొన్ని అనాలోచితంగా.....
ఒక్కో అడుగూ...ఒక్కో తీరుగా --

అయితే ఇప్పుడేం చేయాలి? 
మీరంతా నా గతం,
మిమ్మల్ని ఎప్పుడో  మర్చిపోయాను...
మళ్లీ నన్ను కలవద్దని  కోపంగా చెప్తాను --

కానీ అవి వింటేగా??
నా ప్రమేయం లేకుండా
నన్ను వెంటాడుతూనే ఉంటాయి!
ఏదో  సమయంలో ప్రత్యక్షమై
నన్ను నిలదీస్తూనే ఉంటాయి!!

04 May 2020

పునర్జన్మ


నీ తలపుల తలుపులకవతల
దేనికోసమో వెతకాల్సిన సమయం కాదిది..
ఇది --
నీలోకి నువ్వు
ప్రవేశించాల్సిన సమయం..
నిన్ను నీకు
ఆవిష్కరించుకోవలసిన సమయం..
నీతో నువ్వు
సంగమించుకోవలసిన సమయం..
గతించిన జ్ఞాపకాల జాడలలో
లీలగా కదలాడుతున్న నీడలకు,
అస్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం..
చెద పట్టిన జీవిత పుటలను,
మెళుకువతో  దులుపుకోవలసిన సమయం..
పాషాణపు  పాదాల అడుగున పడి
నిర్దయగా నలిగిన విలువలను,
నింపాదిగా ఏరుకోవలసిన సమయం..
చారిత్రక శిధిలాల నడుమ
ఛిద్రమైన మానవ సంబంధాలకు,
తిరిగి ఊపిరి పోయాల్సిన సమయం..
మకిలిపట్టి మలినమైన జీవితానికి ముగింపు పలికి,
మళ్లీ మనిషిగా జన్మించాల్సిన సమయం.

21 April 2020

ఎదురుచూపు


మా ఊర్ని ఎవరో
నిరాశ, నిస్పృహల్లో
ముంచేసి వెళ్లారు --
ఎక్కడ చూసినా
ముఖానికి భయాన్ని కప్పుకు  తిరిగే వాళ్లే..
ఆప్యాయతల దారులన్నీ
బ్రహ్మజెముడు ముళ్ల  కంచెతో
పొలిమేర్లలోనే కప్పేశారు..
అనురాగపు కిటికీలన్నీ
అనుమానపు ఇనుప తెరలతో         
మొహమాటంలేకుండా మూసేశారు..
ముడుచుకుపోయిన ఊరు
తన చుట్టూ శూన్యంతో గోడలు కట్టుకుంది..
మాటలన్నీ మౌనలిపిని రచించుకొని
మూగవై పోయాయి..
పరామర్శలు..పరదాల మాటున దాక్కొని
పరిహాసం చేస్తున్నాయి..
వీధులన్నింటినీ స్మశాన వైరాగ్యం
పహారా కాస్తుంది..
చీకటి ముసుగు తొడుక్కున్న చూపులు
సంకెళ్ళు కరిగించే సూర్యుడి కోసం
ఎదురు చూస్తున్నాయి.

27 March 2020

కొరోనా కోరల్లో


కొరోనా మహమ్మారి
రక్కసి కోరల్లో
చిక్కుకుంది మానవాళి.

ఎటు చూసినా విషవలయం..
అంతుచిక్కని గరళ ప్రళయం..
పీల్చే గాలీ -
తాగే నీరూ -
నిల్చున్న నేలా -
అన్నీ కలుషితం...
అంతా ధూషితం...
దుర్గంధ భూషితం.

ప్రపంచీకరణ ప్రక్రియలో
పొంచిఉన్న పెనుప్రమాదాలు..
ఊహాతీత పరిణామాలు...

అహోరాత్రులు శ్రమించీ
స్థూల ఉత్పత్తులు  పెంచాం,
ఆర్ధిక వ్యవస్థను విస్తరించాం...
సాంకేతికతతో రమించీ
అంతరిక్షాన్ని ఆక్రమించాం,
ప్రకృతిని శాసించాం...
పదేపదే ప్రకటితమౌతున్న
ప్రమాద సంకేతాలనుమరిచాం
పర్యావరణ పరిరక్షణను విస్మరించాం.

వ్యాపార కక్షలో...
కోపించిన కుక్షులో...
కారణం ఏదైనా
అంటువ్యాధుల కక్ష్యలో
నిర్దాక్షిణ్యంగా నలుగుతున్నాం,
సూక్ష్మజీవుల దాడిలో
రక్షణ కరువై మూలుగుతున్నాం.

చప్పట్లతో సమసిపోయేవి కావు ఈ ఇక్కట్లు,
ఎప్పటికి తెలుసుకుంటాడో మనిషి
తను చేస్తున్న  పొరపాట్లు.
SARS నుండి తప్పించుకోవడానికి
MARSకైనా పారిపోతాడేమో గాని
తన తీరును మార్చుకోడీమనిషి.

ఎలా తీరేనో ఈ అగచాట్లు
ఎప్పుడు మారేనో మన అలవాట్లు
ఏనాటికి కరిగేనో  కమ్ముకున్న ఈ చీకట్లు.