11 June 2013

ఆశ

వసంతం వెళ్లిపోయినా
ఒక కోయిల ఇంకా పాడుతూనే వుంది..

సూర్యుడస్తమించినా
ఒక కాంతి రేఖ ఇంకా మేలుకొనే వుంది..

ఆలయం తలుపులుమూసినా
ఒక గొంతు ఇంకా ప్రార్థిస్తూనే వుంది -


చిగురించిన ఆశలు పూలు తొడిగితే చూడాలని
ఆ కోయిల ఆరాటం..

కనుమరుగైన రవి తిరిగిరాకకై 
ఎదురుచూస్తుందా కిరణం..

మూసిన తలుపులు ఛేదించాలని  
తాపత్రయపడుతుందా కంఠం - 


రెపరెపలాడే దీపాన్ని ఆరిపోకుండా  
నిలబెడుతుందొక చిన్న ప్రయత్నం..

చుట్టూ అలముకొన్న అంథకారాన్ని అంతమొందించి
వెలుగులు నింపుతుందొక నమ్మకం..

నిన్నటి అపజయాలపై సమాథి కడుతూ 
రేపటికోసం బాటలు వేసుకుంటుందొక చిన్ని ఆశ!   

4 comments:

  1. ఆశని ఆరనివ్వక రేపటికై ఎదురుచూసే నిరాశ లేని "చిన్ని ఆశ".
    సున్నిత భావం, మరింత సున్నితంగా ఉంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు..చిన్ని ఆశ.. గారు!

      Delete
  2. ఇలాంటి మంచి కవితలు మరిన్ని వ్రాసి అందరినీ అలరిస్తారని ఆశ.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా...ధన్యవాదాలు Padmarpita గారు!

      Delete