27 March 2020

కొరోనా కోరల్లో


కొరోనా మహమ్మారి
రక్కసి కోరల్లో
చిక్కుకుంది మానవాళి.

ఎటు చూసినా విషవలయం..
అంతుచిక్కని గరళ ప్రళయం..
పీల్చే గాలీ -
తాగే నీరూ -
నిల్చున్న నేలా -
అన్నీ కలుషితం...
అంతా ధూషితం...
దుర్గంధ భూషితం.

ప్రపంచీకరణ ప్రక్రియలో
పొంచిఉన్న పెనుప్రమాదాలు..
ఊహాతీత పరిణామాలు...

అహోరాత్రులు శ్రమించీ
స్థూల ఉత్పత్తులు  పెంచాం,
ఆర్ధిక వ్యవస్థను విస్తరించాం...
సాంకేతికతతో రమించీ
అంతరిక్షాన్ని ఆక్రమించాం,
ప్రకృతిని శాసించాం...
పదేపదే ప్రకటితమౌతున్న
ప్రమాద సంకేతాలనుమరిచాం
పర్యావరణ పరిరక్షణను విస్మరించాం.

వ్యాపార కక్షలో...
కోపించిన కుక్షులో...
కారణం ఏదైనా
అంటువ్యాధుల కక్ష్యలో
నిర్దాక్షిణ్యంగా నలుగుతున్నాం,
సూక్ష్మజీవుల దాడిలో
రక్షణ కరువై మూలుగుతున్నాం.

చప్పట్లతో సమసిపోయేవి కావు ఈ ఇక్కట్లు,
ఎప్పటికి తెలుసుకుంటాడో మనిషి
తను చేస్తున్న  పొరపాట్లు.
SARS నుండి తప్పించుకోవడానికి
MARSకైనా పారిపోతాడేమో గాని
తన తీరును మార్చుకోడీమనిషి.

ఎలా తీరేనో ఈ అగచాట్లు
ఎప్పుడు మారేనో మన అలవాట్లు
ఏనాటికి కరిగేనో  కమ్ముకున్న ఈ చీకట్లు.

03 May 2016

ఒక 'ఆత్మ'కథ

ఓ కథ రాద్దామని కూర్చున్నా -
ఎవరి కథ రాయాలి....?
ఎవరి కథో ఎందుకు -
నా కథే రాసుకుంటే పోలా?
గుడ్ ఇడియా.....
నా చిన్నప్పట్నుంచీ జరిగిన విషయాలన్నీ
ఒక్కసారిగా బుర్రలో గిర్రున తిరిగాయ్...
మంచి కథే అవుతుంది -
పెన్నూ పేపరూ తీసుకుందామని చెయ్యి చాపా...
ఆశ్చర్యం -
అరే... చేతికి చిక్కడంలేదు
ఎంతో ప్రయత్నించా...
అయినా వేళ్లకు పట్టుదొరకలేదు

ఎందుకో...???

ఎందుకంటే....
మరి ఆత్మలు రాయలేవుగా!!!

25 April 2016

ఎదురుచూపు


ఈసారైనా
ఆ కోయిల తిరిగి వస్తుందని...
తన మధుర గానాన్ని వినిపిస్తుందని...
ఎంతగానో ఎదురుచూశా
ప్చ్...లేదు, రానేలేదు -
ఎప్పుడూ తను కూర్చునే
ఆ పచ్చని చెట్టు 
వేర్లతొపాటుగా పెకలించబడిందని 
ఆ కోయిలకు తెలిసిపోయిందనుకుంటా...
కానీ -
తను రాకపోతే
ఈ తనువే ఆవిరై...
విశ్వమంతా ఆవరించి 
తనకోసమే కలవరిస్తుందని
బహుశా తనకు తెలియదేమో???

12 April 2016

భక్తి

గుడి మెట్లు
ఎన్ని ఎక్కామన్నది కాదు...
ఎద తలుపులు
ఎన్ని తెరిచామన్నది ముఖ్యం!

20 March 2016

పక్షి గూడు

పక్షికున్న ధైర్యం
మనిషికెక్కడిది...?

ఎక్కడెక్కడ నుండో 
ఏరుకొచ్చిన పుల్లలతో...
చెట్టు చిటారు కొమ్మన, 
అగాథంలోకి  వేళ్ళాడుతున్నట్టుగా 
కట్టిన పక్షి గూడు -  
పక్షి కూనలు పొరపాటున పడిపోతే 
ఏమౌతుందా అని ఆలోచిస్తేనే
ఒళ్ళు జలదరించే
ఆ పక్షి గూటిని చూస్తే
నాకిదే అనిపిస్తుంది - 
పక్షికున్న ధైర్యం  
మనిషికి లేదేమోనని.

11 January 2016

కాల మహిమ

వన్నెలు చిమ్మే సీతాకోక చిలుక
మసకబారి నేలమీద పడిఉంది
నిర్జీవంగా...


రంగులొలికే ఇంద్రధనుస్సు
ఆకాశంలో అలుముకు పోయింది
ఆనవాళ్ళు లేకుండా...

గిర్రున తిరిగే రంగుల రాట్నం
నిశ్శబ్దంగా నేలకొరిగింది
శిథిలమై..ఛిద్రమై...

రోజూ కిటకిటలాడిన గుడి
వెలవెల పోయింది
భక్తుల అలికిడిలేక...

నిత్యం కళకళలాడిన ఇల్లు
పాడుబడిపోయింది
మనిషి జాడలేక...

జీవితమూ అంతే-
వెలుగు జిలుగుల్లో
తళతళ మెరుస్తుంది..
చేయిజారితే నిస్తేజంగా మారుతుంది-

వెలిసిన వర్ణాల్లో వెతికితే
దొరికేది అంధకారమే...
వొలికిన కన్నీళ్లను దోసిటపడితే
మిగిలేది అంతులేని ఆవేదనే!!! 

27 November 2013

ఉటోపియా

ఇది ప్రపంచంలోనే  
అతి పెద్ద ప్రజాస్వామ్యం - 
ఇక్కడ ప్రజలకోసం,
ప్రజలచేత ఎన్నుకోబడే
ప్రజా ప్రభుత్వాలు ఏర్పడతాయ్ - 
ఇక్కడ ప్రజలే స్వాములు..
పాలకులు ప్రజలకు దాసులు..
అనుక్షణం ప్రజా ప్రయోజనాలకోసం
అందరూ పాటుపడుతూ ఉంటారు..
ఇక్కడ కరువు కాటకాలొస్తే 
తక్షణమే ఆదుకుంటారు 
ప్రతియేటా లక్షల ఉద్యోగాలు,
నిరుద్యోగులకు భృతులు,
వయో వృద్ధులకు పింఛన్లు, 
ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు...
ఇక్కడ రైతే రాజు
ఆత్మహత్యలంటే ఏంటో ఎరగడు...
ఇక్కడ స్త్రీలను పూజిస్తారు,
మగవాళ్లతో సమానంగా చూస్తారు -
ఇక్కడ రాజకీయాలు కులమతాలకతీతం
ఇక్కడ జన్మించడం పూర్వ జన్మ సుకృతం
ఇక్కడ చావడం ప్రతి ఒక్కడి జీవితాశయం!