08 February 2013

గమ్యం




కళ్లలోనుండి ప్రవహిస్తుంది
కారు చీకటి -
మస్తిష్కంలో నిస్తేజమై నిలబడింది విశ్వం -
చిట్టచివరి ఆలోచన ఎప్పుడో పిట్టలా ఎగిరిపోయింది -
అగాథానికి చేరిన కన్నీటి పొర
అడుగంటి ఇంకిపోయింది -
దారి చూపుతున్న త్రోవ హఠాత్తుగా అదృశ్యమైంది -
చుట్టూ ఉన్న గాలి స్థంభించిపోయింది - 
ఇక మిగిలిందేముంది?
దేనికోసం పోరాడాలి?
ఎవరికోసం బ్రతుకునీడ్చాలి?
చచ్చిపోతే పోలా?

ఏం ఎందుకు చావాలి?
ఏమీ లేదనుకున్నప్పుడు
ఎదురుతిరిగి పోరాడితే పోయేదేముంది?
విధి రాసిన రాతను 
చెరిపేయడానికి ప్రయత్నిస్తే తప్పేముంది?
నీ తలరాతను నువ్వే రాసుకో..
నీ బాటను నువ్వే పరచుకో..
నీ భుజం నువ్వే తట్టుకొని
నీ జీవితాన్ని నువ్వే మలచుకో..
నీ గమనాన్ని మార్చుకో..
నీ గమ్యాన్ని చేరుకో!

07 February 2013

విస్మయం


విశ్వసనీయ వర్గాల భోగట్టా -
త్వరలోనే అవిశ్వాస తీర్మానం!
విశ్వాసం కలగడంలేదా?
మరీ అంత విశ్వాసం లేకుండా 
అవిశ్వాసం ఏంటి అంటారా?
ఇకనైనా అవిశ్వాసం పెట్టకపోతే
విశ్వసనీయంగా అవిశ్వాసం
ప్రకటిస్తారేమో  ప్రజలు..!

06 February 2013

నిరాధారం


                                                   ఈ సువిశాల జనసంద్రంలో
                                           నువ్వొక సంఖ్యే...
                                           నీ గుర్తింపు నువ్వే సాధించుకో
                                           'ఆధార్' పై ఆధార పడకు! 
                                        

అనూహ్యం


అరే...!
   పొద్దున్నే కలిశాడే -
   బాగోగులు మాట్లాడుకున్నామే...
   అసలు ఊహించనే లేదు
   అంతలోనే ఇంతటి హఠాత్పరిణామమా?
   ఎంత ఘోరం జరిగింది..?
   ఎప్పుడు కలిసినా 
   నవ్వుతూ ఆప్యాయంగా పలకరించేవాడు
   ఇక కనుపించడు -
   అవును...!
   మరణం ఒక ఊహకందని చరణం
   ఒక అదృశ్య చలనం
   విశ్వ విన్యాసంలో
   ఒక వినిపించని రాగం
   ఒక అంతరించని గానం!

ఇది ప్రక్షాళణ సమయం


ఆలోచనలకు చెదలు పట్టి
మెదడు డొల్లబారింది
శ్వాస కల్మషమై
ఊపిరితిత్తులు కుళ్లిపోయాయి
నెత్తురు గడ్డకట్టి
ప్రవాహం ఆగిపోయింది
నడవడిక కుంటిదై
చతికిల పడింది
తనువంతా నీరసించి..
నరాలన్ని కృశించి..
కదిలే ఓపికలేక..
బ్రతికే దారేతెలియక..
ఉన్నచోటే కాళ్లు దిగేసుకొని
ఊబిలో కూరుకుపోతున్నాం -
కాలం కళ్లలోనే బందీ అయింది
తీరం సముద్రంలో కరిగిపోయింది
ఇక ముందుకు సాగలేం..
ఉన్నచోటే ఉండలేం..
ఇది మార్పుకు అదును -
ఇది ప్రక్షాళన సమయం -
ఇదే ఆఖరిపోరాటం కావాలి...
ఇదే గెలుపుకు సోపానంగా మారాలి!

04 February 2013

లేడి న్యాయం



అదొక అడవి...
అక్కడ క్రూరత్వం
నిప్పులు కక్కుతూ తాండవిస్తుంది..
అక్కడ పైశాచికం
కోరలు విప్పుకొని
పహారా కాస్తుంది..
మాటువేసిన పులులు
లేడినెత్తురు ఇచ్చే వెచ్చదనంకోసం
వెతుకుతూ ఉంటాయి..
అక్కడ పులికి పాముతో చెలిమి -
నక్కకు తోడేలుతో చనువు -
అది అడవి..
అక్కడ చెల్లేది పులి న్యాయం..
లేడిగా పుట్టడమే శాపం -
పులిని ఎదిరించడం అక్రమం -
పక్షులు ఎంత రోదించినా
పులులు కనికరించవు..
ఏనుగులెన్ని ఘీంకరించినా
అవి భయపడవు..
అవి క్రూర మృగాలు -
మానవత్వానికి ఆమడ దూరంలో
మదమెక్కి తిరుగుతున్న
దానవ చిహ్నాలు -
నిర్భయ ముద్రలు 
వాటి బుద్ధులు మార్చలేవు
అక్కడ పులిని వేటాడే లేళ్ళు కావాలి..
తోడేళ్ళను వెంటాడే నెమళ్ళు రావాలి..
లేడి నెత్తురు మరగాలి..
పులి పొగరు అణగాలి..
ఆటవిక న్యాయం అంతరించాలి!

03 February 2013

పనిష్మెంటు






అవసరమున్నా లేకున్నా
వేసేద్దాం ఒక స్టెంటు..
ఎలా పోతే ఏంటి పేషంటు?
మనఖాతాలో పడితే చాలు
లాభం వెయ్యి పర్సెంటు!