చిక్కని ద్రవ్యాన్ని సైతం వాయువుగా మార్చే అగ్నికీలలు..
ప్రకృతి ధరించిన పచ్చని చీర పండి ఎండుటాకులా మారే రోజులు...
ఎంతకాలమని చేతులడ్డుపెట్టి నీడనివ్వగలం..?
నీటిచుక్క నేలను తాకకముందే అదృశ్యమౌతుంటే,
భూగర్భ జలాలు రేసుగుర్రంలా అడుగంటి పోతూఉంటే...
దాహం దాహమంటూ ఒక్కొక్క పొదా నిర్వీర్యమౌతుంటే...
ఎన్నాళ్లు మనగలదీపూదోట...?
చక్కని చల్లని పూలరెమ్మల మధ్య తిరిగిన రోజులెలా మరచిపోగలం?
ఆ పూపందిళ్ళ ఛాయన నిదురించిన సమయమెలా విస్మరించగలం?
ఈ ఎండిన మొదళ్ళు మళ్లీ చిగురించే రోజులు వచ్చేనా?
ఈ రగిలే ఎదలను చప్పున చల్లార్చే జల్లులు కురిసేనా?
ఫెళ ఫెళమని గర్జించే ఉరుములు -
తళ తళమని మెరిసే మెరుపులు -
ఒక్క నీటి చుక్కనైనా రాల్చక చతికిలబడితే..
భూమాత దప్పిక తీరేదెపుడు?
నిర్జీవమైన వృక్షజాలం మొగ్గలు తొడిగేదెపుడు?
గగనాన్నుండి దూసుకువచ్చే ఉల్కలు నేలను తాకితే
ఉన్న ప్రాణం పోయి లేని ప్రాణం పుట్టుకొసుందని నమ్మే వెర్రి పావులం -
ఉల్కాపాతానికై ఎదురుచూసే ఆశాజీవులం -
పంచప్రాణాలూ కంటిపాపలో నింపుకొని
శ్వాస నిశ్వాసల వత్తులతో కన్నీటిదీపాలు వెలిగించి
విశ్వమంతా ఆవరించిన అంధకారాన్ని వంటిచేత్తో పారదోలడానికి
ప్రయత్నించే పాపాత్ములం!
మనిషి పాపం అని తెలిసీ ప్రకృతికి తీరని అన్యాయం చేస్తున్నాడు. అలాంటప్పుడు ఫలితం అనుభవించక తప్పదు కదా! స్వార్ధపూరిత తత్వంతో కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న మానవుడు నిజంగా "పాపత్ముడే"
ReplyDeleteమీ స్పందనకు ధన్యవాదాలు నవజీవన్ గారు...
Delete