ఓ రోజూ పొద్దున్నే లేచి
అద్దంలో చూసుకున్నా
ఆశ్చర్యం!!!
నా మొహం కనిపించలేదు
గుండాగినంత పనైంది
పరుగున బయటపడ్డా
కనపడ్డవాళ్లందర్నీ అడిగా
నా మొహానికేమైందని
అందరూ నవ్వుతూ నా వేపు చూశారేగానీ
ఎవరూ సమాధానం చెప్పలేదు
అలా అడుగుతూ పోయా
చివరకు ఓ వ్యక్తి ఆగాడు
నవ్వుతూనే ఇలా చెప్పాడు
నిజానికి మాలో ఎవరికీ మొహాల్లేవు
ఎప్పుడో మాయమైపోయాయి
నువ్వు అదృష్టవంతుడివి
ఇప్పటిదాకైనా నీకో మొహమంటూ వున్నది
మేమంతా ఎప్పట్నుంచో
మాస్కులు తొడుక్కు తిరుగుతున్నాం
అర్జంటుగా నువ్వూ ఏదో ఒక మాస్కు కొనుక్కో
అంటూ సలహా ఇచ్చాడు
అప్పుడర్థమైంది నాకు విషయం
వెంటనే అతను చెప్పిన చోటుకు వెళ్లా
ఓ నవ్వు మొహం, ఓ ఏడుపు మొహం..
ఇలా నాలుగైదు రకాల మాస్కులు కొన్నా..
ఇక నాకు భయం లేదు -
రేపట్నుంచీ నేనూ ఏదో ఒక మొహం పెట్టుకు తిరగొచ్చు!
No comments:
Post a Comment