Add caption |
శిలగా మారిపోతా నేను..
నీ చూపుల శర వర్షం
నను తాకిన మరుక్షణమే
నిశ్చలినై నిలబడిపోతా నేను..
తనువును విడిచిన ప్రేమాత్మ
పరమాత్మను కోరే మోక్షగామిలా
నినువెతుకుతూ వెళ్తుంది -
నీ స్పర్శా భాగ్యం కలిగిన తరుణాన
తూర్పున వికసించిన అరుణపుష్పంలా
నీలో తాథాత్మ్యమై పోతా...
సుదూర తీరాన ఏకమైన
రెండు ఆత్మల సంగమంలో
ప్రకృతి పులకించి
పురుషుడు పరవశించిన వేళ -
రంగురంగుల ఇంద్రచాపం
దివినుంచి భువికి దిగివచ్చిన వేళ -
నీకు అర్పిస్తా నా మనస్సుమాంజలి
నీకు సమర్పిస్తా నా హృదయ కుసుమాంజలి!
No comments:
Post a Comment