28 June 2013

కర్తవ్యం


దేవుడి సందేశమో 
కర్మ సిద్ధాంతమో
తరువాత చూద్దాం -

ప్రకృతిని వికృతం చేసే
కర్మకాండను ఇకనైనా ఆపి
పిండవుతున్న కొండల్నీ
మోడవుతున్న అడవుల్నీ
రక్షిద్దాం...

పచ్చని భవిష్యత్తుకు
బలమైన బాటలు వేద్దాం!

నమస్కరించే చేతులతోనే 
ఒక సురక్షిత భూగోళాన్ని
ఆవిష్కరిద్దాం!!

16 June 2013

నవ్వుతూ..నవ్విస్తూ

పుట్టినపుడు ఏడుస్తాం -
చచ్చినపుడు ఏడిపిస్తాం -
ఈ రెండు ఏడుపుల మధ్యా..
బ్రతుకుదాం నవ్వుతూ,నవ్విస్తూ!

11 June 2013

ఆశ

వసంతం వెళ్లిపోయినా
ఒక కోయిల ఇంకా పాడుతూనే వుంది..

సూర్యుడస్తమించినా
ఒక కాంతి రేఖ ఇంకా మేలుకొనే వుంది..

ఆలయం తలుపులుమూసినా
ఒక గొంతు ఇంకా ప్రార్థిస్తూనే వుంది -


చిగురించిన ఆశలు పూలు తొడిగితే చూడాలని
ఆ కోయిల ఆరాటం..

కనుమరుగైన రవి తిరిగిరాకకై 
ఎదురుచూస్తుందా కిరణం..

మూసిన తలుపులు ఛేదించాలని  
తాపత్రయపడుతుందా కంఠం - 


రెపరెపలాడే దీపాన్ని ఆరిపోకుండా  
నిలబెడుతుందొక చిన్న ప్రయత్నం..

చుట్టూ అలముకొన్న అంథకారాన్ని అంతమొందించి
వెలుగులు నింపుతుందొక నమ్మకం..

నిన్నటి అపజయాలపై సమాథి కడుతూ 
రేపటికోసం బాటలు వేసుకుంటుందొక చిన్ని ఆశ!   

10 June 2013

మేలు కొలుపు

నీ గురించి నువ్వేదనుకుంటే 
అదే నువ్వు..

నీ కంటూ ఓ గురి ఉంటే 
అదే నీ గమ్యానికి దారి..

నీ నవ్వే నిన్ను కష్టాల కడలిని
దాటించే నావ..

నీ మనసే నీ స్వర్గానికి
నువ్వేసే నిచ్చెన..

నీ ఆలోచనే నిను ముందుకు నడిపే 
నీ నెచ్చెలి.. 

ఒడిసి పడితే... కాలమే కొడుతుంది నీకు సలాం -
ఈ  లోకమే అవుతుంది నీకు గులాం!!  

09 June 2013

నీతి

ఎదుటివాళ్లకు మనం చెప్పే 
నీతి పాఠాలు
మనకు పనికి రావు!
మన కోసం ఎవరో చెప్పే 
మంచి మాటలు 
మన చెవికి చేరవు!!