13 July 2020

చివరి హెచ్చరిక

నాకెందుకిలా అనిపిస్తుంది?
నా చుట్టూ చిక్కని చీకటి
దట్టంగా అలముకున్నట్టుగా...
ఈ విశాల విశ్వంలో
నేనో వొంటరి శకలాన్నై మిగిలినట్టుగా...
నా శ్వాసని ఎవరో బంధించినట్టుగా...
నా చూపును  ఏదో అడ్డుకుంటున్నట్టుగా...
నా ధ్యాసనెవరో
దారి మళ్లించినట్టుగా...
నా నడకనెవరో
నియంత్రించినట్టుగా...
నా ఉనికినెవరో కూల్చేస్తున్నట్టుగా --

ఈ పక్షులెందుకు  నావైపు
జాలిగా చూస్తున్నాయి?
ఈ చెట్లెందుకు నన్ను
దీనంగా అర్థిస్తున్నాయి?
ఈ నదులెందుకు  నన్నుచూసి కన్నీరుమున్నీరవుతున్నాయి?
ఈ కొండలెందుకు
గుండెలు బాదుకుంటున్నాయి?
ఈ నేల నన్నెందుకు చీదరించుకుంటుంది?

ఎందుకీ ఆకాశం వెక్కివెక్కి ఏడుస్తూ
నాకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఉంది?
ఈ గాలి నన్ను కోరికేస్తున్నట్టుగా...
ఈ దారి నాకు ఎదురుతిరుగుతున్నట్టుగా...
నా పలుకే నాకు వినిపించనట్టుగా...
ఎవరో నన్ను తరుముతున్నట్టుగా...
ఏదో నన్ను ప్రేరేపిస్తున్నట్టుగా --

ఎందుకిలా అనిపిస్తుంది?

'నా నుండి ఎంతో తీసుకున్నావు,
దాన్లో  కొంతైనా
నాకు తిరిగిచ్చెయ్'
అని ఎవరో అంటున్నట్టుగా...
నాకు వినిపించీ  వినిపించనట్టుగా...

05 July 2020

నవ్యారంభం

గతించిన కాలాన్ని
చితి నుండి లేపి
కొన్ని ప్రశ్నలు అడగాలి --

నా అడుగుల ఆనవాళ్లను
దొంగిలించిందెవరు?
నా హక్కుల మొక్కలను
మొదలంటా నరికిందెవరు?
నా మాటను కాటేసిందెవరు?
నా స్వేచ్ఛకు సంకెళ్ళేసి
ఊరవతల చీకటి గదిలో
నిర్బంధించిందెవరు?
ఆ బ్రహ్మ దేవుడి చేయి పట్టుకొని
నా నుదిటి మీద పిచ్చిరాతలు
రాయించిందెవరు?

చెదలు పట్టిన చరిత్రను
సమాధిలోంచి బయటకు లాగి
కొన్ని జవాబులు రాబట్టాలి --

నా ఊహల రెక్కలు కత్తిరించి
నా ఆశల ఊపిరి ఆపిందెవరు?
నన్నో  మూలకు విసిరేసీ,
నా రక్తమాంసాలు పీల్చేసీ,
నన్ను నిర్వీర్యం చేసిందెవరు?
నా అమాయకత్వంతో ఆడుకొని,
నా తడియారని చిరుప్రాయాన్ని
మొగ్గలోనే తుంచిందెవరు?
నా మూలాలనుండి నన్ను వేరుచేసి
నా నెత్తురుకు  కొత్తరంగులు అద్దిందెవరు?

అడుగడుగునా కన్నీటి సముద్రాలే...
ఎదఎదలో ఆవేదనా  వలయాలే...
ప్రతి మదిలో బాధామయ గాధలే...

శోక బీజాలు నాటి చిరు నవ్వులు పండించలేం...
అస్తవ్యస్థ భావాలతో సమసమాజాన్ని  నిర్మించలేం...  అణచివేయబడ్డ ఆక్రందనలతో
ఆనందపు వెలుగులు సృష్టించలేం...

ఇదంతా తెలిసీ...
ఇవన్నీ చూస్తూ...
నిశ్చేష్టగా నిలబడ్డ గతాన్ని తవ్వి తీసి
ఆక్రోశపు మంటల్లో మళ్ళీతగలబెట్టాలి...
గతి తప్పిన చరిత్రను సరైన దారిలోకి మళ్ళించాలి...
మలినపడ్డ ధరిత్రిని పునఃపవిత్రం చేయాలి...
కుంటుపడ్డ భవితకు కొత్త నాంది పలకాలి.