30 September 2011

కంచెకు చేరిన కథ

అన్నదాత రైతన్నకు
ఎన్నడూ రాని దైన్య స్థితి
దిక్కుతోచని పరిస్థితి -
గతి తప్పిన గాలులు..
శృతి తప్పిన వానలు..
మొలకెత్తని విత్తనాలు..
తలనెక్కిన అప్పులు..
మింటినంటిన ఎరువుల ధరలు..
ఆగని రైతన్న కన్నీటి ధారలు..
కనిపించని మద్దతులు..
వయసుడిగిన సేద్య పద్ధతులు -
రోజూ కరెంటు కోతలే ఐతే
పంటకోతలు ఇంకెక్కడ?
కలో గంజో తాగుతూ
పంటను కంటికి రెప్పలా కాపాడుతూ
కాస్తో కూస్తో పండిస్తే
దాన్ని కాస్తా తన్నుకు పోయే రాబందు దళారులు -
పొలానికి వేశారు తాళాలు
ఇంటికి తాళం వేయాల్సిన అవసరం లేదు-
ఇలా రైతన్నలు నీరసిస్తే...
ఇక పండించలేమని నిరసిస్తే...
ఏమిటీ మన భవిష్యత్తు?
ఏమై పోతుందీ జగత్తు??

29 September 2011

ఏకాకి

ఏ కాకీ కాదు ఏకాకి
ఈ లోకంలో
ఏ కాకికి ఏమైనా...
కావు కావుమంటూ
వాలేను కాకులు ఎన్నో..
తనవాళ్లంటూ ఎందరొ ఉన్నా
మనిషే నిజమైన ఏకాకి-
అంతా సరిగా ఉంటే
చుట్టూ మూగే లోకులు
కిక్కురుమనక జారుకుంటారు

ఆపత్కాలములో తలోమూలకి!

జీవితాన్ని ప్రేమించు

జీవితమంటేఏమిటో
జీవిస్తేనే కద తెలిసేదీ
తెలిసీ తెలియక జీవితాన్ని
మొగ్గలోనే తుంచేస్తే
జీవితమంటే ఏమిటో
ఎలా నీకు తెలిసేదీ
జీవితాన్నే ప్రేమించు
జీవిస్తూనే పరికించు
జీవనరాగం పలికించు!

చదువు

చదువంటే సరదా
కొందరికి
చదువుకో అంటే చిరాకు
ఇంకొందరికి
చదువే సమస్తం
మరికొందరికి
చదవాలనిఉన్నా
చదువుకోలేని దౌర్భాగ్యం
మరో కొందరికి
ఆ చదువుల తల్లి
నుదుట రాసేది ఎందరికి?

ప్రకృతి ధర్మం

చిన్న చేపను
పెద్ద చేప
పెద్ద చేపను
సొరచేప -
అన్ని చేపల్నీ
మనిషి!

27 September 2011

కల-జీవితం

ఎంత అందమైన కల?
తీయని స్వప్న లోకాలలో
తేలిపోతూ
మధురమైన భావాలలో
మునిగిపోతూ
ఆనందపు శిఖరాలను
అందుకుంటూ
ఏవో తెలియని ఊహలలో
విహరిస్తూ -
ఎంత సుందరమైన కల...
ఆరేయి తెల్లవారకపోతే
ఎంత బాగుండేది
ఆ నిద్ర వీడకపోతే
ఎంత హాయిగా ఉండేది
అంతా నా భ్రమ -
కాకపోతే..
కలలు శాశ్వతమా?
అలాగని కళ్లముందు
కనిపించేది మాత్రం
కలకాలం ఉంటుందా?
ఏదీ శాశ్వతం కాదు
నిద్రలో కలలెంతో
ఈ జీవితమూ అంతే
కన్నుమూసి తెరచినంతసేపే
కలైనా..జీవితమైనా!

అంతులేని ప్రేమ

ఎందుకు ప్రేమిస్తున్నావని
అడగొద్దు ప్రియా...
నిన్నిందుకే ప్రేమిస్తున్నానని
ఎంతచెప్పినా...
అది తక్కువే అవుతుంది
నా ప్రేమ చిన్నబోతుంది!

ప్రేమిస్తూనే ఉంటా

నీకు ప్రేమించడం రాదు
ప్రేమంటే ఏంటో తెలీదు
నన్నొదిలెయ్‌ అంటే ఎలా..?
నిజమే...
నాకు ప్రేమించడం రాదు
ప్రేమంటే తెలీదు
కానీ నాకెందుకో...
నీతోనే ఉండాలనీ
నీతోనే బ్రతకాలనీ
నీతోనే చావాలనీ
ఆశగా ఉంది -
చచ్చేలోపు ఖచ్చితంగా
ప్రేమంటే ఏంటో తెలుసుకుంటా
చచ్చే దాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటా!

ఏకాకి...

నిజానికి
కాకి కాదు-
మనిషే
ఈ లోకంలో
ఏకాకి!

26 September 2011

దృశ్య మాలిక


అక్కడ ఆప్యాయతలు కొన్ని
గాఢంగా కౌగలించుకుంటున్నాయి..
నవ్వులు కరచాలనం చేసుకుంటున్నాయి..

అపరిచిత హృదయాలు
అమాంతంగా ఢీకొట్టుకుంటున్నాయి..
చెల్లాచెదురైన స్నేహానురాగాలు
వడివడిగా దగ్గరవుతున్నాయి..
దుఃఖం ఒంటరిగా
ఓ మూల నిలబడి విచారిస్తోంది..
కొన్ని చూపులు ఎవరికోసమో ఎదురుచూస్తూ
ఇంటిగుమ్మాన్ని పదే పదే తడుముతున్నాయి..
ఎదురుచూస్తూ అలసిపోయిన కళ్లు
దబ్బున కూలిపోతున్నాయి...
ఓ మనసు కలవరపడుతుంది..
ఓ హస్తం ఓదారుస్తుంది..
ఇలా కరిగిపోతున్న దృశ్యాలెన్నో..
ఒకదానితరవాత ఒకటిగా
కళ్లముందు పరుగెడుతున్నాయి..
సినిమా రీళ్లలా..
ఆవిరౌతున్న యథార్థ సంఘటనల్లా.

ప్రేమా ఎక్కడ నీ చిరునామా...

ప్రేమను
ప్రేమించాలనుకున్నా
కానీ...
ప్రేమ చిరునామా
తెలియక
ఆగిపోయా!

అవ్యక్త భావాలు

లోలోన ఎక్కడో
తలెత్తడానికి
అవస్థ పడుతున్న
అవ్యక్త కదలికలు..
అప్పుడే నడక నేర్చుకుంటున్న
పసి భావనల్లా
తడబడుతున్న కోరికతో
నిలబడ్డానికి ప్రయత్నిస్తూ
నిలబడలేక పడిపోతూ..
ఇప్పుడే కాదులే అనుకుంటూ..
తిరిగి నిస్పృహలోకి
జారుకుంటూ..
లోలోపల మథనపడుతూ
అక్కడే ఆగిపోతున్న
మనో వాంఛలు
ఘనీభవించిన ప్రేమ రస ఝరులు!

ప్రేమ కోసం


ప్రేమ గురించి
మనమెందుకు ఇంతగా
ఆలోచిస్తాం
పదే పదే దాన్నే తలచుకుంటాం
మనల్ని అందరూ ప్రేమించాలని
ఆరాటపడతాం-
ప్రేమంటే ఏమిటో
ఇంకా అంతు చిక్కకా?
లేక మనక్కావలసినంత
ప్రేమ దొరక్కా, దొరికింది సరిపోకా?
ఏమో..నాకైతే అనిపిస్తుంది
ఎదుటివాళ్లకు ఇవ్వడానికి
తగినంత ప్రేమ మన దగ్గర లేకనే
ఈ తాపత్రయమంతా అని!

మనవాళ్లు

ఎవరు మనవాళ్లు ?
మనకు జన్మనిచ్చిన
తల్లిదండ్రులా..
మన తోబుట్టువులా..
మన రక్తం పంచుకు పుట్టిన
మన పిల్లలా..
మనకు విద్యాబుద్ధులు నేర్పిన
గురువులా..
మన స్నేహితులా..
మన సహోద్యోగులా..
మనకు సన్నిహితులా -
ఎవరు...?
ఈ అసంఖ్యాక ప్రజానీకంలో
ఎదుటివాడి  బాధను చూసి
జాలి దయతో
ఎవరి కళ్లైతే చెమ్మగిల్లుతాయో
వాళ్లంతా మనవాళ్లే!

19 September 2011

అనాథైన హరితపుత్రుడు


అడివి పురుడోసుకుని
నన్ను కన్నది
ఊడల ఉయ్యాల్లో కూర్చోబెట్టి
నన్ను ఊపింది
కొమ్మల ఒడిలో నిద్రబుచ్చి
నన్ను పెంచింది
కాయలతో దుంపలతో
నా ఆకలి తీర్చింది-
ఈ అడివిలోని పక్షులు
నాకు మాట నేర్పాయి
ఇక్కడి గాలి నాకు
పాట నేర్పింది
నెమళ్లు నాకు ఆట నేర్పాయి
నేనెప్పుడూ పాట భుజానేసుకుని
ఇక్కడే తిరుగుతూ ఉంటా-
ఈ ఆకుల్లో హరితాన్నై
ఈ పువ్వుల్లో పరిమళాన్నై
ఈ గాలిలో సంగీతాన్నై
సెలయేళ్లతో మాట్లాడుకుంటూ
వన ప్రాణులతో ఆడుకుంటూ
హాయిగా నవ్వుతూ బతుకుతున్నా..
హఠాత్తుగా ఏదో అలజడి -
మరయంత్రాలు చొరబడి...
చెట్లు నేలకూలుతూ..
పక్షులు ఎగిరిపోతూ..
జింకలు పారిపోతూ..
నెమళ్లు బెదిరిపోతూ.
సెలయేళ్లు ఆవిరైపోతూ -
నా తల్లిని ఎవరో నరికేశారు
నా గొంతునొక్కి
నా పాటను ఎవరో చంపేశారు
నా తల్లి నుంచి నన్ను వేరు చేశారు
నన్ను దిక్కులేని అనాథగా మిగిల్చారు.

18 September 2011

మతం

నీకో మతం..
నాకో మతం..
మన దేవుళ్లకు లేని మతం
ఎందుకో మనకు మాత్రం!

జీవితాశయం

ప్రశ్నకు ప్రశ్న
బదులు  కాదు
ప్రశ్నకు సమాధానం
అంతమూ కాదు
కొన్ని ప్రశ్నల్లో జవాబులు
ఒదిగున్నట్టే
కొన్ని సమాధానాల్లో
ప్రశ్నలూ దాగుంటాయ్‌
ప్రశ్నలకు సమాధానాలు
వెతుక్కుంటూ
సమాధానాల్లో ప్రశ్నలు
ఏరుకుంటూ
అసంతృప్తి ద్వారాలను
దాటుకుంటూ
నిజానిజాల కొలిమిలోకి
నిరంతరం నిష్క్రమించడమే
ఈ మూణ్ణాళ్ల జీవితాశయం!

17 September 2011

నేనెలా ఉండాలి?

నువ్వ్వొట్టి అమాయకుడివిరా
ఎలా బ్రతుకుతావో ఏమో
అనేవాడు మా నాన్న..
నువ్వు చాలా నెమ్మది
ఇలా అయితే ఎలా
అనేవాడు మా అన్నయ్య..
మీరెప్పుడూ ఇంతే
నేనేంచెప్పినా వినిపించుకోరు
అంటుంది మాయావిడ..
నువ్వెప్పుడూ ఏదోవకటి
చెప్తూనే ఉంటావ్‌ డాడీ
అంటుంటాడు మా అబ్బాయి -
ఇవన్నీ వింటే నాకనిపిస్తుంది
నేను ఎలా ఉండాలో అలా
ఉండట్లేదేమోనని-
మరి నేనెలా ఉండాలో ఏమో??

శపథం

నేనొక శిల్పిని
కఠోర శిలను సైతం
కళ్లు మిరుమిట్లు గొలిపే
శిల్పంలా మార్చాలని
ఆరాటపడుతూ ఉంటాను
కానీ ....
కనిపించిన ప్రతి రాయినీ
అద్భుతమైన బొమ్మగా
చేయాలనుకోవడం
అత్యాశే అవుతుందేమో?
అందుకేనేమో ...
నేను చెక్కిన ప్రతి శిల్పంలో
ఏదో ఒక లోపం ఉంటూనే ఉంది
అయినా నా ప్రయత్నం ఆగదు
ఏదోనాటికి నేను
అందరికీ నచ్చే అందరూ మెచ్చే
శిల్పాన్ని చెక్కే తీరుతా!

కొంచెం కన్నీళ్లు కావాలి

పంట నేలరాలింది
పొలం బీటలువారింది
గుండె ఎండిపోయింది
కొంచెం...
కన్నీళ్లు కావాలి -
ఏడవడానికి...
గుండె పగిలేలా !

15 September 2011

మంచుకప్పిన అగ్నికణం

చెప్పలేని బాధలు
చెప్పుకోలేని గాథలు
చెప్పాలా వద్దా అన్న
మీమాంసలు -
చెప్పలేక లోలోపలే
కుతకుతలాడే అగ్నిపర్వతాలు -
ఈ పొగల సెగల ప్రయాణంలో...
నిత్యం ఆవిరౌతూ
ఆత్మీయులకోసం ఘనీభవించి
చల్లని నీరౌతూ
లోపల మగ్గుతున్న మొగ్గౌతూ
బయటకు నవ్వే పువ్వౌతూ
అర్ణవాలు దాటుతూ
నరనరాల క్రుంగుతూ
సాగిపోతోంది జీవితం
మంచుకింద కప్పిన
అగ్ని కణంలా !!

13 September 2011

బదిలీలు

బదిలీల జీవితం...
ఎక్కడో ఒక్క చోట
తిష్ట వేసుక్కూర్చోవాలంటే
వీలుకాని జీవనం...
ఏదో ఒక ఊరికి బదిలీ అవుతుంది
కొత్త పరిసరాలు...
కొత్త వ్యక్తులు...
కొత్త ఇల్లు...
ఇల్లంతా సర్దుకొని ఆ వాతావరణానికి
అలవాటుపడ్డానికి
కొంత కాలం పడుతుంది
అక్కడ మొక్కలు పెంచుకొని
పరిచయాలు పంచుకొని
స్థిరత్వం పొందేలోపే
మళ్లీ బదిలీ -
అన్నీ తుంచుకొని మళ్లీ ప్రయాణం
వేరే ఎక్కడికో -
మాకైతే ఇది అలవాటై పోయింది
పిల్లల పరిస్థితే దయనీయం
తమ స్నేహితులను, స్కూల్ని
వదలి వచ్చిన తరవాత
వాళ్లు అనుభవించే బాధ
వర్ణనాతీతం -
బదిలీ మీద ఈ ఊరొచ్చిన కొత్తల్లో
మావాడు తన పాత స్నేహితులతో
స్కూల్లో తీసుకున్న ఫోటోను
చేత్తో తడుముతూ కన్నీళ్లు రాలుస్తుంటే
నా మనసెందుకో చలించింది!
ఈ బదిలీల జీవితాలు
ఇంతేనేమో అనిపించింది!!

12 September 2011

ఊరు ఏడుస్తుంది!

ఏమైంది నా ఊరికి?
పచ్చగా నవ్వే పొలాలు
వెచ్చని పలకరింపులు
గలగల మాట్లాడే సెలయేళ్లు
చెంగు చెంగున ఆడుకొనే లేగ దూడలు
ఎద్దుల మెడలో లయగా ఊగే గంటల మోతలు
కిచ కిచ లాడే పిచ్చుక గూళ్లు
తొలకరి మొలకలు
రివ్వు రివ్వుమనే వడిశెల సవ్వడులు
కోతలు, నూర్పిళ్లు
ధాన్యంతో క్రిక్కిరిసిన గాదెలు
బారులు తీరిన రంగవల్లులు
డూడూ బసవన్నలు...
ఇవేమీ కనపడవేం?
ఏమైంది నా ఊరికి?
వీధులన్నీ ఖాళీగా ఉన్నాయేం?
ఊరి జనమంతా జీవం లేని మొహాలతో
దిగాలుగా కూర్చున్నారేం?
నా ఊరెందుకిలా ఎండి పోయింది?

నా ఊరెందుకిలా ఏడుస్తుంది??

11 September 2011

అది ప్రేమే..

కనులు కనులూ కలిసినపుడు
కలవరమేదో కలిగినపుడు
రెండు చూపులు కలబడినపుడు
గుండె చప్పుడు తడబడినపుడు
అది ప్రేమ కాక ఏమవుతుంది
నీ మనసునడుగు వివరిస్తుంది!

సుస్థిరత

కనపడని అడుగులు చేస్తున్న శబ్దం
ఏదో నాకు వినిపిస్తుంది
కిందపడి భళ్లున పగిలి
ముక్కలైన మౌన శిథిలాలు
చెల్లా చెదురుగా విడివడి
లెక్కలేనన్ని రూపాలను
సంతరించుకుంటున్నాయి
మనసు అగాథంలో ఎక్కడో
అణు విస్ఫోటం జరిగి
నా అణువణువుకూ పాకి
అర్ణవం సృష్టిస్తుంది
ఏదో తెలియని శక్తి
నా నరనరాలగుండా ప్రవహించి
నన్ను ఉత్తేజపరుస్తుంది
ఎన్నో రంగులు పులుముకున్న దృశ్యమొకటి
నా కంటి నాడులపై నాట్యం చేస్తుంది
కకలావికలమైన ఆలోచనల ఉప్పెన
చివరకు సద్దుమణిగి నా  ముందొక
అందమైన చిత్రాన్ని ఆవిష్కరించింది
లోతెరుగని లోయల్లోకి
జారిపోతున్న నా చేతికి
ఓ చెట్టుకొమ్మ దొరికింది
నాకు ఆధారంగా నిలుస్తూ
నా ఊహలకు సుస్థిరత చేకూరుస్తూ!!

10 September 2011

ఓరి దేవుడో..

నాకు
ఆవేశం ఎక్కువ
కవిత్వం తక్కువ
ఆవేశం వచ్చినప్పుడల్లా
కవిత్వం రాద్దామని కూర్చుంటే
ఆ ఆవేశం కాస్తా
ఉన్న ఆ కూసింత కవిత్వాన్ని
కరకర నమిలి మింగేస్తుంది
ఇక నేను కవిత్వం
రాయడమెలా..?

09 September 2011

నేను మారాలంటే ఇంకేదో జరగాలి

ఎంతకాలమిలా ?
ఈ వ్యవస్థ మారాలి
వ్యవస్థ మారాలంటే
ముందు మనం మారాలి
మనం అంటే..
మనలో ఉన్న ప్రతిఒక్కరూ
నేను కూడా..
నేను నిజంగా మారగలనా?
నా ఆలోచనా సరళీ...
తరతరాలనుంచి
వారసత్వంగా వస్తున్న
ప్రవర్తనా ధోరణీ..
ఎలా మార్చుకోవాలి?
ఆత్మావలోకనంతోనా?
లేక...
వాగ్వివాదాలతోనా?
కాదంటే...
మహాత్ములు చెప్పిన మాటలు
నెమరువేసుకుంటూనా -
ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నానే..
ఎన్నో ఏళ్ళుగా
ప్రయత్నిస్తూనే ఉన్నానే...
నాలో  ఏమాత్రం మార్పు రాలేదేం?
అంటే...
మార్పు రావాలంటే ..
ఇంకేదో జరగాలి
నేను మారాలంటే ఇంకేదో జరగాలి!!!

08 September 2011

మినీ కవితలు

1
ఆలోచన
--------
కెరటం
చేరేది
తీరంలో -
ఆలోచన
సమకూరేది
అక్షరంలో!


2
భయం
------
అలంటే
భయం లేని
చేపకు
వలంటే
భయం!

ఏది నిజం?

ఈ ఇజం  ఆ ఇజం అంటూ
ఎందుకు భేషజాలు?
తెలుసుకుంటే చాలదా
నిజానిజాలు!

అంతర్జాలంలో సాలీడు

మేము
అంతర్జాలంలో
చిక్కుకున్న
సాలీడులం -
ఎన్నిసార్లు కిందపడ్డా
తిరిగి లేవడానికే
ప్రయత్నిస్తాం!

07 September 2011

వాడు చంపుతూనే ఉంటాడు

వాడు మనలో కొందర్ని చంపుతాడు
మనం ధైర్యంగా ఉంటాం
అంతా కలసికట్టుగా ఉంటాం
సంయమనం పాటిస్తాం
చనిపోయిన వాళ్ల ఆత్మకు
శాంతి కలగాలని
దేవుణ్ణి ప్రార్థిస్తాం
కొన్ని రోజులు అప్రమత్తంగా ఉంటాం
భద్రతా వ్యవస్థను పటిష్టం చేస్తాం
తరవాత మనపనుల్లో మనం
నిమగ్నమై పోతాం
అంతా ప్రశాంతంగా ఉంటుంది
అదును చూసి వాడు మళ్లీ
దాడి చేస్తాడు
దయాదాక్షిణ్యాల్లేకుండా
ఊచకోత కోస్తాడు
మనం మళ్లీ హాహాకారాలు చేస్తాం
ఇక ఊపేక్షించకూడదనుకుంటాం
ప్చ్‌..మనం శాంతి కాముకులం
మళ్లీ ధైర్యం ప్రకటిస్తాం
అందరం ఆ విపత్కర స్థితిలో
ఒక్కటిగా నిలబడతాం
ఎక్కడలేని సంయమనం చూపిస్తాం
ఇలా ఒకసారి కాదు
అనేక సార్లు వాడు గురిపెడతాడు
చంపుతూనే ఉంటాడు
వాడి మృత్యుదాహం తీర్చుకుంటూనే ఉంటాడు
మనం చూస్తూనే ఉంటాం
చస్తూనే ఉంటాం
వాడూ చూస్తూనే ఉంటాడు
మనల్ని చంపుతూనే ఉంటాడు!

కొడుకా..స్నేహితుడా?

మావాడు నాతో
ఫ్రెండులా ఉంటున్నాడని
మురిసిపోయా -
ఇప్పుడు..
తండ్రిలా చూడ్డంలేదని
ఏడుస్తున్నా..!!

06 September 2011

మినీ కవితలు

‎1
ఎన్నికలు
---------
ఇదేళ్లకోసారి
ప్రజలు
జరుపుకొనే
పండగ!

2
ఆకలి
-----
పేదోడికి
మిత్రుడు
ఉన్నోడికి
శతృవు!

3
వ్యవసాయం
-----------
రైతుల
పాలిట
కషాయం!

4
పురుగులమందు
---------------
పంటలు
పండితే...
పురుగులకు-
ఎండితే
రైతులకు!

5
ఉదయం
--------
రాత్రి
మేలుకొనే
సమయం!

6
గుడి
-----
మనిషికి
కష్టాలొచ్చినప్పుడు
తలదాచుకొనే చోటు!


7
గనులు
-------
తవ్వేకొద్దీ
అవినీతిని
బయటపెట్టే
ఖనులు!

05 September 2011

నేను మారిపోయానా?

ఒక రోజు
పొద్దున్నే నిద్రలేచి
అద్దం ఎదురుగా నిలబడ్డా -
ఆశ్చర్యం!!!
అద్దంలో కనపడేది
నేను కాదు -
ఇంకెవరో...
మొహం కొంచెం క్రూరంగా
నల్లగా, కళ్లు ఎర్రగా...
ఎవరది???
నేనెపుడూ అలా లేనే..
అలా ఏనాడూ కనిపించాలనుకో లేదే -
అద్దాన్ని తుడిచాను..
కళ్లు నులుముకొని చూశాను
ఊహూ...
అదే ప్రతిబింబం
నాకు అర్థం కాలేదు -
నాకేమయింది?
నేను మారిపోయానా?
నిజంగా అలా పరివర్తన చెందానా??
ఏమో నాకు తెలీదు!
ఏమో నాకు తెలీదు!!

04 September 2011

ఎగిరే గాలిపటాలు

ఎగిరే గాలి పటాలు
కొందరి జీవితాలు
అవి ఎగరాలా లేదా
అనే నిర్ణయం
వాళ్ల చేతుల్లో ఉండదు
గాలిపటం ఎగరడానికి
ఆధారమైన దారం
మరెవరిదగ్గరో ఉంటుంది
దారాన్ని లాగేవాడి
అనుభవం, ఆలోచన మీదే
ఆ జీవితాలు వేళ్ళాడుతుంటాయి
ఎప్పుడు పైకెగరాలో
ఎందుకు కిందకు జారాలో
వాళ్లకు తెలీదు
చేతులో ఉన్న దారం వదిలేస్తే
ఆ గాలిపటాలు
ఎటు కొట్టుకుపోతాయో
ఎక్కడ చిక్కుకుపోతాయో
అంతకన్నా అర్థం కాదు-
ఆ జీవితాలంతే...
ఎవరి చేతుల్లో పడాలనేది
కాలమే నిర్ణయిస్తుంది!

03 September 2011

నీ ధ్యాసే...

మునిమాపులలో
ఎదలోతులలో
గాఢ నిద్రలో
పూర్తి స్పృహలో
ఎక్కడ చూసినా
ఎందు వెదకినా
నీ రూపే
నీ ధ్యాసే -
ఎందుకురా నన్నిలా
వెంటాడతావ్?
నీ అప్పు
వచ్చే వారం
తీరుస్తానన్నాగా!

నాటకం


ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ పలవరము
వచ్చేటప్పుడు

తెచ్చిందేమిటి
పోయేటప్పుడు
వచ్చేదేమిటి
ఉండేదే మూన్నాళ్ళు
అంతలోనే ఎందుకు ఇన్ని ముడులు
దేవుడు కల్పించాడో
కావాలని కలిపించాడో
ఎందరినో నీకు తోడుగా
ఎందరికో నువు నీడగా
బంధువులు బాంధవ్యాలు
బాధ్యతలు బంధనాలు
ఎపుడు తీరిపోవునో
చివరకేది మిగులునో
అంతా మాయేనేమో
ఇదంతా మిథ్యేనేమో
ఎవరికి ఎరుక
ఎరిగేందుకు ఎవరికుంది తీరిక
నాలుగు రోజులూ నవ్వుతూ
నలుగురితో తిరుగుతూ
నాటకానికి తెరపడితే
నిష్క్రమించడమేగా మన పని!!

ఇది నీ పరిచయ భాగ్యమే!

ఎదలో
మెదిలిన మాట
పెదవిదాటనంటుంది
మదిలో
మొదలైన కదలిక
కనుల నిలవనంటుంది
ఉలుకూ పలుకూ లేక
హృదయం మూగబోయి
నిలబడుతుంది -
నువు పరిచయమైన
వేళా విశేషమో ఏమో...
నిను చూసిన ప్రతిసారీ
నా పరిస్థితి ఇక ఇంతేనేమో!

01 September 2011

ప్రేమించాలనుకుంటున్నావా?

ప్రేమంటే ఏంటో
తెలియాలంటే
ముందుగా
నిన్ను నువ్వు
ప్రేమించుకొని చూడు -
నిన్ను నువ్వు
ప్రేమించుకోగలిగితే
బహుశా నువ్వు ప్రపంచంలో
ఎవరినైనా ప్రేమించగలవు!

ఈ జన్మకిది చాలు!


ఏమిటో..
ఎంతో ఆసక్తితో
చదువుతా -

ఒక్క ముక్కా అర్థం కాదు
ఏదో ఉన్నట్టే ఉంటుంది
ఏముందో తెలీదు
నా బుర్రకు అందనిదేదో
ఉండే ఉండాలి అనుకుంటా
మళ్లీ మళ్లీ చదువుతా
ఊహూ....
బోధపడితే ఒట్టు
నేను కూడా అలా రాస్తే పోలా???
అమ్మో వొద్దులే
నాకే అర్థం కాకుండా రాసి
వేరే వాళ్ల మెదడెందుకు తినడం!!
నాకు తెలిసిన భాషలో
అందరికీ అర్థమయ్యే రీతిలో
రాయగలిగితే ఈజన్మకది చాలు
!

మనుషులంతా ఒక్కటే

నీ చేతుల్లో ఉందా నీ పుట్టుక
మతం  పేరుతో ఎందుకు చస్తున్నామిలా కొట్టుక
రాముడూ దేవుడే కదా రహీములా
మరి నీకూ నాకూ భేదాలెందుకిలా
చచ్చింతరవాత తెలీదు పొయ్యేదెక్కడికో
దేవుడు సొంతం కాదు ఏ ఒక్కడికో
నువ్వు నేను వేరనుటకు కారణాలెన్నో
మతం ముసుగులో లోకం చేసే తప్పులు ఎన్నెన్నో
ఇకనైనా మేలుకుందాం..మమతలను పెంచుకుందాం
అందరి రక్తం ఎరుపైనప్పుడు
మనసుకు ఏ రంగులూ లేనప్పుడు
ఎందుకు మనకీ కుల మతాల చిచ్చు ?
అందరమొకటై ఆపుదాం ఇప్పుడైనా ఈ కార్చిచ్చు!