30 April 2011

నేస్తమా..వింటున్నావా?

ఓ నేస్తమా!
బాగున్నావా?
ఈ సమయంలో ఎం చేస్తున్నావో?
నేనైతే నీ అలోచనలతో
సతమతమవుతూ ఉన్నాను
నాకైతే నిన్ను తలచుకోని
క్షణమే లేదంటే నమ్ము!
నీకింకో విషయం చెప్పనా...?
నాక్కావలసినప్పుడల్లా
నీతో మాట్లాడుతూ ఉంటాను -
నిన్నే చూస్తూ.....
నీ ప్రతి కదలికనూ గమనిస్తూ....
నీతో గంటలకొద్దీ గడుపుతాను -
నీకివేం తెలీదు కదూ!
అవున్లే...!
నీకంత తీరికెక్కడ?
నీకోసం అహర్నిశలూ పరితపిస్తూ


నీ పేరే అనుక్షణం జపిస్తూ
నా ప్రతి ఊహలో, ఆశలో, ఆలోచనలో
నిన్నే మోస్తూ, నీకై తపిస్తూ
ఇక్కడొక జీవి చస్తూ బ్రతుకుతుందని
నీకెక్కడ ఎరుక...?
నీకు వీలైతే...
నీకు తీరిక దొరికితే...
నీ స్మృతి పథంలో నేనెప్పుడైనా
తళుక్కున మెరిస్తే...
ఒక్క క్షణం నాగురించి ఆలోచిస్తావు కదూ!
నా హృదయరాగ తరంగాలకు
ఒక్కసారి స్పందిస్తావు కదూ!! 

29 April 2011

అమ్మ జాగ్రత్త!

నువ్వు బయటకెళ్తున్న ప్రతిసారీ
'జాగ్రత్త నాయనా' అంటూ
నీకోసం కంగారు పడుతూ చెప్పేది అమ్మ
నువ్వు తిరిగొచ్చేదాకా
మనసు మనసులో ఉండేది కాదు అమ్మకు
అమ్మెప్పుడూ అంతే
ఊరికే కలత చెందుతుంది -
అని కొట్టిపారేసేవాడివి నువ్వు
కానీ నీకు తెలియని విషయం ఒకటుంది
ఆ అమ్మ ఆశీస్సులతొనే
నువ్వు ఇంతవాడవయ్యావు!
ఈ రోజున నువ్వెక్కడున్నావో..?
ఎంత ఎత్తు ఎదిగావో..?
ఇప్పుడు అమ్మగురించి ఆలోచించడం నీ వంతు -
ఒక్కసారి అమ్మను తలచుకో!
అమ్మ జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకో!!

భయపడకు!

దేనికీ భయపడుతున్నావ్‌?
ఎవరో తరుముతున్నట్టు
గస పెడుతున్నావ్‌?
నీ కాళ్లకింద మట్టి చెదిరేలా,
నీ ఊపిరి బిగపట్టుకు పోయేలా,
నీ గుండెచప్పుడాగిపోయేలా,
నీ రక్తం గడ్డకట్టి పోయేలా...
ఎందుకు భయపడుతున్నావ్‌?
భయపడకు! భయపడకు!
ఏ రక్కసి..నీ ఆకలికన్న
భయంకరమైనది?
ఏ భూతం..నీ దరిద్రం కన్న
పెనుభూతమైనది?


ఏ ఊళ..నీ బాధకన్న
కఠోరమైనది?
ఏ బడబాగ్ని..నీ జఠరాగ్ని కన్న
తీవ్రమైనది?
ఏ కాలనాగు..నీ దుస్థితికన్న
విషపూరితమైనది?
ఏ పెను తుఫాను..నీలో రగులుతున్న
దావానలం కన్న వేగమైనది -
యుగ యుగాల దాశ్యంలో...
శతాబ్దాల జాఢ్యంలో...
నీ రక్తం మరిగి మరిగి,
నీ నరాలు సడలి సడలి,
నీ చర్మం కమిలి కమిలి...
వెలివేసిన వాడల్లో
మలినమైన జాడల్లో
కుళ్లి కుళ్లి వడలి వడలి
రాతిలా రాటుదేలి
ఉక్కువై శక్తివై
రణ రంగపు యుక్తివై
రంకెలేస్తు పరుగులెడుతు
కదంతొక్కుతున్న నీకు
భయమెందుకు? భయమెందుకు?
దేనికీ భయపడకు! భయపడకు!

28 April 2011

నేనెవరితో చెప్పుకోను?

ఎటువైపు చూసినా
ఎవరి పనుల్లో వాళ్లు
తలమునకలుగా
తిరుగుతున్న మనుషులే - 
అవును మరి.....
ఎవరి బండి వాళ్లు
లాక్కోవాలికదా..!
మరి నేనెవరితో మాట్లాడాలి?
నాలో ఉవ్వెత్తున చెలరేగుతున్న
భావాలను ఎవరితో పంచుకోవాలి?
ఈ పక్షులే నయం -
'కూహూ' అంటే 'ఓహో' అంటూ
బదులైనా ఇస్తాయి...
ఈ చెట్లే సుఖం -
పలకరిస్తే తిరిగి
తలలూపుతూ మాట్లాడ్డానికి
ప్రయత్నమైనా చేస్తాయి..
ఈ నదులైనా ఒకింత మేలు - 
ఒడ్డున చేరితే చల్లని గాలులతో
సేదైనా తీరుస్తాయి
ఆఖరికి భూమిలో పాతుకుపోయి కూర్చున్న
ఈ కొండలు కూడా ఫరవాలేదు -
ఏమన్నా చెబుతుంటే
ప్రశాంతంగా వింటాయి
నాబాధంతా ఈ మనుషులతోనే...
వాళ్లకు ఎప్పుడు తీరిక దొరుకుతుందో?
నాతో ఎప్పుడు మాట్లాడతారో??

నాకిప్పుడే న్యాయం కావాలి!

ధర్మానికి అధర్మానికి పోరాటం
సత్యానికి అసత్యానికి చెలగాటం
పుణ్యానికి పాపానికి కొట్లాట
దేవుడికీ దెయ్యానికీ యుద్ధం
మంచికీ చెడుకీ పోటీ
నీతికి  అవినీతికి కలహం
ఈ మహాయుద్ధంలో గెలుపెవరిది?
ప్రస్థుత పరిస్థితుల్లో అయితే
దేని బలం ఎక్కువైతే దానిది
చివరికి మాత్రం ఎవరిది ఒప్పైతే వారిదట -
కానీ చివరికి మిగిలేదెవరు?
ఈలోపల చచ్చేదెవరు, బ్రతికేదెవరు?

చివరికి ధర్మమే గెలిచేదయితే,
అదేదో ముందే గెలవొచ్చుగా..?
యుగాలు వేచే ఓపిక నాకు లేదు
నాకిప్పుడే న్యాయం కావాలి..!
సత్యం ధర్మం ఇప్పుడే గెలవాలి..!
ఎవరైనా వింటున్నారా..?
నేనడిగేది తప్పా..?
తప్పయితే చెప్పండి..
లేదంటే నాతో చేతులు కలపండి!
అన్యాయాన్ని, అసత్యాన్ని, అధర్మాన్ని
ఇప్పుడే నలిపేద్దాం..!!
న్యాయాన్ని, సత్యాన్ని,ధర్మాన్ని
ఇప్పుడే ఇక్కడే గెలిపిద్దాం..!!!

27 April 2011

ఎందుకు?



           పుట్టే ప్రతివాడూ
           పుడతాడు ఎందుకో ఒకందుకు -
           ఏదెటుపోతే నాకెందుకు
           అని ప్రతిఒక్కడూ అనుకుంటే
           మనమిక పుట్టడం ఎందుకు?
           పుట్టినా బ్రతకడం ఎందుకు?
           రాయీ రప్పా
పుట్టా మిట్టా ఉండగా
           మళ్లీ మనమెందుకు..??




26 April 2011

నిరీక్షణ


మనం కలుసుకున్న క్షణాలు
ఎంత మధురమైనవి..!
వలపు వేదికపై
ఒకరి తలపులలో ఒకరు
లీనమై...సంకీర్ణమై..
మోహావేశంతో
మనసులు మూగబోయిన వేళ
కనుసైగలతో ఒకరినొకరు
పలకరించుకుంటున్న తరుణంలో..
హృదయం ఎంత హాయికి లోనవుతుంది!
ఒకరినొకరు వీడే సమయాన
మనసు ఎంత కలత చెందుతుంది
అంతలోనే మళ్లీ రాబోయే కలయిక యొక్క
చిరు ఊహలు మదిలో మెదిలి
కాస్త ఊరటకు లోనై
కదలలేక కదిలిన క్షణాలు
ఎలా మరువ గలను సఖీ...
మరుచటి రోజు
నీకంటే ముందుగా చేరుకొని
నీరాకకై ఎదురుచూస్తూ
క్షణమొక యుగముగా భరిస్తూ
పిల్లతెమ్మెరకు చిగురాకులు
రెపరెపలాడిన  ప్రతిసారీ
నీ అడుగుల సవ్వడియేమోనని
ఉలికిపడి చూస్తూ
నిన్ను కలిసే ముందు
నీకై నిరీక్షిస్తూ...
నేననుభవించే తీయని క్షోభ..
నీతో ఉన్న క్షణాలకంటే
అతి మధురముగా నన్ను గాయపరుస్తుంటే...
నీతో కూడిన క్షణమా..?
లేక నిరీక్షణమా..?
ఏది మహా సుఖమో తెలియని
తన్మయ స్థితిలో
కొట్టుమిట్టాడుతున్నానని
నీకెలా తెలుపను ప్రియా..!

ఓ అణువు హెచ్చరిక!

నేను నిలుచున్న భూమి -
నాపైనున్న ఆకాశం -
మధ్యలొ ఉన్న నేను...
నాపరిమాణమెంత..?
నాకంటూ ఒక ఉనికి
బ్రహ్మాండంలో ఉందా?
నేనెందుకు ఇక్కడ ఉన్నాను?
నేనేం చెయ్యగలను..?
కొటానుకోట్ల
సూర్యమండలాలు
నిరంతరం ప్రజ్వలిస్తున్న
విశ్వాంతరాళంలో
కంటికి కనిపించనంతటి
ఒక చిన్న రేణువును...!
నాకున్న శక్తి ఎంత?
ఏమో...?
నాకనిపిస్తుందీ...
విశాల విశ్వాన్ని
ఒక్క గుటకలో మింగేయ గలనని..
నక్షత్ర మండలాలన్నింటినీ
ఒక్క చిటికెలో సమాయత్తం
చేయగలనని..
ఏమో..ఈవిశ్వాన్నంతా
కబళించగల శక్తి
నాలో ఉన్నదేమో అనిపిస్తుంది
నిద్రాణమైఉన్న నాశక్తిని
ఉసిగొలిపితే విశ్వాన్నే
హరించివేయ గలనేమో..?
అందుకే మానవుడా..!
నన్ను దీర్ఘనిద్రలో ఉండిపోనీ..
నా శక్తిని నాలోనే
నిక్షిప్తమైపోనీ..
మానవాళి మనుగడకు
ముప్పు వాటిల్లనీయకు!

25 April 2011

మనస్తత్వం

నాకు తెలిసిందే
వేదం అనుకుంటే
అది మూర్ఖత్వం,
నేను నమ్మిందే
ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే
అది మూఢత్వం,
ఎదుటివాడికి
ఏమీ తెలియదనుకుంటే
అది అమాయకత్వం,
ఇతరుల నమ్మకాలను
గౌరవించలేకుంటే
అది అమానుషత్వం,


 
నేను తెలుసుకోవాల్సింది
ఏమీ లేదనుకుంటే
అది పైత్యం,
అందరి భావాలను
అర్థం చేసుకుంటే
అది మనిషి తత్వం,
అందరి విశ్వాసాలకు
విలువనివ్వడమే
మానవత్వం!

24 April 2011

మనసులో కొలువైన దేవుడు

మానవత్వమున్నవాడు
మనిషైతే,
దైవత్వం కలిగినవాడు
దేవుడైతే - 

మరి...ఆపదలో ఆదుకొనే వాడు,
అందరికీ ప్రేమను పంచేవాడు,
సత్యం, ధర్మం, అహింసలను
బోధించేవాడు,
మానవ సేవే మాధవ సేవని
నమ్మేవాడు, ఆచరించేవాడు...
మనిషా...? దేవుడా...?
అతడు మనుషుల్లో దేవుడు,
అందరి మనసుల్లో దేవుడు...
మన మధ్య లేకున్నా,
మన మనసుల్లో ఎప్పటికీ
కొలువుండే భగవంతుడు!

23 April 2011

ఒకరికొకరు తోడుగా...

బ్రతకడానికే
పుట్టినోళ్లు కొందరు,
చావలేక
బ్రతికేటోళ్లు కొందరు -
బ్రతకలేక
చచ్చేటోళ్లు కొందరు,
చావుకు భయపడక
తిరిగేటోళ్లు కొందరు -
ముందు వెనుకగా
పోయేటోళ్లే అందరు,
చని పోయాక
ఎవరు ఎవరికీ చెందరు -
అందుకే..ఉన్నన్నాళ్లూ
ఒకరికొకరై తోడుండాలి అందరు!

22 April 2011

నువ్వు నేను

నువ్వా? నేనా? అంటే
అది కలహం..
నువ్వూ నేనూ అంటే
అది స్నేహం..
నువ్వే నేనంటే
అది ప్రేమ..
నీవెంటే నేనంటే
అది బంధం..
నువ్వక్కడా నేనిక్కడుంటే
అది నరకం..
నువ్వూ నేనూ కలిసుంటే
అది స్వర్గం!

21 April 2011

నేనింకా బ్రతికే ఉన్నానా?



నేను చూశాను -

వీథిలో విసిరేసిన
ఎంగిలిమెతుకుల కోసం
ఊర కుక్కలతో ఒక వైపు
బొంత కాకులతో మరో వైపు
భీకర పోరాటం సాగిస్తున్న
ఒక అనాథ బాలుడి ఆకలి మంటను చూశాను...
కన్నపిల్లలకు పట్టెడన్నం పెట్టలేక
వంట్లో పని చేసే శక్తి లేక
అనారోగ్యంతో మూలుగుతూ
ఒక తల్లి పడుతున్న ఆవేదన చూశాను...


పంటలన్నీ వరద పాలై
చేసిన అప్పులు నాలుగింతలై
ఎలా బ్రతకాలో తెలీక
పురుగులమందు తాగి చావడానికి సిద్ధమైన
ఒక రైతు నిస్సహాయతను చూశాను...
ప్రేమించని పాపానికి
ఉన్మాది ప్రేమికుడొకడు
యాసిడ్‌ మీద విసిరితే
మొహమంతా కాలిపోయి
ఓర్వలేని బాధతో అల్లాడుతున్న
ఒక యువతి ఆక్రందన చూశాను...
ఆడపిల్లగా పుట్టిన నేరానికి
కోపోద్రిక్తుడైన తండ్రి
తనను నేలకేసి మోదితే
ప్రాణాలు వదులుతున్న
ఒక పసిగుడ్డు ఆఖరి శ్వాస చూశాను...
కని పెంచిన పిల్లలే కర్కోటకులై
మీ చావు మీరు చావండని వదిలేస్తే
అటు చావలేక ఇటు బ్రతకలేక
జీవశ్చవాల్లా మిగిలిఉన్న
వృద్ధ దంపతుల కన్నీటి ధార చూశాను...
ఇవన్నీ చూస్తూ....
నేనెందుకు ఇంకా బ్రతికి ఉన్నానో అర్థంకాక
నిస్సహాయుడినై...నిశ్చేష్టుడినై
అలా చూస్తూనే నిలుచుండి పోయాను!!

20 April 2011

గడ్డిపువ్వు నివేదన

ఓ ప్రభూ!
నేనొక గడ్డిపువ్వును...
నీ దర్శన భాగ్యం కోసం
ఎన్నాళ్ళుగానో వేచియున్న
ఒక అభాగ్య పువ్వును...
నిత్యం నిను చేరే పుష్పాలది
ఎంత అదృష్టమో కదా..!
అవి నీ మెడలో..నీ ఎదపై..నీ పాదాల చెంతా.. చేరి
నిన్ను స్పృశిస్తూ,
నీకెంత హాయిని కలిగిస్తాయో...
ఈ మనుషులకెందుకు నాపై ఇంత వివక్ష..?
నాలో రమ్యమైన వర్ణాలు లేవనా..?
నేను వేరే పుష్పాల్లా పరిమళాలు చింద లేననా..?
నేను వాటంత మృదువుగా లేననా..?
పొరపాటునైనా ఏదో రోజు నన్ను నీ చెంతకు
చేరుస్తారేమోనని ఎంత ఎదురు చూశాను..!
నాకు నిరాశే మిగిలింది -
హే ప్రభూ..!
నేను కురూపిని కావచ్చు
సువాసనలు వెదజల్లలేక పోవచ్చు
అనేక రంగులతో అలరించనూలేక పోవచ్చు
కానీ..నిన్ను ఒక్కసారి కనులారా వీక్షించాలని,
నీ పాదాలను ఒకపరి తనివారా స్పృశించాలని,
నీ ప్రాంగణంలోనే అలసి,సొలసి చివరకు సమసి పోవాలని
ఎంతగానో పరితపించే ఈ గడ్డిపువ్వును కనికరించలేవా ప్రభూ..!
వేయిమార్లు నన్ను మళ్లీ గడ్డిపువ్వుగా
పుట్టించినా స్వీకారమే గానీ,
ఈ దీనురాలి కోరికను ఒక్కసారి మన్నించవా ప్రభూ..!!

19 April 2011

ఇది నా మతం





   కులం మతం
   మానవ కల్పితం...
   పిల్లల హృదయం
   తెల్లని కాగితం...
   దానిపై మనం ఏది రాస్తే
   అదే శాశ్వతం...
   అందుకే లిఖిద్దాం
   సగం మంచితనం,
   సగం మానవత్వం!

నల్ల మచ్చల తెల్ల పిల్లి

ఎక్కడ్నుంచి వచ్చిందో మరి
ఓ నల్ల మచ్చల తెల్ల పిల్లి పిల్ల
ఓ రోజు పొద్దున్నే లేచి చూడగానే
ఇంటిగుమ్మం ముందు కూర్చుని ఉంది
ఎంత ముద్దుగా ఉందో..!
మమ్మల్ని చూస్తూనే 'మ్యావ్‌..మ్యావ్‌' మంటూ అరిచింది
అయ్యో..ఆకలిగా ఉందేమోనని,
వెంటనే పాలు పట్టించాం
గటగటా తాగేసి నాలుకతో మూతంతా నాక్కుంది
ఆరోజు నుండీ మొదలైంది...
రోజంతా ఇంటిపట్టునే ఉంటుంది
ఆకలేస్తే అరుస్తుంది
దగ్గరకొచ్చి తోకతో రాస్తుంది
ఆకలి తీరగానే
ఓ చిన్నసైజు పులిలా, ఠీవిగా నడుచుకుంటూవెళ్తుంది
రోజూ ఉదయాన్నే హుషారుగా గెంతుతూ
చెట్లెక్కుతూ దిగుతూ ఆడుకుంటుంది
ఉన్నట్టుండి ఏమైందో...?
ఒక రోజు ఏడ్చుకుంటూ,
ఒక కాలు ఈడ్చుకుంటూ దగ్గరకొచ్చింది
దాన్ని చూసి హృదయం తరుక్కు పోయింది
ఎవరైనా కొట్టారో లేక ఏ స్కూటరైనా గుద్దిందో..
పాలు పొస్తే తాగి, బాధతోనే అరుచుకుంటూ వెళ్లిపోయింది
రెండు రోజులైనా తిరిగి రాలేదు
ఇంటిచుట్టూ వెతికాం, కనబడలేదు
ఆరో రోజు దొరికింది
అవుట్‌ హౌస్‌ సామాన్ల గదిలో బల్ల కింద దాక్కునుంది
తిండిలేక చిక్కి శల్యమైంది
ఎవర్నీ దగ్గరకు రానివ్వట్లేదు
కళ్లు లోపలికి పోయి బక్కచిక్కి రూపమే మారిపోయింది
ఓ చిన్న పిల్లి దెయ్యంలా కనపడింది
పట్టుకోబోతే పారిపోతుంది
కాలు నొప్పితో భీకరంగా అరుస్తుంది
దాని వాలకం చూసి ఒక్కసారి కళ్లు చెమ్మగిల్లాయి
ఎలా ఉన్న పిల్లి ఎలా అయిపోయింది
ఎలాగోలా దాన్ని పట్టుకొని ఇంట్లో ఓ గదిలో పెట్టాం
సమయానికి పాలు పట్టించాం
డాక్టరిచ్చిన మందు పాలల్లో కలిపాం
నాలుగు రోజుల్లో కొంచెం కోలుకుంది
వారం రోజుల్లో మామూలైంది
ఇప్పుడు కొంచెం కుంటుతుంది
కానీ నొప్పి బాగా తగ్గిందేమో
మళ్లీ గెంతడం దూకడం మొదలెట్టింది...
అదలా హాయిగా, ఆనందంగా తిరుగుతుంటే
మాకేదో పోయిన సంతోషం తిరిగొచ్చినట్లనిపిస్తుంది!
మాకు బాగా కావలసిన వ్యక్తి
మా కళ్లెదురుగా తిరుగుతున్నట్లనిపిస్తుంది!!

18 April 2011

వివేకం







ఎక్కి దిగితే ఏం లాభం
రోజూ గుడిమెట్లు...?
ముందుగా సరిదిద్దుకుందాం
మనలో ఉండే లోటుపాట్లు!

పుస్తకమే సమస్తం

నాకు బాగా పుస్తకాలు కొనే అలవాటు
ఎందుకో నాకు పుస్తకాలంటే చాలా ప్రేమ
ఎక్కడైనా పుస్తకాల దుకాణం కనబడితే చాలు
నా కాళ్లు వాటంతటవే అటు నడుస్తాయి
ఎన్ని పుస్తకాలు కొన్నానో...ఇప్పటివరకూ..!
నా పుస్తకాల పిచ్చి ఇంట్లో వాళ్లకు అస్సలు నచ్చదు
'ఎందుకండీ డబ్బులలా తగలేస్తారు..
చదివేది లేదుగానీ తెగ కొనేస్తారు ' -
అంటూ మా ఆవిడా...
'డాడీ పుస్తకాలు కొన్న డబ్బుల్తో
నాకెన్ని పిజ్జాలొచ్చేవో' -
అని మావాడూ...
నన్ను ఏడిపిస్తూ ఉన్నా
నేను పుస్తకాలు కొనడం మాత్రం ఆపను!
మా ఇల్లో పెద్ద గ్రంథాలయం
ఎక్కడ చూసినా పుస్తకాలే
పుస్తకాన్ని మా వాళ్లు తేలిగ్గా తీసిపారేసినా
నాకు మాత్రం అదే సమస్తం..!
జీవిత గమనంలో చిక్కు ప్రశ్నలు ఎదురైనప్పుడు,
జీవితంలో ఓడిపోయానేమోనని అనిపించినప్పుడు,
బ్రతుకు భారంగా తోచినప్పుడు...
నన్నాదుకునేవి, నాలో తిరిగి నమ్మకం నింపేవి ఆ పుస్తకాలే...
అందుకే......
పుస్తకమే నా నేస్తం..
పుస్తకమే నా గురువు...
పుస్తకమే నాకు దైవం!!

చెట్టులాంటి మనసు

ఈ ప్రపంచంలో
నీ కన్నిటికన్నా ఇష్టమైనదేదీ అని
ఎవరైనా అడిగితే
'చెట్టు' అని టక్కున చెప్పేస్తా -
చెట్టుకున్న మంచితనం,
చెట్టుకున్న దయాగుణం,
చెట్టుకున్న ఆదర్శ భావం..
మరి దేనికీ ఉండదేమో..!
చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా
చూపులన్నీ జన్మనిచ్చిన నేలమీదే నిలుపుతుంది
దాని కొమ్మలన్నీ విరిచినా
నీ ఇల్లై తలదాచుకొమ్మంటుంది
దానికి నీరు పోయకున్నా
నీ దాహం తీర్చడానికి
మేఘాలను కురిపిస్తుంది
ఆ వర్షంలో తడిచి నువ్వెక్కడ ముద్దవుతావోనని
మళ్లీ నీ గొడుగవుతుంది
అది పండించుకున్న పళ్ళన్నీ కోసుకుతిన్నా
పల్లెత్తుమాటనుకుండా మళ్ళీ మళ్ళీ కాస్తుంది
తను ఎండకు రగులుతున్నా
నీకు నీడనివ్వడానికి తహతహలాడుతుంది
నువ్వు వండుకు తినడానికి నిప్పవుతుంది
నీ ఆరోగ్యం చెడిపోతే
నీకు మందవుతుంది
చివరకు నువు పోయినప్పుడు
నిను కాల్చడానికి కట్టెవుతుంది
దాన్ని మొదలంటా నరికినా
నిన్ను పలకరించడానికి మళ్లీ చిగురిస్తుంది
అందుకే....
నన్ను చెట్టంత మనిషిని చెయ్యకపోయినా ఫరవాలేదు..
చెట్టులాంటి మనసు మాత్రం తప్పక ఇవ్వమని
ఆ దేవుణ్ణెప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను!

16 April 2011

ప్రార్థన







నీకోసం నువు ప్రార్థిస్తే
అది స్వార్థం!
ఇతరులకోసం అర్థిస్తే
జన్మ చరితార్థం!!

వింత రాజకీయం





ప్రజాస్వామ్య వ్యవస్థలో
వారసత్వ పోరు!
వారసత్వ పోరులో...
మారుతున్న వరసలు,
పెరుగుతున్న వలసలు!!

నా బాల్యం నాక్కావాలి!

నా బాల్యం నాక్కావాలి -
చిన్నప్పుడు ఎంత హాయిగా,
ఆనందంగా ఉండేది..!
ఎంచక్కా స్నేహితులతో
ఆడుకుంటూ పాడుకుంటూ...
ఎలాంటి చీకూ చింతా లేకుండా...
ఎటువంటి అరమరికలూ లేకుండా...
ఆ రోజులు మళ్లీ తిరిగొస్తే ఎంత బావుండు!
దేవుడా..! నేనేం పాపం చేశానని
నా బాల్యాన్ని నానుండి దూరం చేశావ్‌?
నా బాల్యాన్ని నాకు తిరిగిచ్చెయ్‌!
గట్టిగా అరవాలనిపించిది -
అప్పుడు వినిపించిందొక అశరీర వాణి
పిచ్చివాడా... నీ బాల్యం నాదగ్గరెక్కడుంది?
అది నువ్వే ఎప్పుడో, ఎక్కడో పోగొట్టుకున్నావ్‌!
బాల్యంలోని అమాయకత్వం,
నిర్మలమైన మనసు,
మనిషికి కులం మతం కూడా ఉంటాయని
తెలియని వయసు...
అన్నీ పోగొట్టుకున్నది నువ్వు కాదా?
వాన నీటిలో వదిలిన కాగితప్పడవలు,
సంక్రాంతి పండక్కి ఎగరేసిన రంగురంగుల గాలిపటాలు,
పిల్లకాలువల్లో స్నేహితులంతా కలిసి వేసుకున్న ఈతలపోటీలు...
ఇవన్నీ మరచిపోయింది నువ్వే కదా!
నీ బాల్యం నువ్వే చేజార్చుకొని
ఎవరో లాక్కున్నట్టుగా
ఎందుకా ఏడుపులు...?
లాగి కొట్టినట్టనిపించింది
అవును...నిజమే కదూ...!
నా బాల్యం కనుమరుగవడాని కారణం నేనే
దాన్ని మళ్లీ పొందడం  నాచేతుల్లోనే ఉంది
అవును -
ఇప్పుడు....
నాకెప్పుడు కావాలంటే అప్పుడు
నా బాల్యంలోకి తొంగిచూడగలుగుతున్నాను!!

15 April 2011

వసంత కోకిల



ప్రతి వసంత మాసంలో
ఆ కోకిల అక్కడకు వస్తుంది
ఆ చెట్టుమీద కూర్చుని
మధురంగా పాడుతుంది
ఈసారి కూడా వసంతం వచ్చింది
ఆ కోకిల కూడా వచ్చింది
కానీ...  పాడలేదు
ఎందుకంటే -
అక్కడ అది కూర్చునే చెట్టు లేదు
కొన్ని రోజుల క్రితమే
ఆ చెట్టును
రోడ్డు వెడల్పు చెయ్యాలంటూ కొట్టేసారు!!

నేను ప్రేమించాను!

నేను ప్రేమించాను -
ఉదయించే సూర్యుని కిరణాల్లోని
వెచ్చదనాన్ని ప్రేమించాను
వెన్నెల రాత్రి చందమామ కురిపించే
చల్లదనాన్ని ప్రేమించాను
గుబురుగాపెరిగిన వృక్షజాలం కనబరచే
పచ్చదనాన్ని ప్రేమించాను
కల్లా కపటం తెలియని పసివాడు చిందించే
బోసినవ్వును ప్రేమించాను
చీకటిని తరిమేస్తూ వెలుగును వెదజల్లే
చిరుదివ్వెను ప్రేమించాను
కల్మషంలేని హృదయంతో పలకరించే
స్నేహితుడి పిలుపును ప్రేమించాను
ప్రేమతో తలనిమిరే
తల్లి ఆప్యాయతను ప్రేమించాను
నేనున్నానంటూ వెన్నుతట్టే
తండ్రి ఆలంబనను ప్రేమించాను
భోజనానికి టైమైంది లేవండంటూ రాగంతీసే
అర్థాంగి అనురాగాన్ని ప్రేమించాను -
ఇంత ప్రేమను పదిలంగా దాచుకున్న నాకు
ఈ ప్రపంచంలో ఇక లేనిదంటూ ఏముంది..?

14 April 2011

కవితా నా కవితా!

ఓ మంచి కవిత రాయాలని
కలం కాగితం ముందేసుక్కూర్చున్నా
ఏ కవిత రాయాలో అర్థం కాలేదు-
భావ కవిత రాద్దామంటే
అన్నీ భాషకందని భావాలే,
విప్లవ కవిత రాయాలనుకుంటే
అన్నీ తిరగబడుతున్న ఆలోచనలే,
అభ్యుదయ కవిత మొదలెడదామంటే
అన్నీ బద్దకపు ఛాయలే,
మానవతావాద కవిత సరే అనుకుంటే
అన్నీ వెక్కిరిస్తూ మీద పడుతున్న మానవ శకలాలే,
సంప్రదాయ కవితకు శ్రీకారం చుడదామంటే
అన్నీ 'సారీ' అంటూ జారుకుంటున్న పదాలే,


అనుభూతి కవితైనా పోనీలే అనుకుంటే
అన్నీ భూతాలై భయపెడుతున్న జ్ఞాపకాలే,
ఇక నా వల్ల కాదని లేచి వెళ్లబోతుంటే
మరి 'నన్నేం చేస్తావ్‌' అంటూ ఎదురుపడింది
అప్పటికే ముస్తాబైన నా కవిత!

మంచికి లోకం దాసోహం

రాముడు, కృష్ణుడు దేవుళ్లు
మనమంతా మనుషులం-
దేవుళ్లకీ మనిషికీ
ఏమిటీ తేడా?
ఏ తప్పూ చేయని వాడే దేవుడైతే
మరి తప్పు చేయడానికే మనిషా?
రాముడు ఆ తప్పు చేశాడూ
కృష్ణుడు ఈ తప్పు చేశాడూ
వాళ్లెలా దేవుళ్లవుతారూ అని
మనం దేవుళ్లను నిలదీస్తున్నాం
ఒకటీ రెండు తప్పులకే
దేవుళ్లు దైవత్వాన్ని కోల్పోతే
రోజుకు వంద తప్పులు చేసే మనిషి
తన మానవత్వాన్ని పోగొట్టుకోలేదా?
మనిషితత్వం విడిచిపెట్టలేదా?
మనిషి మనిషిగానే మిగలనప్పుడు
మానవత్వం మచ్చుకైనా కనిపించనప్పుడు
దేవుణ్ణి తప్పు పట్టే హక్కు
మనిషికి దక్కుతుందా?
అలాగే -
మనిషి మనిషిగా మారినప్పుడు
మంచితనం, మానవత్వం
నిండుగా పెంచినప్పుడు
ఆ దేవుడికైనా....
మనిషికి దాసోహం అనక తప్పుతుందా??

సర్కస్‌ రా ఇది సర్కస్‌!







రెయిల్స్‌ తప్పిన
బ్రతుకు తెరువు!
బేలన్స్‌ తప్పని
తలమీది బరువు!!

13 April 2011

నా బాట నే వేసుకుంటూ...

నాది పూల బాట కాదు,
ఇక్కడ ముళ్ల పొదలు
దట్టంగా పెరిగి ఉన్నాయ్‌-
నామార్గం సుగమం కాదు,
ఇది దుర్భేద్యమైన కీకారణ్యం-
ఇక్కడ కాలకూట సర్పాలూ
పదునెక్కిన చురకత్తులూ
అడుగడుగునా
అడ్డుపడుతుంటాయ్‌-
అయినా ఆగదు నా ప్రస్థానం
ముళ్లపొదల్నితెగనరుక్కుంటూ
కాలసర్పాల్ని కత్తిరించుకుంటూ
చురకత్తుల్ని తుత్తునియలు చేసుకుంటూ
నా బాట నేనే వేసుకుంటూ
ముందుకు సాగిపోతా!
కొన ఊపిరితోనైనా సరే
నా గమ్యం చేరుకుంటా!!
విజయ పతాకాన్ని ఎగురవేస్తా!!!

ఆ పక్షుల రవళినై...

అడవంటే నాకు ప్రాణం
అడవిని తలచుకోగానే
నాకు ఎక్కడలేని ఆనందం కలుగుతుంది
అడవికి వెళ్తున్నామనుకోగానే
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తాను
అడవిలోని ప్రశాంతత, పచ్చదనం అంటే
నాకెంతో ఇష్టం
అడవిలోని పెద్ద పెద్ద చెట్లు
ఎప్పటినుంచో తపస్సు చేసుకుంటున్న
ఋషుల్లా కనిపిస్తాయి
వాటిని స్పృశించాలని
వాటి నీడలో నిదురించాలని
ఎంతో ఆశగా ఉంటుంది
చిరుగాలికి ఆ చెట్లు చేస్తున్న సవ్వడి
నాకు ప్రకృతి పాడుతున్న
మధుర గానంలా వినిపిస్తుంది
ఆ పక్షుల కిలకిలా రవాలు
ఆ సెలయేటి గలగలలు
ఆ అడవిపూల పరిమళాలు
నన్ను ఏదో లోకం లోకి
తీసికొని వెళతాయి
నేను -
ఆ పక్షుల రవళినై
ఆ సెలయేటి నురగనై
ఆ పూవుల పుప్పొడినై
ఆ అడవిలో అదృశ్యమై పోవాలనిపిస్తుంది -
అడవంటే నాకు అంత ప్రాణం!!

12 April 2011

ఏమీ సేతురా రామా!





రామ రాజ్యం
రావాలన్న మన కల -
రావణాసురులు
రాజ్యమేలుతున్నంత కాలం
తీరేదెలా?
మనం -
రామ రామ కృష్ణ కృష్ణ
అనుకుంటూ
కూర్చోవలసిందేనా ఇలా??

పార్టీ ఎజెండా






చచ్చో చెడో
అధికారంలోకి
వస్తే చాలు!
ఆ దేవుడికే
వదిలేద్దాం
ప్రజల మేలు!!

11 April 2011

నాతో నేను



ఒంటరితనమంటే
చాలామందికి భయం
నాకెందుకో..
ఒంటరిగా ఉండటమే ఇష్టం
నేను ఒంటరిగా ఉన్నప్పుడు
మనుషులకు దూరంగా ఉంటానేకానీ
నా ఆలోచనలెప్పుడూ
నన్ను చుట్టుముట్టే ఉంటాయి
నా ఆశలూ ఆశయాలూ
అనుభవాలూ జ్ఞాపకాలూ
నాతో ఉన్నంత కాలం
నేను ఒంటరినెలా అవుతాను?

ఒంటరితనం లోతుల్లో...

యాంత్రిక జీవనంతో
విసిగి వేసారి
దానికి దూరంగా
సుదూరంగా వెళ్లాలని
తలుపులు బిగించుకొని

కళ్లు మూసుకొని
నా గదిలో ఒంటరిగా కూర్చున్నా...
   నా కళ్ల ముందు
   ఏవో దృశ్యాలు...
   ముందు అస్పష్టంగా
   ఆ తరువాత చాలా స్పష్టంగా -
అప్పుడే పుట్టిన పసికందును
గుడిమెట్లమీద వదల్లేక వదల్లేక వదిలేసి

ఏడుస్తూ వెళుతున్న
ఓ తల్లి దృశ్యం -
   తైల సంస్కారం లేని జుట్టుతో
   చిరిగిన బట్టలతో
   దుమ్మూ ధూళీ పట్టిన ముఖాలతో
   నాలుగు రోడ్ల కూడలిలో
   భిక్షమెత్తుకుంటున్న
   చిన్నారి బాలల దృశ్యం -
జీవితం మీద ఆశ అడుగంటి
నిస్తేజమైన కళ్లతో
ప్రాణమున్న కళేబరాల్లా
ఎవరికోసమో ఎదురు చూస్తూ
బ్రతుకు ఈడుస్తున్న ముసలివాళ్ల దృశ్యం -
   చప్పున కళ్లు తెరిచా
   ఒక్క ఉదుటున ఇంటినుంచి బయట పడ్డా
   ఇప్పుడు నాకు
   జీవితం యాంత్రికం అనిపించడం లేదు
   ఎందుకంటే...నాకు తెలుసు -
   నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని!!

10 April 2011

స్వయంకృతాపరాధం




నోట్లున్నవాడు
ఓట్లుకొని
కోట్లు సంపాదిస్తుంటే -
ఓట్లమ్ముకున్నవాడు, పడరాని
పాట్లు పడుతూ
కాట్లోకా, ఏట్లోకా అని
ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు!

నేటి భారతం



ఆలుగడ్డలమ్మినవాడు
రాజకీయాల్లో చేరి
కోట్లకు పడగెత్తే స్థితి!
కాయ కష్టం నమ్మినవాడు
తినడానికి తిండిలేక
ఆలుబిడ్డలనమ్మాల్సిన పరిస్థితి!!

09 April 2011

మగాడే యముడు



ప్రతి పురుషుడి
విజయం వెనుక
ఓ స్త్రీ!
ప్రతి స్త్రీ
విషాదం వెనుక
ఓ పురుషుడు!!

నవలోకపు దారుల్లో...

అనాథలారా అభాగ్యులారా
పీడితులారా బాధితులారా
దగాపడ్డ తమ్ముళ్లారా
దిగాలు పడ్డ చెల్లెళ్లారా...
రండి -
చేతులు కలపండి -
నవలోకపు దారులగుండా
బారులు తీరి నడవండి...
బీడువారిన పొలాలనన్నీ
పదునెక్కిన హలాల దున్నీ
దుఃఖాలన్నీ ఛిద్రం చేసి
సుఖాలను నిర్మించుకుందాం!
మన కృషితో పండించిన
ఫలాలను మనమే దక్కించుకుందాం!!

08 April 2011

మానవత్వమా నీవెక్కడ?

రాతి యుగం నుంచి
రాకెట్‌ యుగం వరకూ
ఎదిగాడు మనిషి
తన విజ్ఞాన పరిజ్ఞానంతో
సృష్టికి ప్రతిసృష్టి చేసే
దశకు చేరుకున్నాడు -
ఈ మహాప్రస్థానంలో...
తనకున్న మానవత్వమనే
ఒకే ఒక్క విలువైన ఆభరణాన్ని
ఎక్కడో పోగొట్టుకున్నాడు -
దానికోసం నిరంతరం
వెతుకుతూనే ఉన్నాడు,
అది కనిపించక
తల్లడిల్లుతూనే ఉన్నాడు -
ఈ వెతుకులాట
ఎప్పుడు ఆగేనో?
ఆ మానవత్వం
ఎప్పుడు దొరికేనో??

ఇక్కడ పులులున్నాయ్‌ జాగ్రత్త!

   ఇక్కడ -
   బలవంతులు చెప్పేవే నీతులు
   రాక్షసులు చేసేవే చట్టాలు
   దెయ్యాలు వల్లించేవే సూక్తులు...
   కంచెలు చేలను మేసినా
   తోడేళ్లు మేకల్ని కొరికి చంపినా
   కాపలాదారులే

   ఇంటికి కన్నం వేసినా
   అడగడానికి వీల్లేదు...
   ఎందుకంటే -

   ఇది ఆటవిక రాజ్యం
   ఇక్కడ వాళ్ళే రాజులు!
   వాళ్ళవే రోజులు!!

07 April 2011

సమ్మతం






మతం మత్తులోజరిగిన
మారణ హోమంతో
గతమంతా
నెత్తుటి మరకలే -
ఇకనైనా ఆహ్వానిద్దాం...
సర్వమత సమ్మతాన్ని,
సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని!

అతడు తనను తాను జయించాడు

అతడు -
అందరికీ ఉపయోగపడేదే
మంచి అని నమ్ముతాడు
తను నమ్మిందే చేస్తాడు
ఎవరేమనుకున్నా పట్టించుకోడు
ఎదుటివాడు ఎదుగుతున్నాడని
ఏమాత్రం బాధపడడు
పొరుగువాడితో
తననెప్పుడూ పోల్చుకోడు
నలుగురికి సహాయపడటమే
ఉత్తమం అనుకుంటాడు
దానికోసం తన తలను తాకట్టు
పెట్టడానిక్కూడా వెనుకాడడు
అందరూ సంతోషంగా ఉండాలని
దేవుణ్ణి ప్రతి రోజూ ప్రార్థిస్తాడు
అతనికి తర తమ అనే భేదం లేదు
అతడు డబ్బూ దర్పం కంటే
మానవ సంబంధాలే గొప్పవనుకుంటాడు
అతనికి బ్రతుకు మీద ఆశ లేదు...
చావంటే భయం లేదు...
అవును -
అతడు తనను తాను జయించాడు!!

06 April 2011

పొదివి పొదివి ఏడ్చినా...



ఇంకిన బావిని
ఎంత తోడినా
దొరకవు గుక్కెడు నీళ్లు...
ఎండిన గుండెను
ఎంత పిండినా
రాలవు చుక్క కన్నీళ్లు!

05 April 2011

ఋతు గతులు







కాకి అరుపుకు
కోకిల పిలుపుకు
తేడా..ఉగాది చెబుతుంది,
శిశిరమెప్పుడో..వసంతమెన్నడో
అన్నది కాలమే నిర్ణయిస్తుంది!

అంతా ప్రేమమయం





ఒకే ఒక్క పలకరింపు
లక్ష హృదయాలకు స్వాంతన!
ఒకే ఒక్క చిరునవ్వు
కోటి బంధాలకు వంతెన!!

జగమే మాయ




మాట కృత్రిమం
మమత కృత్రిమం
నవ్వు కృత్రిమం
నడత కృత్రిమం
బంధాలూ,
అనుబంధాలూ కృత్రిమం-
ఇవన్నీ కృత్రిమమైనా
కనీసం గుండైనా
అసలుదనుకున్నా -
అది కూడా కృత్రిమమైపోయింది??

04 April 2011

శ్రీకారం



చుట్టాలి శ్రీఖరం -
శుభకరం..
సంతోషకరం..
ఆరోగ్యకరమైన
నూతన సంవత్సరానికి
శ్రీకారం!

కొత్త పోకడలు



ఎమ్మెన్సీ కొలువులు
మారుతున్న విలువలు -
గివెనప్‌ ఇన్‌హిబిషన్స్‌
లివిన్‌ రిలేషన్‌షిప్స్‌...
లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌
డైవోర్స్‌ ఓవర్‌ ఎ స్మాల్‌ ఫైట్‌...
వ్యక్తి స్వాతంత్ర్యం
ఎట్‌ ఇట్స్‌ హైట్స్‌!!

తెలుగు సౌరభం


రవికిరణం సోకగానే
కమలం వికసించినట్టు..
చంద్రకాంతి తాకగానే
కలువరేకు మెరిసినట్టు..
తెలుగువారి ప్రతి ఇంటా,
ఉగాది పండుగ పూట...
తెలుగుశోభ గుభాళించు
గులాబీలు విరిసినట్టు!

03 April 2011

అమ్మ ఎప్పటికీ అమ్మే

       అపుడెపుడో నిద్రలేచిన మహిళాలోకం
       రాకెట్‌ లా దూసుకు పోతుంది
       చట్టసభల్లో స్థానం సంపాదించింది
       న్యాయ వ్యవస్థలో పట్టు సంపాదించింది
       వ్యాపార రంగంలో ముందడుగువేసింది -
       ఇవన్నీ మా అమ్మకు పట్టవు
       ఆమెకు అప్పటికీ ఇప్పటికీ
       వంటిల్లే దేవాలయం
       తన చేత్తో వండి తినిపిస్తేనే
       ఆమెకు ఆనందం, తృప్తి -
       ఇదంతా చూసిన నాన్న
       పోన్లే అనీ....
       వంటింటికి అమ్మపేరు పెట్టి
       వంటింట్లో గిన్నెలన్నిటిమీదా
       అమ్మ పేరే రాయించాడు
       అంతే తేడా.....
       అమ్మకు సంతోషమే
       ఎందుకంటే....
       మా అమ్మ ఇప్పటికీ ఎప్పటికీ అమ్మే!

స్థిత ప్రజ్ఞత




అన్నీ ఉన్నా
ఏమీ లేనట్టు -
ఏమీ లేకున్నా
అన్నీ ఉన్నట్టు -
ఏమున్నా లేకున్నా...
ఎప్పుడూ ఒకేలా ఉండటమే
మనిషి పరాకాష్టకు ప్రతీక!