21 April 2011

నేనింకా బ్రతికే ఉన్నానా?



నేను చూశాను -

వీథిలో విసిరేసిన
ఎంగిలిమెతుకుల కోసం
ఊర కుక్కలతో ఒక వైపు
బొంత కాకులతో మరో వైపు
భీకర పోరాటం సాగిస్తున్న
ఒక అనాథ బాలుడి ఆకలి మంటను చూశాను...
కన్నపిల్లలకు పట్టెడన్నం పెట్టలేక
వంట్లో పని చేసే శక్తి లేక
అనారోగ్యంతో మూలుగుతూ
ఒక తల్లి పడుతున్న ఆవేదన చూశాను...


పంటలన్నీ వరద పాలై
చేసిన అప్పులు నాలుగింతలై
ఎలా బ్రతకాలో తెలీక
పురుగులమందు తాగి చావడానికి సిద్ధమైన
ఒక రైతు నిస్సహాయతను చూశాను...
ప్రేమించని పాపానికి
ఉన్మాది ప్రేమికుడొకడు
యాసిడ్‌ మీద విసిరితే
మొహమంతా కాలిపోయి
ఓర్వలేని బాధతో అల్లాడుతున్న
ఒక యువతి ఆక్రందన చూశాను...
ఆడపిల్లగా పుట్టిన నేరానికి
కోపోద్రిక్తుడైన తండ్రి
తనను నేలకేసి మోదితే
ప్రాణాలు వదులుతున్న
ఒక పసిగుడ్డు ఆఖరి శ్వాస చూశాను...
కని పెంచిన పిల్లలే కర్కోటకులై
మీ చావు మీరు చావండని వదిలేస్తే
అటు చావలేక ఇటు బ్రతకలేక
జీవశ్చవాల్లా మిగిలిఉన్న
వృద్ధ దంపతుల కన్నీటి ధార చూశాను...
ఇవన్నీ చూస్తూ....
నేనెందుకు ఇంకా బ్రతికి ఉన్నానో అర్థంకాక
నిస్సహాయుడినై...నిశ్చేష్టుడినై
అలా చూస్తూనే నిలుచుండి పోయాను!!

4 comments:

  1. మన చుట్టూ జరిగే కన్నీటి గాధలు చూస్తూ నిసహాయంగా బ్రతికే మనిషి బ్రతుకు మీ మాటల్లో ప్రతిబింబిస్తుంది.

    ReplyDelete
  2. kevalam chooddamenaa chesedemainaa unda? mastaaru.....!!!

    ReplyDelete
  3. చిన్ని ఆశ గారు, మీ స్పందనకు చాలా కృతజ్ఞతలు..!

    ReplyDelete
  4. వినోద్, prati manishiki choose hrudayamu, chese chetulu, rendoo undaali. mundu chooda galigitene kadaa taruvaata cheyagaligedi..anyhow thank you for your concern!!!

    ReplyDelete