ఓ నేస్తమా!
బాగున్నావా?
ఈ సమయంలో ఎం చేస్తున్నావో?
నేనైతే నీ అలోచనలతో
సతమతమవుతూ ఉన్నాను
నాకైతే నిన్ను తలచుకోని
క్షణమే లేదంటే నమ్ము!
నీకింకో విషయం చెప్పనా...?
నాక్కావలసినప్పుడల్లా
నీతో మాట్లాడుతూ ఉంటాను -
నిన్నే చూస్తూ.....
నీ ప్రతి కదలికనూ గమనిస్తూ....
నీతో గంటలకొద్దీ గడుపుతాను -
నీకివేం తెలీదు కదూ!
అవున్లే...!
నీకంత తీరికెక్కడ?
నీకోసం అహర్నిశలూ పరితపిస్తూ
నీ పేరే అనుక్షణం జపిస్తూ
నా ప్రతి ఊహలో, ఆశలో, ఆలోచనలో
నిన్నే మోస్తూ, నీకై తపిస్తూ
ఇక్కడొక జీవి చస్తూ బ్రతుకుతుందని
నీకెక్కడ ఎరుక...?
నీకు వీలైతే...
నీకు తీరిక దొరికితే...
నీ స్మృతి పథంలో నేనెప్పుడైనా
తళుక్కున మెరిస్తే...
ఒక్క క్షణం నాగురించి ఆలోచిస్తావు కదూ!
నా హృదయరాగ తరంగాలకు
ఒక్కసారి స్పందిస్తావు కదూ!!
నువ్వు బయటకెళ్తున్న ప్రతిసారీ
'జాగ్రత్త నాయనా' అంటూ
నీకోసం కంగారు పడుతూ చెప్పేది అమ్మ
నువ్వు తిరిగొచ్చేదాకా
మనసు మనసులో ఉండేది కాదు అమ్మకు
అమ్మెప్పుడూ అంతే
ఊరికే కలత చెందుతుంది -
అని కొట్టిపారేసేవాడివి నువ్వు
కానీ నీకు తెలియని విషయం ఒకటుంది
ఆ అమ్మ ఆశీస్సులతొనే
నువ్వు ఇంతవాడవయ్యావు!
ఈ రోజున నువ్వెక్కడున్నావో..?
ఎంత ఎత్తు ఎదిగావో..?
ఇప్పుడు అమ్మగురించి ఆలోచించడం నీ వంతు -
ఒక్కసారి అమ్మను తలచుకో!
అమ్మ జాగ్రత్తగా ఉందో లేదో తెలుసుకో!!
దేనికీ భయపడుతున్నావ్?
ఎవరో తరుముతున్నట్టు
గస పెడుతున్నావ్?
నీ కాళ్లకింద మట్టి చెదిరేలా,
నీ ఊపిరి బిగపట్టుకు పోయేలా,
నీ గుండెచప్పుడాగిపోయేలా,
నీ రక్తం గడ్డకట్టి పోయేలా...
ఎందుకు భయపడుతున్నావ్?
భయపడకు! భయపడకు!
ఏ రక్కసి..నీ ఆకలికన్న
భయంకరమైనది?
ఏ భూతం..నీ దరిద్రం కన్న
పెనుభూతమైనది?
ఏ ఊళ..నీ బాధకన్న
కఠోరమైనది?
ఏ బడబాగ్ని..నీ జఠరాగ్ని కన్న
తీవ్రమైనది?
ఏ కాలనాగు..నీ దుస్థితికన్న
విషపూరితమైనది?
ఏ పెను తుఫాను..నీలో రగులుతున్న
దావానలం కన్న వేగమైనది -
యుగ యుగాల దాశ్యంలో...
శతాబ్దాల జాఢ్యంలో...
నీ రక్తం మరిగి మరిగి,
నీ నరాలు సడలి సడలి,
నీ చర్మం కమిలి కమిలి...
వెలివేసిన వాడల్లో
మలినమైన జాడల్లో
కుళ్లి కుళ్లి వడలి వడలి
రాతిలా రాటుదేలి
ఉక్కువై శక్తివై
రణ రంగపు యుక్తివై
రంకెలేస్తు పరుగులెడుతు
కదంతొక్కుతున్న నీకు
భయమెందుకు? భయమెందుకు?
దేనికీ భయపడకు! భయపడకు!
ఎటువైపు చూసినా
ఎవరి పనుల్లో వాళ్లు
తలమునకలుగా
తిరుగుతున్న మనుషులే -
అవును మరి.....
ఎవరి బండి వాళ్లు
లాక్కోవాలికదా..!
మరి నేనెవరితో మాట్లాడాలి?
నాలో ఉవ్వెత్తున చెలరేగుతున్న
భావాలను ఎవరితో పంచుకోవాలి?
ఈ పక్షులే నయం -
'కూహూ' అంటే 'ఓహో' అంటూ
బదులైనా ఇస్తాయి...
ఈ చెట్లే సుఖం -
పలకరిస్తే తిరిగి
తలలూపుతూ మాట్లాడ్డానికి
ప్రయత్నమైనా చేస్తాయి..
ఈ నదులైనా ఒకింత మేలు -
ఒడ్డున చేరితే చల్లని గాలులతో
సేదైనా తీరుస్తాయి
ఆఖరికి భూమిలో పాతుకుపోయి కూర్చున్న
ఈ కొండలు కూడా ఫరవాలేదు -
ఏమన్నా చెబుతుంటే
ప్రశాంతంగా వింటాయి
నాబాధంతా ఈ మనుషులతోనే...
వాళ్లకు ఎప్పుడు తీరిక దొరుకుతుందో?
నాతో ఎప్పుడు మాట్లాడతారో??
ధర్మానికి అధర్మానికి పోరాటం
సత్యానికి అసత్యానికి చెలగాటం
పుణ్యానికి పాపానికి కొట్లాట
దేవుడికీ దెయ్యానికీ యుద్ధం
మంచికీ చెడుకీ పోటీ
నీతికి అవినీతికి కలహం
ఈ మహాయుద్ధంలో గెలుపెవరిది?
ప్రస్థుత పరిస్థితుల్లో అయితే
దేని బలం ఎక్కువైతే దానిది
చివరికి మాత్రం ఎవరిది ఒప్పైతే వారిదట -
కానీ చివరికి మిగిలేదెవరు?
ఈలోపల చచ్చేదెవరు, బ్రతికేదెవరు?
చివరికి ధర్మమే గెలిచేదయితే,
అదేదో ముందే గెలవొచ్చుగా..?
యుగాలు వేచే ఓపిక నాకు లేదు
నాకిప్పుడే న్యాయం కావాలి..!
సత్యం ధర్మం ఇప్పుడే గెలవాలి..!
ఎవరైనా వింటున్నారా..?
నేనడిగేది తప్పా..?
తప్పయితే చెప్పండి..
లేదంటే నాతో చేతులు కలపండి!
అన్యాయాన్ని, అసత్యాన్ని, అధర్మాన్ని
ఇప్పుడే నలిపేద్దాం..!!
న్యాయాన్ని, సత్యాన్ని,ధర్మాన్ని
ఇప్పుడే ఇక్కడే గెలిపిద్దాం..!!!
పుట్టే ప్రతివాడూ
పుడతాడు ఎందుకో ఒకందుకు -
ఏదెటుపోతే నాకెందుకు
అని ప్రతిఒక్కడూ అనుకుంటే
మనమిక పుట్టడం ఎందుకు?
పుట్టినా బ్రతకడం ఎందుకు?
రాయీ రప్పా పుట్టా మిట్టా ఉండగా
మళ్లీ మనమెందుకు..??
మనం కలుసుకున్న క్షణాలు
ఎంత మధురమైనవి..!
వలపు వేదికపై
ఒకరి తలపులలో ఒకరు
లీనమై...సంకీర్ణమై..
మోహావేశంతో
మనసులు మూగబోయిన వేళ
కనుసైగలతో ఒకరినొకరు
పలకరించుకుంటున్న తరుణంలో..
హృదయం ఎంత హాయికి లోనవుతుంది!
ఒకరినొకరు వీడే సమయాన
మనసు ఎంత కలత చెందుతుంది
అంతలోనే మళ్లీ రాబోయే కలయిక యొక్క
చిరు ఊహలు మదిలో మెదిలి
కాస్త ఊరటకు లోనై
కదలలేక కదిలిన క్షణాలు
ఎలా మరువ గలను సఖీ...
మరుచటి రోజు
నీకంటే ముందుగా చేరుకొని
నీరాకకై ఎదురుచూస్తూ
క్షణమొక యుగముగా భరిస్తూ
పిల్లతెమ్మెరకు చిగురాకులు
రెపరెపలాడిన ప్రతిసారీ
నీ అడుగుల సవ్వడియేమోనని
ఉలికిపడి చూస్తూ
నిన్ను కలిసే ముందు
నీకై నిరీక్షిస్తూ...
నేననుభవించే తీయని క్షోభ..
నీతో ఉన్న క్షణాలకంటే
అతి మధురముగా నన్ను గాయపరుస్తుంటే...
నీతో కూడిన క్షణమా..?
లేక నిరీక్షణమా..?
ఏది మహా సుఖమో తెలియని
తన్మయ స్థితిలో
కొట్టుమిట్టాడుతున్నానని
నీకెలా తెలుపను ప్రియా..!