01 June 2020

నైట్ డ్యూటీ


రాత్రి బాగా చిక్కబడ్డ  తర్వాత
నా అంతరాత్మ నాకుచెప్పకుండానే
హుటాహుటిన వేటకు బయలు దేరుతుంది,
సంకలో సంచీ వొకటి తగిలించుకొని --

ఆకాశం నుండి రాలిపడ్డ నక్షత్రాలు కొన్నీ...
వాస్తవాల నుండి వేరుపడ్డ ఆవేశాలు కొన్నీ...
జీవితంలో దగాపడ్డ ఆశయాలు కొన్నీ...
నమ్మిన చేతుల్లోనే భంగపడ్డ ఆశలు కొన్నీ..
కొండెక్కిన కోర్కెలు కొన్నీ, 
మండుతున్న కడుపులు  కొన్నీ  --
అన్నీ...సంచీ నిండా నింపుకొని
బిరబిరా తిరిగొచ్చి
నా ముందర గిరాటేస్తుంది.
వాటన్నింటినీ చేర్చి,
ఒకచోట పేర్చి,
అందమైన హారంలా కూర్చమంటుంది...
కుదరదంటే... కూడదంటూ
నా నెత్తిన కూర్చుంటుంది...
ఇక రాత్రంతా నాకు జాగారమే...
నరాలన్నీ  సవరించీ... 
మెదడును మధించీ...
ఆలోచనలను రగిలించీ..
నీలిగీ, నిట్టూర్చీ,  ఆవలిస్తుండగా...
వెలుతురు తెచ్చిన వేడిమికి
చీకటి ఆవిరౌతూ...
భళ్లున  తెల్లవారుతుంది,
నా ప్రయత్నం అర్ధాంతరంగా ముగుస్తుంది --
చీకటి మళ్ళీ చిక్కబడేవరకూ...
నా అంతరాత్మకు విశ్రాంతి!
నాకు శాంతి!!

No comments:

Post a Comment