02 May 2011

ప్రకృతి ఋణం

ఈ ప్రకృతి ఎంత నిస్వార్ధమైనది?
తనలో దాచుకున్న అందాలన్నీ
ఏ ప్రతిఫలమూ ఆశించకుండా
మనకు ఎంత ప్రేమతో పంచుతుంది!
లేకుంటే....
ఈ విరులు..మరులుగొలిపే
సుగంధాలను ఎందుకు వెదజల్లుతున్నట్లు,
ఈ తరులు ఏ కోరికతో
కనులకింపైన పసిమిని నేలంతా పరుస్తున్నట్లు,
ఈ కోయిలలు ఎదను మీటే
మధురగీతాలను ఎందుకు పాడుతున్నట్లు,
ఈ మరీచికలు ఎవరి ప్రాపకానికై
హాయిగొలిపే వింజామరలు వీస్తున్నట్లు,
ఈ తొలకరి చినుకులు ఏ ఆశతో
అణగారిన తనువులను చిరుజల్లుతో తడుపుతున్నట్లు,
ఈ నెమళ్లు ఏ వ్యామోహంతో
అద్భుతంగా పురివిప్పి నాట్యమాడుతున్నట్లు,
ఈ సెలయేళ్లు ఏ కాంక్షతో
సరిగమల గలగలలు వినిపిస్తున్నట్లు,
ఆ ఇంద్ర ధనస్సు ఏ వాంఛతో
అంబరాన సప్తవర్ణాలను చిత్రీకరిస్తున్నట్లు...
ఇంతటి అందమైన అనుభూతిని
మనకు అందించే ప్రకృతి ఋణాన్ని
మనమెలా తీర్చుకుంటున్నట్లు???

No comments:

Post a Comment