04 May 2011

నాకు దేవుడు కనిపించాడు

దేవుడున్నాడా? ఉంటే కనిపించడేం?
దేవుడెలా ఉంటాడు?
ఈ సందేహాలకు సమాధానం దొరక్క
ఎక్కడెక్కడో తిరిగాను
ఎంత దూరమో నడిచాను...
ఊళ్ళూ వాడలూ, కొండలూ కోనలూ
నదులూ సముద్ర తీరాలూ -
ఎంత వెతికినా దేవుడి జాడ దొరకలేదు
నా పట్టూ వీడలేదు
తిరిగి తిరిగి అలసి పోయా
ఓపిక నశించి ఓ చోట కుప్పకూలిపోయా -
ఓ చెయ్యి ప్రేమతో
నీళ్లందించి నా దాహాన్ని తీర్చింది
ఇంకో చెయ్యి ఆప్యాయంగా
అన్నంపెట్టి నా ఆకలి పోగొట్టింది
మరో చెయ్యి కరుణతో
ఔషధమిచ్చి నాకు ఉపశమనాన్ని చేకూర్చింది
వాళ్ళ మంచితనం నా హృదయాన్ని కదిలించింది
ఎక్కడలేని శక్తిని నాకందించింది
తిరిగి మొదలైంది నా శోధన
పోగా పోగా ఒక కొండపై
నాకో అశరీర వాణి వినిపించి
నేనే దేవుణ్ణని చెప్పింది
నువ్వే దేవుడివైతే నాముందు ప్రత్యక్షమై
నాకెందుకు కనిపించవని అడిగా
దానికది నవ్వి
పిచ్చివాడా నువ్వు నన్నెప్పుడో చూశావు
దారిలో నువ్వు శోషతో పడిపోయినప్పుడు
నీ దాహాన్ని తీర్చిన 'ప్రేమ' నే నేను
నీ ఆకలి పోగొట్టిన 'ఆప్యాయత' నే నేను
నీకు ఔషధమిచ్చిన 'కరుణ' నే నేను
ఆ ఊరి వాళ్ళు చూపించిన 'మంచితనమే' నేను
ఇప్పుడు చెప్పు నీకు నేను కనిపించానా లేదా?
అప్పుడు అర్థమైంది నాకు
దేవుడు ఎక్కడున్నాడో...
ఏ రూపంలో ఉంటాడో...
నేనక్కడ్నుండి వెనుదిరిగాను
ఎందుకంటే.....
నాకిప్పుడు తెలుసు..
దేవుణ్ణి ఎక్కడ వెతకాలో!

No comments:

Post a Comment