03 May 2011

స్వేచ్ఛ

ఏ అరమరికలూ లేకుండా..
ఏ చీకటి తెరలూ ముసరకుండా..
ఏ కన్నీటి పొరలూ అంటకుండా..
స్వేచ్ఛగా జన్మించిన నాకు
ఎందుకీ తీరని బంధనాలు?
ఈ వీడని దాశ్య శృంఖలాలు??
ఎందుకు నాకీ కుల మత జాతి వైషమ్యాలు
ఈ ఇజాలూ ఇమేజ్‌ లు
ఈ వేషాలూ భేషజాలు -
ఈ పరువుకోసం పరుగులూ...
ప్రతిష్ఠకోసం ప్రాకులాటలు -
ఏ ఆర్భాటమూ లేని ఆ గాలులు చూడు
ఎంత హాయిగా వీస్తున్నాయో,
ఏ పగ్గమూ లేని ఆ మేఘాలు చూడు
ఆకాశంలో ఎలా విహరిస్తున్నాయో,
ఏ ఆటంకమూ లేని ఆ నదులు చూడు
ఎలా పరవళ్లు తొక్కుతూ పారుతున్నాయో,
ఏ బిడియమూ లేని ఆ పక్షులు చూడు
ఎంత శ్రావ్యముగా పాడుతున్నాయో,
ఏ భయమూ లేని ఆ జలపాతాలు చూడు
ఎంత వెల్లువగా దూకుతున్నాయో,
ఏ చింతా లేని ఆ గిరులు చూడు
ఎంత నిశ్చలంగా కూర్చున్నాయో,
ఏ బింకమూ లేని ఆ తరులు చూడు
ఎంత ఒద్దికగా నిలబడి ఉన్నాయో
వీటన్నిటికీ లేని సంకెళ్ళు నాకెందుకో?
నాకెప్పుడు దొరుకుతుందో మరి
వాటికున్న స్వేచ్ఛ??
ఎప్పుడు తొలగుతాయో మరి
నా చుట్టూ ఉన్న ఇనుపచెరలు???

No comments:

Post a Comment