16 May 2011

అస్థిరత్వంలో స్థిరత్వం

సరళ రేఖలు
ఎప్పటికీ సూటిగానే
పయనించలేవు
వేగంగా ప్రవహించే నదులు
ఎన్నెన్నో మలుపులు తిరక్కుండా
ముందుకు సాగలేవు
ఆలోచనా సరళి
ఎప్పుడూ ఒకేలా ఉండదు
ప్రసరించే కాంతి
ఎన్నో వంకర్లు పోక తప్పదు
మనం పీల్చిన గాలి
ఎన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుందో!
ఏ కొమ్మలు ఎటు పెరిగినా
ఏ వేళ్ళు ఎంత ప్రాకినా
స్థిరత్వం కోసమేగా ఈ ప్రాకులాటంతా..!

ఈ అంతులేని సృష్టిలో
అస్థిర ప్రేరకాలు అనంతమైతే
అస్థిరత్వమే స్థిరత్వం -
ప్రక్క తోవలు పట్టడమే సరళం -
నదులెన్ని మలుపులు తిరిగినా
చివరకు కలిసేది సముద్రంలోనే!
ఆలోచనలెన్ని పుంతలు తొక్కినా
కడకు అంతమయేది అక్షరంలోనే!!

No comments:

Post a Comment