25 February 2013

స్వయం ప్రక్షాళణ




జీవితం  వేళ్ళాడుతుంది..
గోడమీద హేంగరుకు తగిలించిన
మాసిన చొక్కాలా -
రోజంతా దేశ ద్రిమ్మరిలా తిరిగి
పలు దృశ్యాల సమాహారాన్ని
జాగ్రత్తగా జేబులో పేర్చుకొని
ఏ అర్ధరాత్రికో అపరాత్రికో 
మెల్లగా ఇల్లు చేరుకుంటుంది -

దాని అసలు రంగు ఎలా ఉండేదో 
అస్సలు గుర్తుకు రావడం లేదు
ఎండకు ఎండి వానకు తడిసి 
చివికి చిరగడానికి సిద్ధంగా ఉంది -

చెమట వాసన...
ఉతికి ఎన్నాళ్లైందో..?
ఉతకడానికసలు సమయం  దొరికితేగా?
ఏరోజుకారోజు రేపటికి వాయిదా వేసుకుంటూ
తనని తానే తిట్టుకుంటూ
అలా వేళ్లాడ్డానికి అలవాటు పడిపోయింది జీవితం..
ప్రతి రాత్రీ దానికి ఉరేసినా చావదు సరికదా..  
మళ్ళీ పొద్దున్నే తయారై పోతుంది
సిగ్గులేకుండా బయట పడ్డానికి..
అదే చెమట వాసనతో..కుళ్ళు కంపుతో -

ఏదో ఒక రోజు దాన్ని ఉతికెయ్యాలి..
చిరిగి పీలికలైనా పరవాలేదు -
దానికి పట్టిన కుళ్ళు వాసన పోతే చాలు..
దాని అసలు వన్నె తిరిగి కనపడితే చాలు!   

No comments:

Post a Comment