04 February 2013

లేడి న్యాయం



అదొక అడవి...
అక్కడ క్రూరత్వం
నిప్పులు కక్కుతూ తాండవిస్తుంది..
అక్కడ పైశాచికం
కోరలు విప్పుకొని
పహారా కాస్తుంది..
మాటువేసిన పులులు
లేడినెత్తురు ఇచ్చే వెచ్చదనంకోసం
వెతుకుతూ ఉంటాయి..
అక్కడ పులికి పాముతో చెలిమి -
నక్కకు తోడేలుతో చనువు -
అది అడవి..
అక్కడ చెల్లేది పులి న్యాయం..
లేడిగా పుట్టడమే శాపం -
పులిని ఎదిరించడం అక్రమం -
పక్షులు ఎంత రోదించినా
పులులు కనికరించవు..
ఏనుగులెన్ని ఘీంకరించినా
అవి భయపడవు..
అవి క్రూర మృగాలు -
మానవత్వానికి ఆమడ దూరంలో
మదమెక్కి తిరుగుతున్న
దానవ చిహ్నాలు -
నిర్భయ ముద్రలు 
వాటి బుద్ధులు మార్చలేవు
అక్కడ పులిని వేటాడే లేళ్ళు కావాలి..
తోడేళ్ళను వెంటాడే నెమళ్ళు రావాలి..
లేడి నెత్తురు మరగాలి..
పులి పొగరు అణగాలి..
ఆటవిక న్యాయం అంతరించాలి!

No comments:

Post a Comment