26 February 2013

తిరిగిరాని లోకాలు



ఇంట్లో నేనెన్నో వాణ్ణో
నన్నుకన్నవాళ్లకే యాదుండదు 
అది ఇల్లో...బందెలదొడ్డో.. 
సమజ్జేసుకోవడం కష్టమే
తిండానికి లేక 
ఎన్ని దినాలు ఖాళీ కడుపుతో నిద్రపోయానో... 
రోజూ బడికిపొయ్యే పిల్లల్ని చూసి 
నాకూ చదువుకోవాలనిపించేది
నన్ను స్కూలుకెందుకు పంపడంలేదో 
మొదట్లో అర్ధమయ్యేది కాదు
తరవాత తెల్సింది అది నా నసీబులో లేదని..

ఎందుకు బతుకుతున్నానో తెలీదు
ఇకముందెలా బతకాలో అంతకంటే తెలీదు
మా ఇంట్లోనే కాదు చుట్టుపక్కలున్న 
ఇళ్లన్నిట్లో ఇదే పరేషానీ 

మా పక్కింటి ఖాసింభాయ్ వద్దకు  
ఎవరో వస్తుండేవాళ్లు
బాబానడిగితే వాళ్లగురించెప్పుడూ
ఆరా తీయొద్దన్నాడు
నా దోస్తులు కొంతమంది ఉన్నట్టుండి
కనిపించకుండాపొయ్యేవారు
అప్పుడప్పుడూ పక్కిళ్లలో ఏడుపులు వినిపించేవి
ఎవరో వచ్చి వాళ్లను ఓదార్చే వాళ్ళు
దేశంలో ఎప్పుడు ఎక్కడ బాంబు విస్ఫోటం జరిగినా
పోలీస్ సోదాలు, ఎవరో ఒకర్ని  పట్టుకుపోవడాలు
మాకు అలవాటై పోయాయ్... 

ఒకరోజెందుకో బాబా చాలా గాభరాగా ఉన్నాడు
ఏమైందని అడిగా - 
బాబా కంటినిండా నీళ్లు..
దగ్గరకు తీసుకున్నాడు..
ఈ బాంబులు వెయ్యడాలూ, ప్రాణాలు తియ్యడాలూ మనకొద్దంటూ 
నన్ను పొదివిపట్టుకున్నాడు
ఆ ఖాసింభాయ్ తో ఎప్పుడూ మాట్లాడొద్దన్నాడు  
నాకేదో మెల్లగా అర్ధమైంది  
గల్లీలో నాదోస్తులెందుకు మాయమౌతున్నారో తెలిసింది
అప్పుడే నిర్ణయించుకున్నా...
జీవితంలో తప్పుదోవ పట్టొద్దని.. 
కష్టపడుతూ బతకడంలోనే ఖుషీ ఉందని..

మా ఇలాకాలోకి ఇంకా ఎవరో వస్తూనే ఉన్నారు..
మా పేటలోని యువకులు తిరిగిరాని చోటికి పోతూనే ఉన్నారు!  

No comments:

Post a Comment