26 February 2013

అడవి ఆవేదన



ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే ప్రయత్నిస్తుంది
అడవి -  
చేతులు నరికేసినా.. 
కాళ్లు తెగ్గోసినా..
తిరిగి పచ్చగా ఎదగాలనే కోరుకుంటుంది..
విస్తరించే అడవిని కత్తిరించి
కాంక్రీటుతో ప్లాస్టిక్ సర్జరీ చేసినా
చూస్తూ ఏమీ అనదు -
తన కన్నీరు ఇంకిపోయేవరకు
మౌనంగా రోదిస్తుంది తప్ప - 

అడవికి నిప్పంటించి,  దాని శ్వాసను బంధించి
గొంతునొక్కేసినా...తన పిల్లన గ్రోవి పిలుపులతో
జోల పాడాలనే తాపత్రయపడుతుంది -  
కోయిల వినిపించే  కమ్మని పాటలకు
నెమలి ఆడే  చక్కని నాట్యాలకు 
చిలుకమ్మ పిలిచే మధురమైన  పిలుపులకు
దూరం చేసినా....
అందరి సంతోషాన్నే కోరుకుంటుంది 

కానీ.... మేఘాలు గర్జించి, 
ఆకాశం శోక భరితయై
నాగరికతను ముంచెత్తుతుంటే...
సముద్రాలు ఆక్రోశించి,
ఉవ్వెత్తున ఎగసి పడుతూ   
నగరాలను తుడిచేస్తుంటే..
కాళ్లూ చేతులూ తెగిన అడవి
నిస్సహాయురాలై చూస్తూ ఏడుస్తుంది..
రాల్చడానికి ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా మిగలక
నిశ్చేష్టురాలై నిలబడుతుంది! 

No comments:

Post a Comment